కేంద్రం సొమ్ముతో నవరత్నాలకు సోకులు

ABN , First Publish Date - 2020-05-24T08:58:15+05:30 IST

కేంద్రం సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలకు సోకులు చేస్తూ గొప్పలు పోతోందని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు.

కేంద్రం సొమ్ముతో నవరత్నాలకు సోకులు

రాష్ట్రం తీరు దారుణం.. బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి


అనంతపురం, మే 23 (ఆంధ్రజ్యోతి): కేంద్రం సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలకు సోకులు చేస్తూ గొప్పలు పోతోందని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన స్థానిక మున్సిపల్‌ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. కరోనా విపత్తులో కేంద్రం పేదలకిచ్చిన రూ.1000 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలోకి వేసుకోవటం దారుణమన్నారు. సొమ్మొకరిది.. సోకొకరిదన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని ఎద్దేవా చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలించిందన్నారు. ఈ తరహా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవాలనే ప్రధానమంత్రి రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారన్నారు. ఇదో సంజీవని పథకమన్నారు. దీనిపై విమర్శలు సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు దారుణంగా ఉందన్నారు.


కోర్టు తీర్పులను సైతం తప్పు పడుతున్నారన్నారు. జడ్జిలకు కులాలను ఆపాదిస్తున్నారంటే ఇంతకన్నా దారుణం ఉండదన్నారు. నియంతలా పాలన చేయటం మినహా ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు జలాలపై ముఖ్యమంత్రి తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. అనంతరం పార్టీ నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు, వజ్ర భాస్కర్‌రెడ్డి, నేతలు అంకాల్‌రెడ్డి, చిరంజీవిరెడ్డి, జంగటి అమర్‌నాథ్‌, లలిత్‌కుమార్‌, ప్రతా్‌పరెడ్డి, పూల ప్రభాకర్‌, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-24T08:58:15+05:30 IST