అదనపు రుణం.. గగనం

ABN , First Publish Date - 2022-09-24T05:00:52+05:30 IST

జగనన్న ఇళ్ల నిర్మాణం.. లబ్ధిదారులకు భారంగా మారింది. ప్రభుత్వం ఇస్తున్న యూనిట్‌ వ్యయం సరిపోకపోవడంతో అనేకమంది గృహ నిర్మాణాలకు విముఖత చూపుతున్నారు. కొందరు మధ్యలోనే పనులను నిలిపేస్తున్నారు. పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు డ్వాక్రా మహిళలకు అదనపు రుణం ఇస్తున్నట్లు ప్రకటించింది. కానీ అర్హులందరికీ రుణం అందని పరిస్థితి నెలకొంది.

అదనపు రుణం.. గగనం
ధర్మపురం లేఅవుట్‌ వద్ద ప్రారంభం కాని కాలనీ నిర్మాణాలు

- డ్వాక్రా మహిళలకు పూర్తిస్థాయిలో అందని వైనం
- మధ్యలోనే నిలిచిపోతున్న జగనన్న ఇళ్ల నిర్మాణం
(ఇచ్ఛాపురం రూరల్‌)

జగనన్న ఇళ్ల నిర్మాణం.. లబ్ధిదారులకు భారంగా మారింది. ప్రభుత్వం ఇస్తున్న యూనిట్‌ వ్యయం సరిపోకపోవడంతో అనేకమంది గృహ నిర్మాణాలకు విముఖత చూపుతున్నారు. కొందరు మధ్యలోనే పనులను నిలిపేస్తున్నారు. పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు డ్వాక్రా మహిళలకు అదనపు రుణం ఇస్తున్నట్లు ప్రకటించింది. కానీ అర్హులందరికీ రుణం అందని పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. స్టీలు, సిమెంటు, ఇసుక, ఇటుక, కంకర ధరలు భారీగా పెరగడంతో ఈ డబ్బులు పునాదులకే సరిపోతున్నాయి. దీంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకురావడం లేదు. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీల్లో పక్కాగృహం మంజూరైన మహిళ పొదుపు సంఘంలో ఉన్నా.. లేదా ఆమె భర్త పేరుతో పక్కాగృహం మంజూరైనా ప్రస్తుతం ఇస్తున్న యూనిట్‌ విలువ రూ.1.80 లక్షలతోపాటు అదనంగా రూ. 35వేల నుంచి రూ. 50 వేల వరకూ రుణం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి వద్ద ఉన్న గ్రూపు డబ్బులు కానీ, కమ్యూనిటీ పెట్టుబడి నిధి కానీ, స్త్రీనిధి నుంచి కానీ రుణాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో అదనపు రుణం పొందేందుకు 60 వేలమంది అర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో ఇప్పటివరకు 30,780 మందికి మాత్రమే అదనపు రుణాలు అందించారు. మిగిలినవారంతా డబ్బులు లేక ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేకపోతున్నారు. పొదుపు సంఘాల మహిళలు కూడా కొంతమంది నిర్మాణాలను నిలిపివేశారు. అర్హులందరికీ అదనపు రుణం మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ప్రతీ డ్వాక్రా మహిళకూ..
జిల్లాలో పక్కా గృహం మంజూరైన ప్రతీ డ్వాక్రా మహిళకూ అదనపు రుణం అందజేస్తాం. ఇప్పటివరకు 30,780 మందికి రుణాలు ఇచ్చాం. మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరలో అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. రుణాలు పొందిన వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం.
- విద్యాసాగర్‌, డీఆర్‌డీఏ పీడీ, శ్రీకాకుళం.

 

Updated Date - 2022-09-24T05:00:52+05:30 IST