మసీదుల్లోని లౌడ్‌స్పీకర్లను ఎలా వాడాలంటే...?

ABN , First Publish Date - 2022-04-15T20:47:59+05:30 IST

మసీదుల్లోని లౌడ్‌స్పీకర్లను తొలగించడానికి బదులు, పెరుగుతున్న ధరల

మసీదుల్లోని లౌడ్‌స్పీకర్లను ఎలా వాడాలంటే...?

ముంబై : మసీదుల్లోని లౌడ్‌స్పీకర్లను తొలగించడానికి బదులు, పెరుగుతున్న ధరల గురించి మాట్లాడటానికి వాటిని ఉపయోగించాలని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే చెప్పారు. ద్రవ్యోల్బణం, పెట్రోలు, డీజిల్, సీఎన్‌జీ ధరల పెరుగుదల గురించి వివరించడానికి ఉపయోగించాలన్నారు. ఎంఎన్ఎస్ డిమాండ్ నేపథ్యంలో ఆయన ఈ సలహా ఇచ్చారు. 


మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే గుడి పడవ (మరాఠీల ఉగాది పండుగ) సందర్భంగా మాట్లాడుతూ, మే 3నాటికి మసీదుల్లోని లౌడ్‌స్పీకర్లను తొలగించాలని హెచ్చరించిన సంగతి తెలిసిందే. తన డిమాండ్‌ను నెరవేర్చకపోతే తాము మసీదుల వద్ద హనుమాన్ చాలీసాను వినిపిస్తామని చెప్పారు. 


ఈ నేపథ్యంలో ఆదిత్య థాకరే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మసీదుల్లోని లౌడ్‌స్పీకర్లను తొలగించడానికి బదులు ద్రవ్యోల్బణం, పెట్రోలు, డీజిల్, సీఎన్‌జీ ధరల పెరుగుదల గురించి వివరించడానికి ఉపయోగించాలన్నారు. గడచిన 60 ఏళ్ళకు సంబంధించిన సమాచారాన్ని కాకుండా, ఇటీవలి రెండు, మూడేళ్ళకు సంబంధించిన గణాంకాలను పరిశీలించాలన్నారు. 


ఎంఎన్ఎస్ డిమాండ్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, రాష్ట్రంలో వాతావరణాన్ని చెడగొట్టేందుకు ఎవరినీ అనుమతించబోమని తెలిపింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, లౌడ్‌స్పీకర్ల నుంచి వెలువడే శబ్ద తీవ్రత నియంత్రణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ మాట్లాడుతూ, రాజ్ థాకరేకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. ఎన్‌‌సీపీ నేత జయంత్ పాటిల్ మాట్లాడుతూ, రాజ్ థాకరే బీజేపీ తరపున పని చేస్తున్నారని ఆరోపించారు. 


ఇదిలావుండగా, రాజ్ థాకరే డిమాండ్ నేపథ్యంలో ఎంఎన్ఎస్ నుంచి ముస్లిం నేతలు వైదొలగుతున్నారు. 


Updated Date - 2022-04-15T20:47:59+05:30 IST