దిగజారుతున్న ప్రతిష్ఠ!

ABN , First Publish Date - 2022-07-30T08:14:24+05:30 IST

నోరుజారాను, క్షమించాలి అంటూ కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకు లేఖ రాయడంతో ఆ వివాదం ముగిసిపోయిందని అనుకోలేం.

దిగజారుతున్న ప్రతిష్ఠ!

నోరుజారాను, క్షమించాలి అంటూ కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి దేశాధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకు లేఖ రాయడంతో ఆ వివాదం ముగిసిపోయిందని అనుకోలేం. ఈ లేఖతో కథ కంచికని కాంగ్రెస్ నేతలు అంటున్నప్పటికీ, అధికారపక్షం అంత తేలికగా వదలకపోవచ్చును. ప్రవక్తనే దూషించిన నేతలను మీ దగ్గర పెట్టుకొని, మా వాడు ఏదో నోరుజారితే ఇంత రాద్ధాంతం చేస్తారా అని కాంగ్రెస్ నాయకులు దబాయిస్తున్నప్పటికీ, జరిగింది తప్పేనని ఆ పార్టీ ఒప్పుకోకతప్పదు. వివాదాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు కూడా చుట్టి, ఆమె కూడా క్షమాపణలు కోరాలని అధికారపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోనియా సభలో దురుసుగా వ్యవహరించారన్న అధికారపక్ష నేతల విమర్శకు ప్రతిగా, ఆమె మీద కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యల సంగతేమిటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రదర్శిస్తున్న దూకుడు వెనుక, గోవాలో ఆమె కుమార్తెను కాంగ్రెస్ ఒక వివాదంలో ఇరికించిన కక్ష ఉన్నదని కొందరి అనుమానం. ఇదంతా చూస్తుంటే, సభను సజావుగా సాగించడం అధికారపక్షానికే కాదు, విపక్షాలకు కూడా ఇష్టం లేదేమోనని అనుమానం కలుగుతోంది. 


రోజుకు కొంతమంది చొప్పున నాలుగురోజులపాటు పాతికపైచిలుకు విపక్ష ఎంపీలను సభనుంచి బహిష్కరించడం ద్వారా అధికారపక్షం ప్రజలకు ఏమి చెప్పదల్చుకున్నదో తెలియదు. సస్పెండైన ఎంపీలంతా గాంధీ బొమ్మ ముందు తిండితింటూ, నిద్రపోతూ యాభై గంటల పాటు నిరసన దీక్షలు చేస్తూ, కనీసం ప్రజల సానుభూతైనా దక్కుతుందేమోనని ఆశించారు. అధికార, విపక్షాలు చట్టసభను ఎన్నికల యుద్ధక్షేత్రంగా మార్చివేయడం ఈ దేశ ప్రజలకు అలవాటే. పార్లమెంటు ముందు వినమ్రంగా సాగిలబడిన పెద్దమనిషి పాలనలో చర్చ అన్నదానికి వీసమెత్తు విలువలేకపోవడం చూస్తున్నదే. సస్పెన్షన్లు, వాయిదాలతో సమావేశాలన్నీ కరిగిపోవడం, ప్రజా సమస్యలను ప్రస్తావించి, కీలకమైన బిల్లుల బాగోగులు నిర్ణయించాల్సిన ప్రజాప్రతినిధులు చర్చకు ఏ మాత్రం అవకాశంలేని వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగానే సృష్టిస్తూ, కేవలం రచ్చతో సమావేశాలను గట్టెక్కించడం విషాదం. మాటలు కోటలు దాటడం, విమర్శ హద్దులు చెరిగిపోవడం, నిరసన వికృతరూపాలను సంతరించుకోవడం బాధ కలిగిస్తున్న విషయం. సభాపతి దృష్టిలో సస్పెండ్ చేయవలసినంత తీవ్రమైన వాతావరణం చోటుచేసుకొని ఉండవచ్చు కానీ, శాసనసభల్లో మాత్రమే దర్శనమిచ్చే ఈ దుష్టసంప్రదాయాన్ని పార్లమెంటుకు తీసుకురాకుండా ఉంటే ఎంతో బాగుండేది. మాట, నిరసన హుందాతనాన్ని కోల్పోయి, గందరగోళం సభా సంప్రదాయంగా మారిపోయినప్పుడు ఇలా సభ్యులను తరిమేయడం తప్ప మరో మార్గం లేదని అనుకుంటే చట్టసభలెందుకు, మనది ఘనతవహించిన ప్రజాస్వామ్యమని చెప్పుకోవడం ఎందుకు?


సభారంభానికి ముందు విపక్షాల మాటలు జనం నమ్మారు. ధరల పెరుగుదల, జీఎస్టీ కొత్తబాదుడు, దేశరక్షణలో కూడా కాంట్రాక్టువిధానాన్ని తెచ్చిపెట్టిన అగ్నిపథ్ పథకం, బుల్‌డోజర్ విధ్వంసాలు, మతవిద్వేషాలు, పరస్పర దాడులు ఇత్యాది విషయాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయని ఆశపడ్డారు. ప్రస్తావనకు విపక్షాలను అనుమతించి, జవాబులతో పాలకపక్షం పూర్తిగా సంసిద్ధమైరావడమన్న ఆదర్శవంతమైన కాలం ఎప్పుడో గతించిపోయింది. పాలకపక్షం సహకరించదనీ, తమకు అడ్డుపడుతుందనీ తెలిసినప్పుడు ప్రజలపక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసినవారు మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలి. కానీ, బాహాబాహీ యుద్ధాలతో తమను తాము నిరూపించుకొనే ప్రయత్నాల వల్ల ఏ ప్రయోజనం లేదు. ఇటువంటి దృశ్యాలకంటే, ఓ మంచి ప్రశ్న, ఒక బలమైన వ్యాఖ్య, ఒక లోతైన విశ్లేషణ కచ్చితంగా ప్రజల మనసును తాకుతాయి. ప్లకార్డులు, నిరసనలు, తగినసమయం కోసం డిమాండ్లు  ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని నేటి పాలకులకు తెలియదు. సభను సజావుగా నడిపే అంతిమబాధ్యత తమదేనన్న స్పృహ కూడా పాలకపక్షానికి లేదు. చర్చకు అవకాశం ఇవ్వకుండా, సమాధానం చెప్పకోవాల్సిన అగత్యం లేకుండా, సస్పెన్షన్ల ద్వారా కొందరిని బయటకు నెట్టి, కీలకమైన బిల్లులను మూకబలంతో ఆమోదింపచేసుకొని సమావేశాలకు స్వస్తిచెప్పాలన్నది అధికారపక్షం ప్రయత్నం. బిల్లులు అడ్డతోవలో ఆమోదం పొందుతున్నాయని సభ బయట విమర్శలు చేస్తున్న విపక్షనేతలు ఆ పాచికలు పారకుండా వ్యవహరించడానికి బదులు ఆ వలలో చిక్కుకోవడం విచిత్రం.

Updated Date - 2022-07-30T08:14:24+05:30 IST