వరద సాయానికి రూ.5.4 కోట్ల అదనపు నిధులు

ABN , First Publish Date - 2020-07-03T10:15:49+05:30 IST

గోదావరి 2019 వరదల్లో ముంపు ప్రభావాన్ని ఎదుర్కొన్న కుటుంబాలకు రూ. 5 వేల చొప్పున ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రకటించిన

వరద సాయానికి రూ.5.4 కోట్ల అదనపు నిధులు

ట్రెజరీల్లో 113 బిల్లులు నిలిచిపోయాయని కలెక్టరు నివేదికతో కొత్తగా జీవో జారీ


రంపచోడవరం, జులై 2: గోదావరి 2019 వరదల్లో ముంపు ప్రభావాన్ని ఎదుర్కొన్న కుటుంబాలకు రూ. 5 వేల చొప్పున ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సాయాన్ని అమలు చేయడానికి రూ.5.4 కోట్ల అదనపు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం గురువారం మరో జీవోను జారీ చేసింది. గత సంవత్సరం ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో రెండు జీవోలను జారీ చేస్తూ రూ.7.21 కోట్లను    ప్రభుత్వం కేటాయించింది. సదరు నిధులను ఆయా బాధిత కుటుంబాల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని ఆ మేరకు సంబంధిత రెవెన్యూ డివిజనల్‌ అధికార్లకు కలెక్టరు ఆథరైజేషన్‌ ఇచ్చారు.


దీంతో ఆర్డీవోలు ఆయా ట్రెజరీల్లో భిన్నమైన ప్రధాన పద్దు కింద సీఎఫ్‌ ఎంఎస్‌ ద్వారా బిల్లులను సమర్పించారు. కాగా ఆయా ట్రెజరీల్లో ఈ వరద సాయానికి సంబంధించి 113 బిల్లుల చెల్లింపులు జరగకుండా నిలిచిపోయాయి. దీంతో ఈ బిల్లులను ఆమోదించేందుకు వీలుగా ట్రెజరీలను ఆదేశించాలంటూ జిల్లా కలెక్టరు ప్రభుత్వాన్ని కోరడంతో ఆర్థిక శాఖ జూన్‌ 24న ఈ మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరం కింద బడ్జెట్‌ విడుదల ఉత్తర్వులను జారీ చేసింది. తాజాగా వరద బాధితుల సాయం అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది.  

Updated Date - 2020-07-03T10:15:49+05:30 IST