సర్వచైతన్య రూపిణికి నమోస్తు..

ABN , First Publish Date - 2020-11-08T09:01:05+05:30 IST

సకల చరాచర సృష్టి చైతన్యమే ఆకారమయినది... అన్నింటి కన్నా ముందు ఉన్నది.. అన్ని విద్యలకూ మూలమైనది అయిన ఆ ఆదిశక్తిని.. ‘

సర్వచైతన్య రూపిణికి నమోస్తు..

సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ 

ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్‌!


సకల చరాచర సృష్టి చైతన్యమే ఆకారమయినది... అన్నింటి కన్నా ముందు ఉన్నది.. అన్ని విద్యలకూ మూలమైనది అయిన ఆ ఆదిశక్తిని.. ‘బుద్ధిం యా నః ప్రచోదయాత్‌’ ..అనగా, మా బుద్ధిని ప్రచోదన చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అని దీని అర్థం. దీన్నే సర్వ గాయత్రి మంత్రంగా చెపుతారు.  ‘గాయంతాం త్రాయతే ఇతి గాయత్రి’. ఎవరైతే తనను పాడుతారో వారిని కాపాడేది గాయత్రి. కాబట్టి ఈ మంత్రాన్ని ఎవరైనా అనుష్ఠించవచ్చని పెద్దలు చెపుతారు. సహజంగా మానవుని మేధ ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి తగ్గుతూ ఉంటుంది. మేధ పెరిగినప్పుడు అహంకారం పెరిగి ప్రకృతిని శాసించాలని చూస్తాడు. అలాగే తగ్గినప్పుడు అసహాయ స్థితిలో ప్రకృతితో సహజీవనానికై పరితపిస్తాడు. మన కర్మల ఫలితాలే మన అనుభవాలని. ప్రకృతి పట్ల మనం అనుసరిస్తున్న వైఖరే ప్రకృతి వైపరీత్యాలకు మూలమనే సత్యాన్ని విస్మరిస్తాడు.


మన బుద్ధి.. మంచి చెడ్డలను వేరుపరచి, మంచిని స్వీకరించమంటుంది. అహంకారాన్ని ఆశ్రయించిన స్వార్థం.. బుద్ధి మాటలను పెడచెవిన పెట్టి వినాశం వైపు నడవమంటుంది. మనిషి స్వతహాగా స్వతంత్రుడు. స్వతంత్రత పరస్పరాధారితమై వ్యష్టిని సమష్టివైపు నడపడం ఆదరణీయం. బుద్ధి సంయమనతతో సన్మార్గంలో నడుస్తూ సహనం, సౌశీల్యతలతో జతకడితే తనకూ సమాజానికి శ్రేయస్కరమౌతుంది. అలాంటి వ్యక్తిత్వం ఉత్తమ వ్యక్తిత్వంగా పరిగణించబడుతుంది. అదే స్వతంత్రత.. అసహనం, అవివేకతలతో జతకడితే దుఃఖభరితమై తనకు సమాజానికి కీడు కలిగిస్తుంది. అందుకే ‘బుద్ధిః కర్మానుసారిణి’ అంటారు. మనం చేసే కర్మల ప్రాతిపదికగా బుద్ధి యొక్క వికసన ఉంటుంది. అయితే నిరంతర ప్రయత్నం చెడు కర్మల నుండి కూడా విముక్తం చేస్తుంది. అందుకే బుద్ధిని ప్రచోదన చేయమని అమ్మను ప్రార్థించడం. పరిస్థితులననుసరించి నడవడం నేర్పేది వివేచన. అనువుగాని చోట అధికులమనరాదు అంటుంది వివేచన. ఎవరైనా చెడుగా మాట్లాడినా దానిని ప్రచారం చేయవద్దని, స్థాయిని దిగజార్చే పనులు చేయవద్దని చెబుతుందది. వీటిని అనుమోదించే వ్యక్తిత్వం తాను సుఖమయ జీవితాన్ని గడపమే కాక పరుల జీవితాలలో కూడా వెలుగును నింపుతుంది.


వికసించిన బుద్ధి విస్తరిస్తుంది. విస్తరణ వ్యాప్తమౌతుంది. విచక్షణాయుతమైన బుద్ధి వ్యాప్తమై సమాజంలో ప్రతిష్ఠితమైతే సమాజానికి అభ్యుదయం కలుగుతుంది. సమాజం శ్రేయోమార్గంలో పయనిస్తుంది. అందుకే దుర్భావనలకు దూరంగా బుద్ధిని ప్రచోదన చేసి మనందరినీ నడిపించ వలసిందిగా ఆ గాయత్రీ మాతను ప్రార్థించాలి.


పాలకుర్తి రామమూర్తి

Updated Date - 2020-11-08T09:01:05+05:30 IST