కూడు పెడుతున్న తేనె !

ABN , First Publish Date - 2022-07-07T05:25:32+05:30 IST

ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన స్పృహ కారణంగా తేనె వంటి ప్రకృతి సహజమైన ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుండగా, కొందరు యువకులు ఆ అంశాన్ని ఉపాధి మార్గంగా మలచుకున్నారు. ఎన్నో కంపెనీ లకు చెందిన తేనె మార్కెట్‌లో లభిస్తున్నా, సహజంగా సేకరించిన తేనెకు వి పరీతమైన డిమాండ్‌ ఉంది. దీంతో కొందరు యువకులు తేనెను సేకరించి బాలపల్లె - కుక్కలదొడ్డి మార్గంలో విక్రయిస్తూ పొట్ట పోసుకుంటున్నారు.

కూడు పెడుతున్న తేనె !
విక్రయానికి సిద్ధంగా ఉన్న తేనె

అడవుల్లోకి ప్రవేశం నిషేధించడంతో సేకరణకు ఇబ్బందులు

రైల్వేకోడూరు, జూలై 6: ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన స్పృహ కారణంగా తేనె వంటి ప్రకృతి సహజమైన ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతుండగా, కొందరు యువకులు ఆ అంశాన్ని ఉపాధి మార్గంగా మలచుకున్నారు. ఎన్నో కంపెనీ లకు చెందిన తేనె మార్కెట్‌లో లభిస్తున్నా,  సహజంగా సేకరించిన తేనెకు వి పరీతమైన డిమాండ్‌ ఉంది. దీంతో కొందరు యువకులు తేనెను సేకరించి బాలపల్లె - కుక్కలదొడ్డి మార్గంలో విక్రయిస్తూ పొట్ట పోసుకుంటున్నారు. ఈ మార్గంలో తిరుమల, చెన్న్లెకి ఎక్కువగా వాహనాలు వెళుతుండడం, వారిలో అధిక శాతం తేనె కొంటుండడంతో పూట గడుస్తోందని చెబుతున్నారు.


తేనె సేకరణ ఇలా..

తేనెటీగల్లో చిన్న ఈగలు, పేరీగలని రెండు రకాలున్నాయి. వీటిలో చిన్న ఈగల నుంచి పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ, పేరీగలు కుడితే ఒక్కోసారి ప్రాణహాని కూడా తప్పదు. తేనెను సేకరించుకునేవారు తొలుత అడవుల్లోని వృక్షాలు, పొదల్లో తేనె తుట్టెలను గుర్తిస్తారు. సేకరణకు తేనె సిద్ధంగా ఉన్నట్లు గుర్తించగానే మందపాటి దుస్తులు ధరించి తేనె సేకరిస్తారు. గతంలో అటవీ ప్రాంతాల శివార్లలో నివసించే గిరిజనులు ఎక్కువగా తేనెను సేకరించే వారు. ప్రస్తుతం అడవుల్లోకి ప్రవేశం నిషేధించడంతో తోటల్లో తేనె తుట్టెలను గుర్తించి, సంబంధిత రైతులకు కొంత మొత్తం చెల్లించి తేనె సేకరిస్తున్నారు.


ఔషధ విలువలు.. 

తేనెకు నీరసాన్ని తగ్గించే గుణం ఉంటుంది. జీర్ణశక్తి పెంపొందించడంతో పాటు, చెడు కొవ్వును నిర్మూలించే గుణం, వడదెబ్బ తగిలిన వారు అపస్మారక స్థితిలోకి వెళ్లకుండా చేస్తుందని చెబుతారు. 


బతుకుదెరువు లభిస్తోంది

తేనె  విక్రయంతో జీవనోపాధి లభిస్తోంది. ఒక్క పెద్ద తేనె తుట్టె నుంచి సుమారు 5 లీటర్ల తేనె వస్తుంది. చిన్న తుట్టె అయితే 2 లీటర్ల నుంచి 2.5 లీటర్ల తేనె వస్తుంది. దీన్ని పరిశుభ్రం చేసి, ఎలాంటి కల్లీ చేయకుండా కిలో రూ.400కు విక్రయిస్తాం. ఈ తేనెను చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అందరూ వినియోగించు కోవచ్చు

- దేవరకొండ వెంకటేశ్వర్లు


తేనె తీయడం చాలా కష్టం

తేనె తుట్టె తీయడం చాలా కష్టం. తేనెటీగల దాడి నుంచి శరీరాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది.   పెద్ద ఈగలతో మరింత కష్టంగా ఉంటుంది. ఇవి కుడితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కళ్లు కనిపించేందుకు వీలుగా చిన్న రంధ్రాలున్న మందంగా ఉండే దుస్తులు ధరించి తేనె సేకరిస్తాం. 

- సతీష్‌, స్థానికుడు

Updated Date - 2022-07-07T05:25:32+05:30 IST