వ్యసనాలు.. నేరాలు

ABN , First Publish Date - 2022-04-23T05:46:52+05:30 IST

యువత దారి తప్పుతోందనే కొందరి ఆవేదనను నిజం చేసేలా వరుసగా ఘటనలు జరుగుతున్నాయి.

వ్యసనాలు.. నేరాలు

కౌమార దశలో ప్రతికూల ప్రభావాలు

దారితప్పుతున్న యువత..!

గ్యాంగులుగా ఏర్పడి  హత్యలు చేస్తున్న వైనం


యువత దారి తప్పుతోందనే కొందరి ఆవేదనను నిజం చేసేలా వరుసగా ఘటనలు జరుగుతున్నాయి. వ్యసనాలు, అసాంఘిక కార్యకలాపాలు యువత జీవితాన్ని నేరమయం చేస్తున్నాయి. దీనికి సామాజిక పరిస్థితులే కారణం. నైతిక, సాంస్కృతిక విలువలు ధ్వంసమైపోతున్న తరుణంలో యువత ప్రమాదకరమైన పోకడలు పోతోంది. ఇందులో మైనర్లు కూడా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

 - నంద్యాల, ఆంధ్రజ్యోతి


 రౌడీ షీటర్లతో కలిసి..


 స్నేహితుల ప్రభావం, పక్కవారిని చూసి వ్యసనాలకు లొంగిపోవడం, డబ్బుల ప్రలోభం.. మొదలైన వాటి వల్ల రౌడీషీటర్లతో యువకులు స్నేహాలు పెంచుకుంటున్నారు. రౌడీషీటర్లు నలుగురిని వెంటేసుకొని తిరుగుతూ వారికి అవసరమైనపుడు డబ్బులు, మద్యం అందిస్తూ అసాంఘికంగా తయారు చేస్తున్నారు.  ఈ క్రమంలో నేరాలకు పాల్పడుతున్నారు.  రాజకీయ సభలకు, ర్యాలీలకు మంది అవసరం. కాబట్టి కొందరు రాజకీయ నాయకులు యువకులను వెంట తిప్పుకుంటున్నారు.  తమ వెనుక రౌడీషీటర్లు, పలుకుబడి ఉన్నవారు ఉన్నారనే ధీమాతో యువకులు రెచ్చిపోతున్నారు. తమ ఆధిపత్యం చూపించడం కోసం నేరాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో తెలిసీ తెలియక హత్యలు చేస్తున్నారు. నంద్యాలలో జరిగిన హోం గార్డు హత్య కేసులో నిందితుడైన ఓ మైనరు తన తండ్రి ఓ ప్రముఖ పత్రిక(ఆంధ్రజ్యోతి కాదు)లో పనిచేస్తున్నాడని, తనకేం కాదన్న ధీమాను తన వారి దగ్గర వ్యక్తం చేశాడని సమాచారం. దీన్నిబట్టి చూస్తే నేరం చేసినా తమను ఎవరో ఒకరు కాపాడుతారనే ధైర్యంతోనే యువతలో నేర ప్రవృత్తి పెరుగుతోందని అర్థమవుతోంది.


సినిమాల ప్రభావం..

పిల్లలు కౌమార దశ నుంచి యవ్వన దశలోకి ప్రవేశించే సమయంలో తమకు అంతా తెలుసు అనుకుంటారు. తాము సరైన పనే చేస్తున్నామనే భావనలో ఉంటారు. తల్లిదండ్రులు చెప్పినా వినిపించుకొనే స్థితిలో ఉండరు. మంచేదో, చెడు ఏదో విశ్లేషించే పరిపక్వత ఉండదు. దీనికి సినిమాలు, నేర కథనాలు ప్రేరేపిస్తున్నాయని సామాజిక విశ్లేషకులు అంటున్నారు. సినిమాల్లో టీనేజ్‌ ప్రేమ వల్ల కూడా కౌమారంలోకి ప్రవేశించే పిల్లల్లో నేర ప్రవృత్తిని పెంచుతున్నాయని అంటున్నారు. దీనికి తోడు ఓటీటీలు, యూట్యూబుల్లో లెక్కకు మించి అశ్లీలం, నేర సన్నివేశాలు ఉన్న చిత్రాలు విరివిగా అందుబాటులో ఉన్నాయి. ప్రేమ విఫలమైతే మద్యానికి బానిస కావడం, ఆత్మహత్య చేసుకోవడం, ప్రేమను ఒప్పుకోని అమ్మాయిలపై దాడులు చేయడం వంటి ఘటనలను ఇవన్నీ ప్రేరేపిస్తున్నాయి. 


సామాజిక స్పృహ అవసరం..


గతంలో ఊళ్లు చిన్నగా ఉండేవి. కుటుంబాలు పెద్దగా ఉండేవి. ఓ కుటుంబానికి చెందిన పిల్లలు ఎక్కడైనా కనపడితే ‘నువ్వు ఫలానా వారి అబ్బాయి/అమ్మాయివి కదా!’ అని ఆరా తీసేవారు. దీంతో తాము ఏ చిన్న తప్పు చేసినా ఇంట్లో తెలిసిపోతుందన్న స్పృహతో తప్పు చేయడానికి జంకేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయి. పక్కింట్లో ఎవరు ఉంటున్నారో కూడా తెలియదు. ఎవరు ఏం చేస్తున్నదీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. చదువులో నైతికత, సామాజిక స్పృహ భాగంగా ఉండటం లేదు. 


జిల్లాలో కొన్ని నెలల కిందట ఓ యువకుడు, మైనర్‌ బాలుడితో కలిసి దేవనగర్‌లో ఓ వ్యక్తిని చంపి పోలీసులకు లొంగిపోయాడు. తాను ఒక యువతికి ప్రేమించానని, దానికి యువతి తండ్రి అడ్డొస్తున్నందుకు హత్యకు పాల్పడ్డానని ఆ యువకుడు చెప్పడంతో పోలీసులు నివ్వెరపోయారు.

గతేడాది నంద్యాల శివారుల్లో వెళ్తున్న జంటలపై, వ్యక్తులపై దాడిచేసి నగదు, నగలను దోచుకెళ్లిన కేసుల్లో నిందితులు మైనర్లని పోలీసులు గుర్తించారు.

రెండు నెలల కిందట కొంత మంది యువకులు మద్యం మత్తులో శిల్పానగర్‌కు చెందిన ఓ యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇటీవల నంద్యాలలో హోం గార్డు హత్య కేసులో ముగ్గురు ఇంటర్మీడియట్‌ చదువుతున్న విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ నాలుగు ఘటనల్లో మైనర్లు కూడా ఉన్నారు. బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రయాణించే దశలో దారి తప్పినందు వల్లనే ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలను విశ్లేషిస్తే చిన్నతనంలో తగిన అవగాహన లేక పెడ దోవ పట్టడమే కారణమని తెలుస్తోంది. కుటుంబంలో, విద్యా సంస్థల్లో, మొత్తంగా సమాజంలో పిల్లలు బాధ్యతాయుతమైన యువతగా మారడానికి తగిన వాతావరణం లేదని అర్థమవుతోంది. 


నైతిక విలువలు నేర్పించాలి

నైతిక విలువల పట్ల విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించాలి. పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండేలా చూడాలి. చదువు, కెరీర్‌పై దృష్టి సారించేలా చూడాలి. మానవత్వం గురించి వివరించాలి. సమస్యలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాలి. జీవితమంటే సరదాలు, షికార్లే కాదని చెప్పి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగేలా ప్రోత్సహించాలి. ప్రలోభాలకు గురికాకుండా ఒక కన్నేసి ఉంచాలి. కళాశాలల యాజమాన్యాలు కూడా ఎప్పటికపుడు గమనిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలి.


- సిరిగిరెడ్డి జయారెడ్డి, సైకాలజిస్టు


తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి


యుక్త వయస్సులోకి వచ్చిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఆ వయసు పిల్లలకు తాము  ఏం చేస్తున్నది తెలుసుకొనే పరిణతి ఉండదని అన్నారు. ఈ వయస్సులోనే చెడు అలవాట్లకు, వ్యసనాలకు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని అన్నారు. కాబట్టి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. యువత తప్పుడుదారుల్లో వెళ్లకుండా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలనుకుంటున్నామని తెలిపారు.  


 - రఘువీర్‌రెడ్డి, ఎస్పీ, నంద్యాల

Updated Date - 2022-04-23T05:46:52+05:30 IST