మూఢ నమ్మకాల చట్రంలో ఆదివాసీలు

ABN , First Publish Date - 2022-08-14T06:03:10+05:30 IST

తరాలు మారినా ఆదివాసీల్లో మూఢ నమ్మకాలు పోవడం లేదు. ఆధునిక యుగంలో కూడా నాటు వైద్యం, పసర వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. వ్యాధి తీవ్రత తగ్గకపోతే గొరవగాళ్లు (భూత వైద్యులు)తో పూజలు చేయిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

మూఢ నమ్మకాల చట్రంలో ఆదివాసీలు
దోషం పోవాలని దారిపెళ్లి చేస్తున్న గొరవగాళ్లు(మాంత్రికులు) (ఫైల్‌)

తరాలు మారినా వీడని నాటు వైద్యం, గొరవగాళ్లతో పూజలు 

పసర మందులను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వైనం

వైద్య ఆరోగ్యశాఖలో సమన్వయ లోపంతో నష్టం

గిరిజనులను చైతన్యపరచడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం

కానరాని చైతన్య కళాజాత కార్యక్రమాలు


తరాలు మారినా ఆదివాసీల్లో మూఢ నమ్మకాలు పోవడం లేదు. ఆధునిక యుగంలో కూడా నాటు వైద్యం, పసర వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. వ్యాధి తీవ్రత తగ్గకపోతే గొరవగాళ్లు (భూత వైద్యులు)తో పూజలు చేయిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మూఢ నమ్మకాలను విడనాడాలని గిరిజనులను చైతన్యపరుస్తూ అధికారులు కళాజాత కార్యక్రమాలు నిర్వహించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. దీంతో గిరిజనులు మళ్లీ మూఢ నమ్మకాలనే అనుసరిస్తున్నారు.


చింతపల్లి, ఆగస్టు 13: జిల్లాలో ఆదివాసీలు ఇప్పటికీ నాటు వైద్యం, మూఢనమ్మకాలను విడిచి పెట్టడం లేదు. వ్యాధులతో బాధపడుతున్న రోగులకు పూజలు చేయిస్తూ నాటు వైద్యం, పసర మందులను ఆశ్రయిస్తున్నారు. దీంతో రోగుల ఆరోగ్య పరిస్థితి క్షీణించి మృత్యువాత పడుతున్నారు. నాటు వైద్యం, మూఢ నమ్మకాలపై ఆదివాసీలను చైతన్యపరచడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. మూఢ నమ్మకాలు, నాటు వైద్యం విడిచిపెట్టాలని, వ్యాధి సోకిన వెంటనే ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఆదివాసీలు ఆధునిక యుగంలోనూ నాటువైద్యం, పసర మందులపై ఆధారపడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఎపిడమిక్‌ సీజన్‌ నడుస్తున్నది. ప్రతి ఏటా ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు వైద్య ఆరోగ్యశాఖ ఎపిడమిక్‌ సీజన్‌గా పరిగణిస్తుంది. ఈ సీజన్‌లో గిరిజన గ్రామాల్లో మలేరియా, టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాలు, అతిసార వ్యాధులు అధికంగా ప్రబలుతుంటాయి. వ్యాధి సోకిన వెంటనే ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకునే ఆదివాసీలు అరుదు.  వ్యాధి సోకిన వెంటనే ప్రథమ చికిత్సగా సంప్రదాయ వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అప్పటికి వ్యాధి తగ్గకపోతే రెండు, మూడు రోజులకు ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్న వారి సంఖ్య అధికంగా కనిపిస్తుంది. మూఢ నమ్మకాలు, నాటు వైద్యాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల గిరిజన గ్రామాల్లో ఆదివాసీలు సకాలంలో సర్కారు వైద్యం పొందడం లేదు. 


పసర మందులతో ప్రాణాల మీదికి..

నాటు వైద్యం, పసర మందులను ఆశ్రయించి ఆదివాసీలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఎపిడమిక్‌ సీజన్‌లో ఒకేసారి గ్రామంలో ఎక్కువ మంది గిరిజనులు వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో ఆదివాసీలు గ్రామానికి దోషం తగిలిందని దారి పూజలు చేస్తున్నారు. ఇటీవల బౌర్తి గ్రామంలో వ్యాధులు ప్రబలడంతో ఆదివాసీలు దారి పూజలు చేశారు. కడుపునొప్పితో బాధపడుతున్న చిన్నారికి పూజలు చేయించారు. దేవరాపల్లి, దామనాపల్లి పంచాయతీలోనూ వ్యాధులు సోకిన వెంటనే రోగులకు గోరవతనం(భూత వైద్యుడితో పూజలు చేయించడం) చేయిస్తుంటారు. ఇటీవల దామనాపల్లి పంచాయతీ గొడుగుమామిడి గ్రామంలో వెంకట్‌ అనే ఎనిమిదేళ్ల బాలుడికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు పసర మందు పడుతూ తీవ్ర నిర్లక్ష్యం చేశారు. చివరి క్షణంలో ఆస్పత్రికి తీసుకొచ్చినప్పటికి పరిస్థితి విషమించి ఈ నెల 7న ఆ బాలుడు మృతి చెందాడు. గిరిజన ప్రాంతంలో ప్రతి ఏడాది పసర మందులు, మూఢనమ్మకాల వల్ల ఆదివాసీలు మృత్యువాత పడుతున్నారు. 


వైద్యశాఖలో సమన్వయలోపం

వైద్య ఆరోగ్యశాఖలో క్షేత్రస్థాయి ఉద్యోగులు, వైద్యులకు మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామాల్లో ప్రాథమిక చికిత్స అందించేందుకు ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎం, హెల్త్‌ అసిస్టెంట్‌(పారా మెడికల్‌ ఉద్యోగులు) అందుబాటులో ఉంటున్నారు. గిరిజన గ్రామాల్లో వ్యాధులు ప్రబలిన వెంటనే ఆశ కార్యకర్త స్థానిక పారామెడికల్‌ ఉద్యోగులకు సమాచారం అందిస్తే వెంటనే ప్రాథమిక చికిత్స అందించే అవకాశముంది. గ్రామంలో అధిక సంఖ్యలో రోగులు ఉంటే క్షేత్ర స్థాయి ఉద్యోగులు వైద్యాధికారి దృష్టికి తీసుకువెళితే ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేసి బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తారు. అయితే ప్రస్తుతం గిరిజన ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, క్షేత్ర స్థాయి ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం కారణంగా ఆదివాసీ రోగులకు సకాలంలో మెరుగైన చికిత్స అందడం లేదు. గొడుగుమాడి గ్రామానికి చెందిన బాలుడు వెంకట్‌ అప్పట్లో వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నప్పటికి క్షేత్ర స్థాయి పారా మెడికల్‌ ఉద్యోగులు గుర్తించలేదు. క్షేత్ర స్థాయి ఉద్యోగులు సకాలంలో గుర్తించి బాలుడిని ఆస్పత్రికి తరలించివుంటే బతికేవాడని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు.


కానరాని కళాజాత కార్యక్రమాలు

మూఢ నమ్మకాలు, పసర మందులపై కళా జాత కార్యక్రమాలు గిరిజన గ్రామాల్లో ఎక్కడా కనిపించడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎపిడమిక్‌ సీజన్‌ ప్రారంభం నుంచే గ్రామాల్లో మూఢ నమ్మకాలు, పసర మందులపై చైతన్యం కల్పిస్తూ కళాజాత కార్యక్రమాలు నిర్వహించేవారు. వ్యాధి సోకిన వెంటనే నాటు వైద్యం, గొరవగాళ్లను ఆశ్రయించరాదని అవగాహన కల్పించేవారు. దీంతో ప్రజలు వ్యాధి సోకిన వెంటనే ఆస్పత్రికి వెళ్లేవారు. గత మూడేళ్లుగా గిరిజన ప్రాంతంలో ఎక్కడా అవగాహన కళాజాత కార్యక్రమాలు ప్రదర్శించకపోవడం వల్ల మళ్లీ ఆదివాసీలు నాటు వైద్యం, మూఢనమ్మకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 


మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాలి

గిరిజన ప్రాంతంలో నాటు వైద్యం, పసర మందులు, మూఢ నమ్మకాలపై ఆదివాసీలకు ప్రభుత్వం అవగాహన కల్పించాలి. కళాజాత కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సకాలంలో రోగులకు మెరుగైన చికిత్స అందించాలి. వ్యాధి సోకిన వెంటనే క్షేత్ర స్థాయి ఉద్యోగులు గుర్తించి బాధితులను ఆస్పత్రికి తరలించాలి. ఆదివాసీల ఆరోగ్యంపై వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. 

- చల్లంగి లక్ష్మణరావు, రిటైర్డ్‌ ఎస్టీవో, చింతపల్లి


Updated Date - 2022-08-14T06:03:10+05:30 IST