అడ్డగోలుగా నిర్మాణాలు

ABN , First Publish Date - 2022-05-27T06:17:04+05:30 IST

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోని అనకాపల్లి జోన్‌లో అనుమతి లేని భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.

అడ్డగోలుగా నిర్మాణాలు
కొప్పాక సర్వే నంబరు 41లోని ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న మూడు అంతస్థుల భవనం. దీని యజమాని జిరాయితీ సర్వే నంబరుతో ఇంటి నిర్మాణం కోసం జీవీఎంసీకి దరఖాస్తు చేశారు. ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు.

జీవీఎంసీ అనకాపల్లి జోన్‌లో  అక్రమ కట్టడాల జోరు

వార్డు సచివాలయాలు, టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో దరఖాస్తులు

అనుమతులు రాకుండానే ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేస్తున్న వైనం

మరికొందరు ప్రభుత్వ స్థలాల్లో భవన నిర్మాణం

జిరాయితీ సర్వే నంబరుతో ప్లాన్‌ అనుమతికి దరఖాస్తు

కలెక్షన్‌ ఏజెంట్లుగా మారిన వార్డు ప్లానర్లు

భవనం విస్తీర్ణం, అంతస్థులనుబట్టి రేట్లు

పట్టించుకోని జీవీఎంసీ ఉన్నతాధికారులు


(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోని అనకాపల్లి జోన్‌లో అనుమతి లేని భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. చిన్నపాటి భవనాలకు వార్డు సచివాలయాల్లో, మూడు అంతస్థులకు మించిన భవనాలకు టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో దరఖాస్తులు చేసుకొని, అనుమతులు రాకముందే నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొంతమంది ఏకంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపడుతూ, సమీపంలో వున్న జిరాయితీ  స్థలం సర్వే నంబరుతో ఇంటి నిర్మాణానికి ప్లాన్‌ అనుమతి కోసం దరఖాస్తు చేస్తున్నారు. జోన్‌ పరిధిలో ఈ తరహాలో 

పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నప్పటికీ జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కన్నెత్తి అయినా చూడడంలేదు. నిత్యం తన పరిధిలో పర్యటిస్తూ, అక్రమ నిర్మాణాలను గుర్తించాల్సిన వార్డు సచివాలయ ప్లానర్లు కూడా పట్టించుకోవడంలేదు. 

మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) పరిధిలోని అనకాపల్లి జోన్‌లో ఐదు వార్డులు వున్నాయి. 80 నుంచి 83 వార్డుల వరకు పూర్వ అనకాపల్లి మునిసిపాలిటీ ప్రాంతంకాగా 84 వార్డులో అనకాపల్లి, పరవాడ మండలాలకు చెందిన పంచాయతీలు వున్నాయి. ఈ ప్రాం తంలో ఎక్కడ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నా జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం నుంచి అనుమతులు తీసుకోవాలి. జీ ప్లస్‌ టు అయితే స్థానిక వార్డు సచివాలయంలో, అంతకుమించితే జోన్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అన్నీ పరిశీలించి అనుమతులు ఇచ్చిన తరువాత ఎవరైనా ఇంటి నిర్మాణం చేపట్టాలి. కానీ 84వ వార్డు పరిధిలోని తాడి, కొప్పాక,  కొత్తూరు, లంకెలపాలెం, తదితర ప్రాంతాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా వందలాది భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ వార్డు సచివాలయ సిబ్బంది, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పట్టించుకోవడంలేదు. స్థానికులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే... వీఆర్‌ఓతో విచారణ జరిపించి, మొక్కుబడిగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. భవన యజమానులు నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలుపుదల చేసి, కొద్ది రోజుల తరువాత యథావిధిగా పనులు కొనసాగిస్తున్నారు. 

జిరాయితీ పేరుతో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం

కొండకొప్పాక సర్వే నంబరు 41లో ప్రభుత్వ భూమి వుంది. ఒక వ్యక్తి దీనిలో కొంతభూమిని ఆక్రమించి మూడంతస్థుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇతను టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో తనకున్న పలుకుబడితో అదే గ్రామంలో జిరాయితీ భూమి సర్వే నంబరుతో భవన నిర్మాణానికి అనుమతి కోసం టౌన్‌ ప్లానింగ్‌కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. అధికారులు అనుమతి ఇవ్వకుండానే మూడు అంతస్థులతో భవనం నిర్మించడం గమనార్హం.  

వార్డు ప్లానర్ల కలెక్షన్‌?

ప్రతి వార్డు సచివాలయంలో ఒక ప్లానర్‌ వుంటారు. తన పరిధిలో అక్రమ నిర్మాణాలను గుర్తించి జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి ఫిర్యాదు చేయాలి. అవసరమైతే నోటీసులు జారీ చేయాలి. కానీ ఎక్కడా విధంగా జరగడంలేదు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు అందితే మొక్కుబడిగా నోటీసు జారీచేసి వదిలేస్తున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు తమ చేతికి అవినీతి మరక అంటకుండా... అక్రమ నిర్మాణదారుల నుంచి డబ్బులు వసూలు చేసే బాధ్యతను వార్డు ప్లానర్లకు అప్పగించారని స్థానికంగా చెప్పుకుంటున్నారు. భవనం విస్తీర్ణం, అంతస్థులనుబట్టి రేటు నిర్ణయించారని, ఆ ప్రకారం ముడుపులు చెల్లించుకున్న వారి జోలికి వెళ్లడంలేదని అంటున్నారు. 

Updated Date - 2022-05-27T06:17:04+05:30 IST