అద్దంకి దయాకర్‌ను బహిష్కరించాలి

ABN , First Publish Date - 2022-08-14T07:38:52+05:30 IST

తెలంగాణ ప్రజలు అసహ్యింకునే విధంగా అసభ్యకర మాటలు మాట్లాడిన టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ను కాంగ్రెస్‌ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

అద్దంకి దయాకర్‌ను బహిష్కరించాలి

అప్పుడే మునుగోడు వెళ్లే విషయంపై ఆలోచిస్తా

రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పడం శుభ పరిణామం

అభివృద్ధి జరుగుతుందంటే నేనూ రాజీనామాకు సిద్ధం

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు


నల్లగొండ/యాదాద్రి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజలు అసహ్యింకునే విధంగా అసభ్యకర మాటలు మాట్లాడిన టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ను కాంగ్రెస్‌ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అలాగైతేనే తాను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లే విషయంపై ఆలోచిస్తానన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పడం శుభపరిణామమని పేర్కొన్నారు. అయితే ఆయన క్షమాపణ చెప్పినట్లుగా మీడియా ద్వారానే తెలిసిందన్నారు. అద్దంకి దయాకర్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశానని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరానని తెలిపారు.  దయాకర్‌ చిన్న పిల్లవాడని, అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. రాజీనామా చేస్తేనే అభివృద్ధి జరుగుతుందంటే తాను కూడా రాజీనామా చేస్తానని అన్నారు. టీపీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌గా మునుగోడులో ప్రచారం చేస్తారా? అన్న ప్రశ్నకు వెంకట్‌రెడ్డి బదులిస్తూ.. మునుగోడు ఎన్నికలు సెమీఫైనల్‌ అని, కానీ.. తనను సంప్రదించకుండానే కాంగ్రెస్‌ పెద్దలు కమిటీలు వేశారని చెప్పారు. ఇక అంతా వాళ్లే చూసుకుంటారని వ్యాఖ్యానించారు. మునుగోడులో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘నేను అటువైపే వెళ్లలేదు. ఎవరు గెలుస్తారో నాకెలా తెలుస్తుంది? మీడియా వారే సర్వే చేసి నాకు చెప్పండి’’ అని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌ నుంచి బయటకు వచ్చి ఆ నియోజకవర్గ అభివృద్ధికి వరాలు కురిపిస్తారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు రాగానే కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు ఇస్తామంటున్నారని గుర్తుచేశారు. 

Updated Date - 2022-08-14T07:38:52+05:30 IST