విద్యుత్‌ అధిక బిల్లుపై ఏడీఈ విచారణ

ABN , First Publish Date - 2021-12-02T06:34:26+05:30 IST

వడ్డాది గ్రామంలో మల్లి రత్నం ఇంటి విద్యుత్‌ బిల్లుపై ఈపీడీసీఎల్‌ ఏడీఈ వేణుగోపాల్‌ బుధవారం విచారణ చేపట్టారు.

విద్యుత్‌ అధిక బిల్లుపై ఏడీఈ విచారణ
రూ.158తో ఇచ్చిన రత్నం ఇంటి విద్యుత్‌ బిల్లు

రూ.6.59 లక్షల నుంచి రూ.158కి తగ్గిన బిల్లు

‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌


బుచ్చెయ్యపేట, డిసెంబరు 1: వడ్డాది గ్రామంలో మల్లి రత్నం ఇంటి విద్యుత్‌ బిల్లుపై ఈపీడీసీఎల్‌ ఏడీఈ వేణుగోపాల్‌ బుధవారం విచారణ చేపట్టారు. నిరుపేద మహిళ ఇంటికి రూ.6.59 లక్షల కరెంట్‌ బిల్లు రావడంపై ‘‘గుండె గు‘బిల్లు’’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఈ మేరకు బాధితురాలి ఇంటికి వెళ్లి మీటర్‌ను తనిఖీ చేశారు. రీడింగ్‌ తీయడంలో స్పాట్‌ బిల్లింగ్‌ రీడర్‌ పొరపాటు చేసినట్టు గుర్తించారు. మీటరులో 7815 యూనిట్లు ఉండగా పొరపాటున 78825 యూనిట్లు రీడింగ్‌ తీసి బిల్లు అందించారని గుర్తించి రీడర్‌ రమణమూర్తిని మందలించారు. ఇటువంటి పొరపాట్లు పునరావృతమైతే చర్యలు తప్పవని ఏడీఈ వేణుగోపాల్‌ హెచ్చరించారు. ప్రస్తుతం మీటర్‌లో ఉన్న రీడింగ్‌ మేరకు 65 యూనిట్లు వినియోగించనట్టు గుర్తించి రూ.158కు కొత్త బిల్లు ఇచ్చామని ఆయన చెప్పారు. 

Updated Date - 2021-12-02T06:34:26+05:30 IST