కైలాస వాహనంపై ఆది దంపతులు

ABN , First Publish Date - 2022-01-17T05:40:18+05:30 IST

మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కైలాస వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

కైలాస వాహనంపై ఆది దంపతులు

కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం, జనవరి 16: మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కైలాస వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించారు. అనంతరం చండీశ్వర స్వామికి జపాలు, రుద్ర పారాయణాలు చతుర్వేద పారాయణాలు నిర్వహించారు.  సాయంత్రం ఉత్సవ మూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో  కైలాస వాహనంపై ఆశీనులను చేసి పూజలు నిర్వహించి, మంగళవాయిద్యాల నడుమ  ఊరేగించారు. క్షేత్రంలో గో పూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

నేడు నాగవల్లి
 
మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఆరో రోజు స్వామి వార్లకు ప్రాతఃకాల పూజల అనంతరం పూర్ణాహుతి అవబృధం, కలశోద్వాసన, వసంతోత్సవం,  తీర్థప్రసాద వితరణ, విశేషార్చనలు జరపనున్నారు. సాయంత్రం సదస్యం, నాగవల్లి నిర్వహించనున్నారు.

లీలా కళ్యాణోత్సవం: బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం స్వామి అమ్మవార్లకు నిత్య కళ్యాణమండపంలో లీలా కళ్యాణోత్సవం నిర్వహించారు.  లీలా కళ్యాణం వలన విశ్వ శాంతి కలుగుతుందని నమ్మకం. గణపతి పూజ అనంతరం కంకణాలకు పూజాదికాలు నిర్వహించి స్వామి అమ్మవార్లకు వారికి కంకణధారణ చేశారు.  కళ్యాణంలో పాల్గొన్న చెంచు భక్తులకు వస్త్రాలను, తీర్థప్రసాదాలను అందజేశారు. సంక్రాంతి బ్రహ్మోత్సవ కళ్యాణానికి చెంచులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. శ్రీశైలం ఐటీడీఏ అధికారుల సహకారంతో చెంచు భక్తులు పార్వతీ కళ్యాణాన్ని వీక్షించేందుకు  ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2022-01-17T05:40:18+05:30 IST