ఆయనలో సగం ఆమే!

ABN , First Publish Date - 2020-03-06T05:35:29+05:30 IST

ఆది యోగి శివుడు పార్వతిని తన శరీరంలో భాగంగా చేసుకున్నాడు. ‘సగం స్త్రీ- సగం పురుషుడు’గా ఉండే అర్ధ నారీశ్వర రూపం ధరించాడు. ఆయనలో...

ఆయనలో సగం ఆమే!

ఆది యోగి శివుడు పార్వతిని తన శరీరంలో భాగంగా చేసుకున్నాడు. ‘సగం స్త్రీ- సగం పురుషుడు’గా ఉండే అర్ధ నారీశ్వర రూపం ధరించాడు. ఆయనలో సగం భాగం స్త్రీ! కనుకనే ఆయన పురుషులలో సర్వశ్రేష్ఠుడైన పరమ పురుషుడయ్యాడు. ఇదంతా జీవితానికి సంబంధించిన ఒక తాత్త్విక సత్యాన్ని మానవులకు గుర్తు చేయడానికే!  


భౌతికంగా కనిపించే అన్ని లక్షణాలకూ రెండు వ్యతిరేక ధ్రువాలు ఉంటూ ఉంటాయి. ‘పాజిటివ్‌-నెగెటివ్‌’, ‘పురుషుడు- స్త్రీ’,  ‘శివుడు- శక్తి’... ఇలా ఇవి అనంతం. ఈ రెండు ధ్రువాలనూ విభజించి చూస్తూ, ఆ ధ్రువం గొప్ప, ఈ ధ్రువం గొప్ప అని ఆలోచిస్తే వాటి మధ్య తగవులూ, తీర్పులూ తలెత్తి తీరుతాయి. ఇలాంటి వాటితో ఎంతో అయోమయం, ఎన్నో విధాలైన వికృత స్పందనలూ, ఎన్నో రకాల దోపిడీలూ, పరపీడనలూ పుట్టుకొచ్చాయి. 


అసలు ‘స్త్రీత్వం- పురుషత్వం’ అంటే ఏమిటి? ఒక వ్యక్తిలో స్త్రీ సహజమైన ధర్మాలో, పురుష సహజమైన లక్షణాలో ఒక దాని కన్నా మరొకటి కొంత హెచ్చుగా, ప్రస్ఫుటంగా కనిపించడం మాత్రమే! ఒకరు స్త్రీ రూపంలో ఉన్నంత మాత్రాన తండ్రి నుంచి సంక్రమించే పురుష సహజమైన లక్షణాలు అసలు లేనే లేవని కాదు. అలాగే పురుషులలో కూడా తల్లి నుంచి వచ్చే స్త్రీ సహజమైన లక్షణాలు కొన్ని ఉండి తీరుతాయి. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తి తనలో అంతర్గతంగా ఉన్న పురుష- స్త్రీ ధర్మాలు రెండిటినీ ఒక సమన్వయంతో చూడాలి. అప్పుడే అతడు మానవుడిగా ఒక సమతుల్యతతో ఉండగలుగుతాడు. సమాజంలో ఈ రకమైన సమతుల్యత అవసరం. స్త్రీలు, పురుషులు ఎవరికి వారు తామే గొప్ప అని భావిస్తూ పోతే మానవ జాతి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమతుల్యతను అలవరచుకోవాలి. అప్పుడే జీవితాలు క్షేమంగా సాగుతాయి.


ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే- భౌతిక శరీర నిర్మాణ పరిమితులకు అతీతమైన స్థాయికి అనుభూతి పూర్వకంగా చేరడం! ఒకరి జీవితానుభవం ఆ వ్యక్తి భౌతిక శరీర నిర్మాణ భేదాలకు అతీతమై ఉన్నప్పుడు, శరీర నిర్మాణం రీత్యా  పురుషుడైతేనేం, స్త్రీ అయితేనేం? జీవితంలో ఒక వ్యక్తి  స్త్రీగానో, పురుషుడిగానో తన పాత్ర  పోషించవలసి వచ్చేది కొన్ని సందర్భాలలో మాత్రమే! అలాంటప్పుడు ప్రతి సందర్భంలోనూ, అనుక్షణమూ ఈ స్త్రీ, పురుష భేదాన్ని చర్చలోకి తీసుకురావలసిన అవసరమే లేదు. కానీ ఇప్పటికీ మనం ఆ లింగ భేదం మీద ఆధారపడిన అస్తిత్వానికి అవసరానికి మించిన ప్రాధాన్యం ఇస్తున్నాం. దీనివల్ల స్త్రీజాతి సంక్షేమంలో మార్పురాదు. ఒక వ్యక్తి సామాన్య విధులు నిర్వర్తించేటప్పుడు స్త్రీలా, పురుషులా అనే ప్రశ్నకు తావే ఉండకూడదు. అలాంటి సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. సామాజికమైన సమతుల్యత ద్వారా మాత్రమే మహిళలు సాధికారత సాధ్యం అవుతుంది. 


సమాజంలో ఘర్షణలు నెలకొని ఉంటే, పురుషుడు పై చేయి సాధించడం సహజం. సమతూకం, స్థిరత్వం ఉన్న సమాజంలో మాత్రమే స్త్రీలు తమ శక్తియుక్తులను పూర్తిగా ప్రకటించగలుగుతారు. మహిళలు అలా ప్రకటించడం నేడు ప్రపంచంలోని అతి కొద్ది సమాజాలలో మాత్రమే జరుగుతోంది. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం వల్ల  స్త్రీలు, పురుషులు సరిసమానంగా భాగస్వాములు కావడానికి అనువైన భౌతిక ప్రపంచం ఏర్పడింది. ఇలాగే స్త్రీ, పురుషులు సమానంగా పాలు పంచుకోగల ఆధ్యాత్మిక, మనో వైజ్ఞానిక ప్రపంచాలను ఏర్పాటు చేసుకోవడానికి అనువైన సమయం వచ్చింది. స్త్రీత్వ, పురుషత్వ ధర్మాలు రెండూ సమానంగా పని చేస్తేనే, మనుషులు అంతర్గతమైన వికాసాన్ని అనుభవించగలుగుతారు. జీవితానుభవాలలో శిఖరాగ్రాలు ఎలా ఉంటాయో గ్రహించగలుగుతారు.


-సద్గురు జగ్గీవాసుదేవ్‌

Updated Date - 2020-03-06T05:35:29+05:30 IST