అభద్రతలోనే ఆదివాసీలు

ABN , First Publish Date - 2022-08-09T07:17:44+05:30 IST

అభద్రతలోనే ఆదివాసీలు

అభద్రతలోనే ఆదివాసీలు

నేటికీ ఉనికి కోసం పోరాటం

అడవులే వారికి జీవనాధారం

కలగానే స్వయం ప్రతిపత్తి 

నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

అమాయకత్వాన్ని అక్కున చెర్చుకొని అడవితల్లి ఒడిలో తలదాచుకుంటున్న ఆదివాసుల ఉనికి రోజురోజుకు ప్రశ్నార్ధకమవుతుంది. ఖనిజ వనరులను పొత్తిళ్లలో దాచుకున్న అడవితల్లి ఒడిలో ప్రశాంతంగా సాగుతున్న ఆదివాసుల జీవనం కార్పోరేట్‌సంస్ధలు, ప్రభుత్వాల విధానాలతో అడవినుంచి గెంటివేయబడుతున్నారు. కొండలు, వాగుల చెంత తరతరాలుగా స్వేచ్ఛగా జీవించిన ఆదివాసులు నేడు అభద్రతలో కూరుకుపోతున్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75ఏళ్లు దాటినా వారు ఇంకా కనీస సదుపాయాల కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నారంటే పాలకులతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీల జీవనస్థితిగతులపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.. 

భద్రాచలం/ఇల్లెందు టౌన, ఆగస్టు 8: అడవిపై హక్కులు ఒక్కొక్కటిగా చేజారుతుండంతో ఉనికిని, అస్థిత్వాన్ని కోల్పోతున్నామని ఆదివాసీలు తల్లడిల్లుతున్నారు. ఒకప్పుడు ‘జల్‌ జంగల్‌ జమిన’లను స్వేచ్ఛగా అనుభవించిన ఆదివాసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో అడవుల నుంచి తరిమి వేయబడుతున్న పరిణామాలు వారిలో ఆందోళనకు కారణమవుతున్నాయి. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో పోడుభూములనుంచి ఆదివాసులను తరిమివేస్తున్న పరిణామాలతో ఏజెన్సీ ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. వంద రకాల భాషలు మాట్లాడుతూ 461 రకాల తెగలు, ఉప తెగలుగా ఆదివాసులున్న దేశంలో వారి జీవన ప్రమాణాలు మా త్రం అట్టడుగున ఉన్నాయి. పాలకులు మారుతున్నా వారి జీవితాల్లో మార్పులు రాకపోగా మరింత దిగజారిపోతున్నాయి. తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న పోడు భూములు సైతం దక్కకుండా పోతున్న పరిస్థితులు ఆదివాసులను ఆగ్రహోదగ్రులను చేస్తున్నాయి.


ఆదివాసీ దినోత్సవ చరిత్ర నేపథ్యం

అడవి, భూమి, నీరు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం, సం స్కృతి సంప్రదాయాల పరిరక్షణకోసం అనేక పోరాటాలు సా గించి ప్రాణాలు అర్పించిన ఆదివాసీ నేతల త్యాగాల మూ లంగానే నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 70దేశాల్లో 5వేల తెగలకు చెందిన 37కోట్లమంది ఆదివాసీలున్నారు. వీరు 6,700భాషలు మాట్లాడుతున్నట్టు గుర్తించారు. వారి జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుందుకు అన్ని దేశాల్లో ఆదివాసీలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని అంతర్జాతీయసంస్థలు నిర్ణయించినా ఆ దిశగా ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. ప్రతిఏటా ఆదివాసీ ప్రజానీకం తమ హక్కుల పోరాటాల్లో అశువులు బాసిన అమరులను స్మరిస్తూ.. భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకునే రీతిలో ఆదివాసీ ప్రజాసంఘాలు ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. 


స్వయం ప్రతిపత్తి కలేనా? 

దేశంలో అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పదవికి తొలిసారి ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును ఎన్నుకోవడం, భద్రాచలం ఏజెన్సీలోని మణుగూరు మండలం కూనవరం గ్రామానికి చెందిన ఆదివాసీ వాయిద్య కళాకారుడు రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డు దక్కడంతో ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో తమపాలనే సాగాలని ఇందుకు ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి అధికారం ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. ఆదివాసీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చేపట్టిన ఇసుక ర్యాంపుల నిర్వహణలోనూ గిరిజనేతరులే లబ్ధిపొందుతున్నారని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 2022లో వచ్చిన కొత్త చట్టంతో పెసా చట్టాన్ని పాతర వేస్తున్నారని ఆదివాసీ సంఘాలు విమర్శిస్తున్నాయి. తద్వారా ఆదివాసీల అస్తిత్వానికే ప్రమాదం పొంచి ఉందని ఆదివాసీ కొండరెడ్ల సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు ముర్ల రమేష్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-08-09T07:17:44+05:30 IST