Abn logo
Nov 27 2020 @ 00:00AM

అన్నీ అద్దె భవనాల్లోనే..!

పాలశీతలీకరణ కేంద్రం రైతు సమావేశ భవనంలో కొనసాగుతున్న తహసీల్దార్‌ కార్యాలయం

  • కడ్తాల మండల కేంద్రంలో కనీస సౌకర్యాలు కరువు 
  • మండల కేంద్రంగా ఏర్పాటై నాలుగేళ్లు..
  • ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు కరువు 
  • అమలుకు నోచని నేతల హామీలు.. పట్టించుకోని అధికారులు 

కడ్తాల్‌ : పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016 ఆక్టోబర్‌ 11న కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఉమ్మడి ఆమనగల్లు మండలంలో ఉన్న కర్కల్‌ పహాడ్‌, మైసిగండి, వాసుదేవ్‌పూర్‌, కడ్తాల, ఎక్వాయిపల్లి, ముద్విన్‌, చరికొండ,  తలకొండపల్లి మండలంలో ఉన్న చల్లంపల్లి, మక్తమాదారం, సాలార్‌పూర్‌, రావిచెడ్‌, న్యామతాపూర్‌ గ్రామ పంచాయతీలను కలిపి  శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఉన్న కడ్తాల నూతనంగా మండల కేంద్రంగా ఏర్పడింది. 11 పాత పంచాయతీలకు తోడు 2018లో కొత్తగా 13 పంచాయతీలను ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో కడ్తాల 24 పంచాయతీలకు చేరింది. కడ్తాల మండల కేంద్రంగా ఏర్పాటు కావడంతో అనేక వసతులు, సౌకర్యాలు కలిగి ఇబ్బందులు తొలగుతాయని ప్రజలు భావించారు. కాగా, నాలుగేళ్లు గడిచినా కలిగిన సౌకర్యాలు ఏమీ లేవని స్థానికులు వాపోతున్నారు. 


అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు


మండల కేంద్రంగా కడ్తాల ఏర్పాటైన తర్వాత మండల పరిషత్‌, తహసీల్దార్‌, వ్యవసాయ శాఖ కార్యాలయాలతో పాటు పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఆయా కార్యాలయాలకు సొంత భవనాలు లేక అసౌకర్యాల మధ్య అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. భవనా లు కార్యాలయాలకు ఏ మాత్రం అనుకూలంగా లేక ఇటు ప్రజలు, అటు అధికారులు ఏళ్ల కాలంగా ఇబ్బంది పడుతున్నారు. పాలశీతలీకరణ కేంద్రం ఆవరణలోని రైతు సమావేశ భవనంలో తహసీల్దార్‌ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. కార్యాలయంలో రికార్డులు, కంప్యూటర్లు, అధికారులకు సరైన గదులు లేవు. పోలీసుస్టేషన్‌ హ నుమాన్‌ ఆలయం వద్ద రైతుల కోసం నిర్మించిన ఓ చిన్న భవనంలో కొనసాగిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన పశువుల ఆసుపత్రి భవనం లో వ్యవసాయ శాఖ కార్యాలయం కొనసాగుతోంది. మహిళా సం ఘం భవనంలో ఐకేపీ కార్యాలయం ఏర్పాటు చేశారు. కాగా నేటికీ ఒక్క కార్యాలయ భవన నిర్మాణానికి స్థల కేటాయింపు జరుగలేదు. 


ప్రతిపాదనలతోనే సరి


కడ్తాల మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంబులెన్స్‌ వాహనం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, బస్టాండ్‌, లైబ్రరీ, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం, పాలశీతలీకరణ కేంద్రం ఎదుట దుకాణ సముదాయ నిర్మాణం, జాతీయ రహదారిపై సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఉన్న కడ్తాలతో పాటు మైసిగండి ప్రాంతాల్లో తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాగా ఆసుపత్రి అందుబాటులో లేక, 108 సదుపాయం లేక ఎంతో మంది వైద్య సహాయం అందక మృతి చెందిన సంఘటనలున్నాయి. ఈ విషయమై స్థానికులు మంత్రులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిగా, వారు హామీలు ఇచ్చారే తప్ప అమలుకు నోచుకోలేదు. బస్టాండ్‌ లేక రోడ్లపైనే బస్సులను నిలుపుతున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లేక పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. పాలశీతలీకరణ కేంద్రం ఎదుట దుకాణ సముదాయం నిర్మిస్తే ఆదాయం చేకూరడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. మండల కేంద్రంలో జాతీయ రహదారిపై మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక ప్రయాణికులు, చిరువ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. 


రోడ్లపైనే వారాంతపు సంత


కడ్తాలలో వారాంతపు సంత, కూరగాయలు, మాంసం, చేపల విక్రయాలకు స్థలాలు లేవు. దీంతో కమాన్‌నుంచి గాంధీచౌక్‌ వరకు రోడ్డుపైనే వారాంతపు సంత, కూరగాయల విక్రయాలు కొనసాగిస్తున్నారు. సంత రోజు మండల కేంద్రంలో పాత బజార్‌కు వెళ్లడానికి ఇబ్బందిగా మారుతోంది. చిరు వ్యాపారులు కూడా విధిలేక జాతీయ రహదారిని ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. 

Advertisement
Advertisement