‘కరణం బలరాం ఆ ఆలోచన చేయడమే తప్పు.. జరిగిన దానికి నాకూ ఏ సంబంధం లేదు..’

ABN , First Publish Date - 2020-10-31T21:14:16+05:30 IST

‘రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు నాకు తెలియదు. మానాన్న కూడా నాకు అలాంటివి నేర్పలేదు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేయడమే అలవర్చుకున్నా. పార్టీ రహితంగా పనులు చేయాలన్న సీఎం జగన్‌ మాట, కక్షసాధింపులకు అతీతంగా ముందుకు సాగాలన్న మంత్రి బాలినేని సూచనలు నాకు స్ఫూర్తి. అందుకే తొలి ఏడాదిలో అద్దంకి నియోజకవర్గ అభివృద్ధిలోకానీ

‘కరణం బలరాం ఆ ఆలోచన చేయడమే తప్పు.. జరిగిన దానికి నాకూ ఏ సంబంధం లేదు..’

చేయగలిగిందే చెప్తా.. అదే చేస్తా.. ఏడాది పనితీరుపై సంతృప్తిగా ఉన్నా

దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించా

అద్దంకిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపే ప్రణాళిక రూపొందించా

భవనాసి, కొరిశపాడు ఎత్తిపోతల పథకాలూ పూర్తిచేస్తాం

పాత, కొత్తవారిని సమన్వయంగానే నడుపుతా

గనుల్లో తప్పులున్నాయి కాబట్టే రవికుమార్‌ క్వారీలు మూత

అనుమతులు లేనందునే బలరాం ఫ్లెక్సీలు తొలగించారు

‘ఆంధ్రజ్యోతి’తో వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య


అద్దంకి(ప్రకాశం): ‘రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు నాకు తెలియదు. మానాన్న కూడా నాకు అలాంటివి నేర్పలేదు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేయడమే అలవర్చుకున్నా. పార్టీ రహితంగా పనులు చేయాలన్న సీఎం జగన్‌ మాట, కక్షసాధింపులకు అతీతంగా ముందుకు సాగాలన్న మంత్రి బాలినేని సూచనలు నాకు స్ఫూర్తి. అందుకే తొలి ఏడాదిలో అద్దంకి నియోజకవర్గ అభివృద్ధిలోకానీ, పార్టీ వ్యవహారాల్లో కానీ నా పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నా. సాధారణ ప్రజలు, పార్టీ కేడర్‌ హర్షిస్తున్నారు..’ అని వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణ చైతన్య అన్నారు. ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రం చేసి, వైసీపీ ఇన్‌చార్జిగా నియమితులై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అనేక అంశాలను ప్రస్తావించారు. కొత్తగా వైసీపీలోకి వచ్చే వారి ద్వారా మా పార్టీ వారికి నష్టం జరగనివ్వనన్నారు. ఎమ్మెల్యే రవికుమార్‌ క్వారీలు మూతపడటానికి ప్రభుత్వ కక్షసాధింపు కారణం కాదని, అక్కడ జరిగిన అక్రమాలే కారణమన్నారు. చీరాల ఎమ్మెల్యేగా ఉన్న బలరాం అద్దంకిలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాలనుకోవడమే తప్పు అన్నారు. అయినప్పటికీ వాటి తొలగింపునకు, మాకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వేమవరంలో జరిగిన హత్యా రాజకీయాలు నియోజకవర్గంలో ఎక్కడా పునరావృతం కాకూడదన్నదనే నా ఉద్దేశమన్నారు. అందుకు అనుగుణంగానే ముందుకు సాగుతానని తెలిపారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 


ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలో మీరేం సాధించారు?

చాలా సాధించా. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీని పటిష్ట పర్చుకోవడంలోనూ ఈ ఏడాదిలో నా పనితీరుపై నేను 90శాతం సంతృప్తికరంగా ఉన్నా. ఎక్కడో ఒకరిద్దరు కావాలని అనడం తప్ప ఎలాంటి విమర్శలు, ఆరోపణలు ఎదురుకాకపోవడమే అందుకు నిదర్శనం. 


నియోజకవర్గ సమస్యలు, రాజకీయ వ్యవహారాలపై అవగాహన వచ్చిందా?

(నవ్వి) మా నాన్న డాక్టర్‌ గరటయ్యది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయంగా ఆయన అడుగులను గమనిస్తూనే ఉన్నా. ప్రజలతో ఆయన ఎలా మెలుగుతారో చూశా. ఇక 1994 ఎన్నికల నుంచి పరోక్షంగా నియోజకవర్గ వ్యవహారాలపై దృష్టిసారించడమే కాక, మా నాన్న అభిమానులతో సంబంధాలు పెంచుకున్నా. అందు వల్ల నాకు తెలియనివంటూ ఏమీ లేవు. 


దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పట్టించుకున్నారా?

బల్లికురవ మండలంలో కొన్ని గ్రామాల రైతులు ఈనాం భూముల సమస్యలను ఎదుర్కొంటున్నారు. దాని పరిష్కా రానికి దశాబ్దాలుగా చాలామంది నాయకులు ప్రయత్నిం చారు. ప్రస్తుతం నేను పట్టుదలతో ముందుకెళ్లి ఆ సమస్య ను పరిష్కరించా. అద్దంకికి కూతవేటు దూరంలో ఉన్న వేల మూరిపాడుకు చిన్న సమస్యతో రోడ్డు నిర్మించ లేకపోయా రు. సమస్యను పరిష్కరించి గ్రామస్థులను ఐక్యంచేసి రోడ్డు ను ఏర్పాటు చేయించా. మున్ముందు ఇంకా చాలా చేయాలి. 


మరి భవనాసి రిజర్వాయర్‌, కొరిశపాడు ఎత్తిపోతల పనులు ముందుకు సాగలేదు కదా?

జగన్‌ పాదయాత్ర సమయంలోనే భవనాసి రిజర్వాయర్‌ నిర్మాణంపై హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని ఇటీవల ఆయ న్ను కలిసిన సందర్భంగా గుర్తుచేశా. అలాగే ఎత్తిపోతల పథకం అసంపూర్తిగా ఉండటాన్ని కూడా ప్రస్తావించా. ఇవి రెండే కాదు. ఇతరత్రా అన్నిరంగాల్లోని అపరిష్కృతంగా ఉన్న అభివృద్ధి పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయ గలనన్న నమ్మకం ఉంది.


సంక్షేమ పథకాల అమలులో రాజకీయ పక్షపాతం ప్రదర్శిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై ఏమంటారు?

ప్రతి సంక్షేమ పథకం అర్హత ఉన్న ప్రతిపేదకూ అందా లన్నది సీఎం లక్ష్యం. అందరితో మంచిగా ముందుకు సాగాలన్నది మా మంత్రి బాలినేని సూచన. అందుకు అనుగుణం గా నడుస్తున్నా. నేను ఎక్కడా పొరపాట్లు చేయలేదు. నవ రత్రాల ఫలాలన్నీ నేరుగానే లబ్ధిదారుడికి చేరుతున్నాయి. ఈ విషయంలో రాజకీయ వైషమ్యాలకు తావు లేదు. 


రాజకీయ ప్రత్యర్థులపై పోలీసు అస్త్రం ఉపయోగి స్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి కదా?

ఒక్కటంటే ఒక్కటి చూపగలరా! టీడీపీ ప్రభుత్వంలో ఇటు బలరాం, అటు రవికుమార్‌ ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ వేమవరంలో హత్యలు జరిగాయి. ప్రతిదాడులకూ ప్రయత్నాలు చేశారు. మేము అలాంటి కక్షలు, కార్పణ్యాలకు వ్యతిరేకం కాబట్టే ఎక్కడా అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా చూశాం.


వేమవరంలో మీ ప్రత్యర్థులను పోలీసుల ద్వారా హింసించారన్న ఆరోపణలపై ఏమంటారు?

అక్కడ మరో ప్రతీకార చర్యకు కుట్ర జరుగుతుంది పోలీ సులు గుర్తించి అవసరమైన చర్యలు తీసుకున్నారు. అందు లో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నా పాత్ర ఏమీ లేదు. ఆ గ్రామంలో శాంతిని కొనసాగించేందుకు చిత్తశుద్థితో ప్రయత్నిస్తున్నది నేనే. 


బెదిరింపులతోనే ప్రత్యర్థిపక్షం వారిని మీవైపు లాక్కొంటున్నారన్న ఆరోపణలపై ఏమంటారు?

ఒక్క ఊదాహరణనైనా చూపగలరా! కుట్రలు, కుంతంత్ర రాజకీయాలు చేసిన వారి బండారం బయటపడింది. వారి గురించి అర్థం చేసుకున్న ప్రజలు మావైపు వస్తుంటే ఓర్వ లేక ఆరోపణలు చేస్తున్నారు. 


కొత్తగా పార్టీలో చేరిన వారితో మీ పార్టీలో గ్రూపు తగాదాలు ఏర్పడినట్లు ఉన్నాయి కదా?

ఎవ్వరిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. కొన్ని షరతులతో కొందరు పార్టీలో చేరారు. ఆ షరతుల పరీక్షలో నెగ్గిన వారినే ముందుకు తీసుకువస్తాం. అయినా వైసీపీని, పార్టీ రహితంగా మా నాన్నగారిని నమ్ముకొని ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది కూడా రానివ్వను. 


నియోజకవర్గంలో బలమైన ముద్ర ఉన్న చీరాల ఎమ్మెల్యే కరణం వైసీపీలో చేరారు కదా. కలిసి పనిచేస్తున్నారా?

ప్రస్తుతం ఆయన చీరాల ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో ఆయన వ్యక్తిగత మద్దతుదారులంతా టీడీపీ అభ్యర్థి రవికుమార్‌కు పనిచేశారు. అలా చేయలేని వారు ఎవరైనా ఉంటే మా పార్టీలో ఎప్పుడో చేరిపోయారు. ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే నన్ను అర్థంచేసుకొని నాతో వచ్చారు. ఇప్పుడు ప్రత్యేకంగా బలరాం వర్గం అంటూ ఇక్కడేం లేదు. అంతా రవికుమార్‌తో కలిసిపోయిందనే నేను భావిస్తున్నా.

 

ఎంతైనా బలరాం బర్త్‌డే ఫ్లెక్సీలను తొలగించడం సమంజసమేనా?

మా పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం నా తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుకలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు ఫ్లెక్సీల ఏర్పాటుకు అధికారులను అనుమతి కోరారు. ఇంతలోనే కొందరు హడావుడిగా బలరాం, ఆయన కుమారుడుకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. వాళ్లు ముందుగానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే మేమేం అభ్యంతరం చెప్పలేదు. కానీ కింద అభిమానుల పేర్లు లేకుండా వందలాది ఫ్లెక్సీలను అద్దంకి అంతా ఏర్పాటుచేసే ప్రయత్నంలో కుట్ర ఉన్నదని అధికారులు భావించారు. గత అనుభవంతో పోలీసులు రంగంలోకి రాగా, మున్సిపల్‌ అధికారులు అను మతి లేని ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయంలో నా జోక్యం లేదు. అలాగని మా కేడర్‌ను అబ్బంది పెట్టే చర్యలకు ఎవ్వరు పాల్పడినా ఉపేక్షించబోం. 


ఎమ్మెల్యే రవికుమార్‌పై మీ ప్రభుత్వం వేధింపులకు సాల్పడటాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు?

నాకు తెలిసి మా ప్రభుత్వం ఎవ్వరిపై వేధింపులకు పాల్ప డటం లేదు. రవికుమార్‌ పార్టీని మోసం చేశారన్న బాధ ఉండొచ్చుకానీ దాన్ని పట్టించుకునే స్థితిలో మేం లేం.


ఆయన గ్రానైట్‌ క్వారీలపై దాడులు చేసి ఇబ్బందులు పెట్టలేదంటారా?

జిల్లాలోనేకాక, రాష్ట్రమంతా గ్రానైట్‌ క్వారీల నిర్వహణపై ప్రభుత్వం తనిఖీలు చేయించింది. అందులో రవికుమార్‌ క్వారీలు కూడా ఉండవచ్చు. 


జిల్లాలో బల్లికురవ, చీమకుర్తి ప్రాంతాల్లో 150 కి పైగా క్వారీలు ఉంటే టీడీపీకి చెందిన రవికుమార్‌, పోతుల రామారావుకు చెందిన వాటినే మూసివేయిం చడం కక్ష సాధింపు కాదా? 

ఇతర ప్రాంతాల విషయం నాకు తెలియదు. రవికుమార్‌ క్వారీల్లో అక్రమాలు జరుగుతున్నాయని 2013 ప్రాంతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం గుర్తించింది. అప్పట్లో ఆయనకు జరిమానాలను కూడా విధించింది. తదనుగుణంగానే ఇప్పుడు లీజులు రద్దయినట్లు నేను నమ్ముతున్నా. 

Updated Date - 2020-10-31T21:14:16+05:30 IST