వారు మీరేనా..?

ABN , First Publish Date - 2022-09-18T05:23:44+05:30 IST

ఆధార్‌ గుర్తింపు అంతా సక్రమమేనా..? ఏదైనా విపరీత పోకడలకు పాల్పడ్డారా ? వ్యక్తిగత గుర్తింపు వేలిముద్ర సవ్యంగానే ఉందా ? సదరు వ్యక్తి నివాసిత ప్రాంతం నిజమేనా ? ఈ ప్రశ్నలన్నింటికి సరైన నిర్ధారణకు వచ్చేందుకు కేంద్రం రంగంలోకి దిగింది.

వారు మీరేనా..?

2010–15 ఆధార్‌ కార్డులు మరోసారి నిర్ధారణ

జనంపై కేంద్రం మరో పిడుగు

ఇప్పటికే తిప్పలు పడుతున్న జనం

లక్షల మంది ఇక పడిగాపులు కాయాల్సిందేనా

దీనికి కూడా జనం నెత్తిన రూ.50 భారం

అధికారులు, సిబ్బందికి శిక్షణ ఆరంభం

మూడు నెలల్లో ముగిసేలా టార్గెట్‌

అప్పుడే తొంగి చూస్తున్న అనుమానాలు


ఆధార్‌ గుర్తింపు అంతా సక్రమమేనా..? ఏదైనా విపరీత పోకడలకు పాల్పడ్డారా ? వ్యక్తిగత గుర్తింపు వేలిముద్ర సవ్యంగానే ఉందా ? సదరు వ్యక్తి నివాసిత ప్రాంతం నిజమేనా ? ఈ ప్రశ్నలన్నింటికి సరైన నిర్ధారణకు వచ్చేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. 2010–15 నడుమ ఐదేళ్ళపాటు ఆధార్‌ కార్డు పొందిన లక్షలాది మందికి మరోసారి ఐడెంటిఫికేషన్‌ నిర్ధారణకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. జిల్లా కలెక్టర్లకు నిర్ధిష్ట సంకేతాలు ఇచ్చింది. ఈ ఐదేళ్ళల్లోనే ఎంత మంది ఆధార్‌ కార్డు పొందారో గ్రామాల వారీగా డేటా విడుదలకు సిద్ధపడు తున్నారు. ఈ ప్రక్రియను మంగళవారం నుంచి ఆరంభించి మూడు నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. 


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

వాస్తవానికి ఆధార్‌ కార్డు పొందాల నుకున్న సమయంలోనే ఆయా వ్యక్తుల కంటి రెప్పలు, వేలిముద్రలను నమోదు చేశారు. సరైన నిర్ధారణతోనే అప్పట్లో కార్డు జారీచేశారు. కాని ఆ నిర్ధిష్ట కాలంలో ఆధార్‌ను కొందరు అక్రమ మార్గాన పొందారనే అనుమానంతో  కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు జల్లెడ పట్టాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగానే కేంద్రం జనం నెత్తిన ఇలాంటి పిడుగు పడేలా చేసింది. వాస్తవానికి ఆధార్‌ కార్డు నమోదులో అప్పటికప్పుడు అనేక తప్పొప్పులు దొర్లాయి. పేర్లు, స్వస్థలం, వయస్సు, పుట్టిన తేదీ, ఇంటి పేరు, అడ్రస్సు నమోదులో వరుసగా చాలా మందికి తప్పులు దొర్లాయి. చాలా కాలం తరువాత ఆధార్‌లో తప్పులను సరిదిద్దుకునే అవకాశం కల్పించడమేకాక ఆధార్‌ సేవా కేంద్రాలను ఎక్కడికక్కడ అనుమతిచ్చారు. దీంతో మీ–సేవ కేంద్రంలో ఈ తప్పులన్ని సరిదిద్దడానికి ఏళ్లు గడిచాయి. ఇంటి నివాస ప్రాంత అడ్రస్‌ మార్పు చేయాలన్నా, పుట్టిన తేదీ సవరించుకోవాలన్నా, సెల్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవాలన్నా జనం తిప్పలు పడ్డారు. రోజంతా పని మానేసి ఆధార్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రతీ అంశానికి ప్రభుత్వాలు ఆధార్‌తో ముడి పెట్టడం, రుణాల దగ్గర నుంచి చావు, పెళ్ళిళ్ళ వరకు ఆధార్‌ను అనుసంధానం చేయాల్సి రావడంతో కొన్నేళ్ళపాటు మీ–సేవ కేంద్రాలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. 2010–15 సంవత్సరాల మధ్య కొందరు సరైన ధ్రువీకరణ లేకుండానే ఆధార్‌ కార్డులు పొందినట్టు అనుమానిస్తున్నారు. దీనిని జల్లెడ పట్టేందుకు వీలుగా తమ ఐడెంటిఫికేషన్‌ మరోసారి రుజువు చేసుకోవాలి.


ఈ ప్రక్రియ ఎలా సాగుతుందంటే..

సాధారణంగా ఆధార్‌ కార్డులో తప్పొప్పులు సరిచేసుకోవడానికి, లేదా నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయాలను, గుర్తించిన మీ–సేవ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఎలాగూ ఆధార్‌ వ్యవహారాలన్నీ ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసేందుకు ఇంకో అవకాశం ఇచ్చింది. సమాంతరంగా పోస్టాఫీసులు, జాతీయ బ్యాంకులు సైతం ఆధార్‌లో వివరాలు సవరించేందుకు, గెజిటెడ్‌ ధ్రువీకరణతో అనుమతిచ్చింది. ఇప్పుడు ఏకంగా లక్షలాది మంది తమ ఆధార్‌ గుర్తింపును మరోసారి నిర్ధారించుకోవాలి. వీరంతా ఆయా ప్రభుత్వ గుర్తింపు కేంద్రాల్లోనే ఈ ప్రక్రియలో పాలు పంచుకోవాలి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తి ఏలూరులో చాలా కాలం నుంచి నివసిస్తూ శాశ్వత నివాసదారుడుగా మారినప్పుడు ఆ విషయాన్ని స్థానిక వీఆర్వో నుంచి నిర్ధారణ లేఖ పొందాలి. ప్రతీ ఒక్కరూ యధావిధిగా మీ–సేవ కేంద్రం, సచివాలయాలకు వెళ్ళి తాము స్థానికంగా నివసిస్తున్నట్టు నిర్ధారించే బ్యాంకు అకౌంటు అడ్రస్సులో గాని, రేషన్‌ కార్డులో గాని సరిపోల్చాలి. ఇతర ప్రాంతాల నుంచి భారత్‌లోకి చొరబాటుదారులు భారీగా చేరడం, వలసలు క్రమేపీ విస్తరించిన క్రమంలో అప్పట్లో వీరంతా అలవోకగా ఆధార్‌ కార్డు పొందారు. ఇప్పుడు దానిని పూర్తిగా నివారించేందుకు వీలుగానే ఈ ప్రక్రియ చేపట్టినట్టు చెబుతున్నారు. 2008 నుంచే ఆధార్‌ కార్డు నమోదు తెర ముందుకు వచ్చింది. 2010–15 తొలినాళ్ళల్లో ఆరంభంలో నమోదు ప్రక్రియ మందకొడిగా సాగినా 2015 నాటికి మరింత విస్తృతమైంది. రానురాను ఇప్పుడు ప్రతీ ఒక్కరూ ఆధార్‌ కలిగి ఉండే నిర్బంధ పరిస్థితి వచ్చింది. 


ఉచితంగా కాదండోయ్‌..

ఆధార్‌ గుర్తింపులో మరోసారి నిర్ధారణకు ఆదేశించిన కేంద్రం ఈ ప్రక్రియను ఉచితంగా చేసేందుకు సిద్ధపడలేదు. ప్రతీ ఒక్కరూ 50 రూపాయలు చెల్లించాలి. మూడు నెలల వ్యవధిలోనే ఈ ‘కార్యం’ పూర్తి చేయాలని లక్ష్యాలు విధించారు. ఈ పక్రియ సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అనేక అనుమానాలు తొంగి చూస్తున్నాయి. ఒకవేళ ఆధార్‌ గుర్తింపు నిర్ధారణను చేయించని వ్యక్తులు ఆధార్‌ విశిష్ట సంఖ్యను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది. గ్రామ, పట్టణ స్థాయిలో ఎక్కడికక్కడ నిర్దేశించిన కాలంలో ఆధార్‌ కార్డులు పొందిన వ్యక్తుల జాబితాలను సిద్ధం చేస్తున్నట్టు మరో సమాచారం. దీనిపై శనివారం సంబంధీకులతో తొలి శిక్షణ ఆన్‌లైన్‌ ద్వారా జరిగింది.


Updated Date - 2022-09-18T05:23:44+05:30 IST