నేరాలకు అడ్డా

ABN , First Publish Date - 2022-01-12T06:11:53+05:30 IST

ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలతో నల్లగొండ జిల్లా సరిహద్దు పంచుకోవడం, నలు దిక్కులా జాతీయ, రాష్ట్ర రహదారులు విస్తరించడం తో నేరగాళ్లకు అడ్డాగా మారుతోంది. గుప్త నిధుల తవ్వకాలు, నరబలులు, జిల్లాతో సంబంధం లేని వ్యక్తుల హత్యలు స్థానికంగా చోటుచేసుకుంటున్నా యి.

నేరాలకు అడ్డా
గుప్త నిధుల తవ్వకాలతో వాడపల్లిలో ధ్వంసమైన ఆలయం

గతంలోనూ నరబలులు  

తాజాగా మహంకాళి ఆలయం వద్ద మొండెంలేని తల

భయాందోళన వ్యక్తంచేస్తున్న స్థానికులు

గుప్త నిధుల తవ్వకాలతో అంతరించిపోతున్న చారిత్రక సంపద



(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ):  ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలతో నల్లగొండ జిల్లా సరిహద్దు పంచుకోవడం, నలు దిక్కులా జాతీయ, రాష్ట్ర రహదారులు విస్తరించడం తో నేరగాళ్లకు అడ్డాగా మారుతోంది. గుప్త నిధుల తవ్వకాలు, నరబలులు, జిల్లాతో సంబంధం లేని వ్యక్తుల హత్యలు స్థానికంగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, చింతపల్లి మండలం విరాట్‌నగర్‌లో ని మెట్టు మహంకాళి దేవాలయంలో అమ్మవారి పాదాల వద్ద యువకుడి తల వెలుగు చూడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండు రోజులైనా ఈ కేసులో పురోగతి కనిపించకపోవడంతో యువకుడి హత్య మిస్టరీగానే మిగిలింది. 



నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణానికి సమీపంలోని గాజీనగర్‌లో 1990లో గుప్త నిధుల కోసం ఓ వ్యక్తిని నరబలి చేసినట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. ఆ తరువాత శాలిగౌరారం మండలం గురజాల, మర్రిగూడ మండలం ముష్టిపల్లి లో నరబలుల ప్రచారం జరిగినా, ఈ కేసులను లోతుగా విచారించగా అక్రమ సంబంధాలు, భూముల వివాదంతోనే హత్యలు చోటుచేసుకున్నాయని పోలీసు లు నిర్ధారించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని హైదరాబాద్‌ కు చెందిన ఓ యువకుడిని గతంలో నయీం అనుచరులు ముక్కలుగా నరికి ఒక్కో భాగాన్ని దేవరకొండ, నల్లగొండలో వదిలి భయానక వాతావరణం సృష్టించారు.తాజాగా, చింతపల్లి మండలం విరాట్‌నగర్‌లో నరబలి ఉదంతం వెలుగు చూసింది. చారిత్రక దేవరకొండ కోటలో గుప్త నిధుల కోసం నిరంతరంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికార చిహ్నమైన పూర్ణకుంభం ఉన్న ప్రధాన గోపురం ముఖద్వారాన్ని గుప్తు నిధుల వేటగాళ్లు బ్లాస్టింగ్‌ చేశా రు. ప్రధానంగా శివాలయాలను టార్గెట్‌గా చేసుకొని జిల్లాలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. దేవరకొండ ఖిల్లాలో తరుచూ అస్థిపంజరాలు దొరుకుతున్నాయి. ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో శిఽథిలావస్థకు చేరిన దేవాలయాల్లో, కోటల్లో గుప్తు నిధుల పేరుతో నిరంతరాయంగా తవ్వకాలు సాగుతున్నా యి. పురాతన ఆలయాలు, కోట గోడలు లక్ష్యంగా చారిత్రక సంపదను కొల్లగొడుతున్నారు. ఇప్పటికే పలు ఆలయాలు, చారిత్రక కట్టడాలు గుప్త నిధుల తవ్వకాల్లో ఆనవాళ్లు కోల్పోయాయి. మూడు దశాబ్దాల నుంచి ఏదో ఒక ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నా రు. గతంలో వాడపల్లి గ్రామంలోని లక్ష్మీనర్సింహస్వామి ఆల యం వెనుక భాగంలో గుప్తనిధుల కోసం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు చేసేందుకు యత్నించారు. సుమారు మూడు దశాబ్దాల క్రితం వాడపల్లిలోని ఆలయాల ప్రాంతంలో ఇళ్ల నిర్మాణ కోసం చేపట్టిన తవ్వకాల్లో 2కిలోల బరువు ఉన్న బంగారు నాణేల పెట్టె లభ్యమైంది. దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. నాటి నుం చి ఈ ప్రాంతంలో నిధినిక్షేపాలు దొరుకుతాయనే ఉద్దేశంతో పలువురు అగంతకులు తవ్వకాలు చేస్తూనే ఉన్నారు. 

గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన ప్రాంతాలు..

 వాడపల్లిలో వీరభద్రుడి ఆలయంలో 20 ఏళ్ల క్రితం గర్భగుడిలోని విగ్రహాలను ధ్వంసం చేసి తవ్వకాలు చేశారు.

కాలభైరవుడి ఆలయంలో విగ్రహాన్ని తొలగించి తవ్వారు. తదనంతర కాలంలో ఆలయ గోడపై ఉన్న వినాయకుడి విగ్రహాన్ని సైతం తొలగించారు.

రెండు దశాబ్దాల క్రితం మీనాక్షి అగస్తేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో కృష్ణానది ఒడ్డున సుమారు 100 అడుగుల ఎత్తులోని కొండ భాగంలో ఉన్న సొరంగ మార్గంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేశారు.

పురాతన శివాలయంలో గుప్త నిధుల కోసంత వ్వకాలు చేశారు.

అడవిదేవులపల్లి సమీపంలోని కృష్ణానది తీరాన ఉన్న 50 స్తంభాల బౌద్ధమాలయాల్లో ఎక్స్‌కవేటర్‌తో స్తంభాలను, మూల విగ్రహాలను ధ్వంసం చేశారు.

వీర్లపాలెం  సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో దశాబ్దం క్రితం రెండుసార్లు తవ్వకాలు చేశారు. దీంతో ధ్వజస్తంభం ధ్వంసమైంది.

ముదిమాణిక్యంలో ఓటుగుళ్లను తవ్వి ధ్వంసం చేశారు.

బాల్నేపల్లిలో ఆంజనేయస్వామి ఆలయంలోనూ తవ్వకాలు చేసి ఆలయాన్ని ధ్వంసం చేశారు. 

ఇర్కిగూడెంలో సమీపంలోని అటవీ ప్రాంతంలోని ఐదు పురాతన ఆలయాలు గుప్త నిధుల తవ్వకాల్లో ఆనవాళ్లు కోల్పోయాయి.


మొండెం దొరికితేనే ముందుకు

వారం రోజుల క్రితం మాల్‌లో కన్పించిన జయేందర్‌

కేసు ఛేదనలో 170 మంది పోలీస్‌ సిబ్బంది

నేరాలు, ఘోరాలకు అడ్డాగా చింతపల్లి


నల్లగొండ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/దేవరకొండ, చింతపల్లి: మెట్టు మహంకాళి ఆలయం వద్ద లభించిన మొండెంలేని తల ఘటనలో మొండెం దొరికితేనే కేసు ముందడుగు పడుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ తల సూర్యాపేట జిల్లా శూన్యపహడ్‌తండాకు చెందిన రమావత్‌ జయేందర్‌దిగా పోలీసులు గుర్తించారు. అయితే అతడు మతిస్థిమితం కోల్పోవడం, సెల్‌ఫోన్‌ వినియోగించకపోవడం కారణంగా కేసు ఛేదన పోలీసులకు సవాల్‌గా మారింది. ఈ కేసులో పురోగతి సాధించాలంటే మొండెం కీలక అంశమని, ఆ దిశగా విచారణ వేగవంతం చేశారు. మృతదేహం లభిస్తే ఆ ప్రదేశాన్ని ఆధారం గా చేసుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. మృతదేహం ఆధారం గా ఏ రోజు, ఎన్ని గంటలకు హత్య జరిగింది, వాటి ఆధారంగా హత్య జరిగిన మార్గంలో ఏ వాహనాలు తిరిగాయో విశ్లేషించే అవకాశం ఉం టుంది. ఆ మార్గంలోని సీసీ కెమెరాల్లో ఆయా తేదీల్లో నమోదైన వివరాలన్నింటినీ జల్లెడ పడితే కేసులో కీలక క్లూ దొరుకుతుందని పోలీసులు భావిస్తున్నారు. తుర్కయాంజియాల్‌ నుంచి మాల్‌, చింతపల్లివరకు సెల్‌టవర్ల డంప్‌ను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రాంతంలో కామన్‌ సెల్‌ నెంబర్‌ కోసం జల్లెడ పడుతున్నారు. తలను గుర్తించిన విరాట్‌నగర్‌లోని మెట్టు మహంకాళి దేవాలయానికి 10కి.మీ దూరంలో ఎక్కడా మొండెం ఆచూకీ కనిపించకపోవడంతో కేసు ఛేదన కొంత క్లిష్టంగా మారింది.


నేరాలు, ఘోరాలకు నిలయంగా చింతపల్లి

పూర్వ మహబూబ్‌నగర్‌, నల్లగొండ సరిహద్దుల్లో చింతపల్లి మండల పరిసర గ్రామాలు ఉన్నాయి. మాల్‌ పట్టణంలోని ప్రధాన రహదారికి ఒకవైపు పూర్వ మహబూబ్‌నగర్‌, ప్రస్తుత రంగారెడ్డి జిల్లా పరిధి కాగా, మరో పక్కన నల్లగొండ జిల్లా పరిధి ఉంది. దీంతో ఆయా జిల్లాల్లో నేరా లు చేసిన వారు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సులభంగా మరో జిల్లాకు పరారవుతున్నారు. పరిసర జిల్లాల్లోని వారు హత్యలు, అత్యాచారాలకు చింతపల్లి మండలాన్ని ఎంచుకుంటున్నారు. ఈ మండలానికి చెందిన ప్రజల్లో 50శాతం మంది హైదరాబాద్‌లోనే నివాసం ఉంటారు. దీంతో ఈ మండలంలోని గ్రామాలన్నీ నిర్మానుష్యంగా ఉంటా యి. హైవే మినహాయిస్తే మిగిలిన గ్రామాలన్నీ భారీ గుట్టలు, నిర్మాను ష్య ప్రాంతాలే. ఈత, తాటి చెట్లు అధికంగా ఉండటంతో వాటి వద్ద మద్యం సేవించి నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య అధికమైంది. ఈ మండలంలో 36కి.మీ మేర హైవే విస్తరించి ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి రాకపోకలు అధికంగా ఉన్నాయి. వివిధ చోట్ల నుంచి కొత్త వ్యక్తులు వచ్చిపోవడం సర్వసాధారణం కావడంతో, నేరస్థులు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నట్లు సమాచారం. వివిధ నేరాలకు ఈ మండలంలోని మాల్‌ పట్టణం కేంద్రంగా ఉండటంతో, ఇక్కడ పోలీస్‌ ఔట్‌పోస్టు పెట్టాలని ఎప్పటినుంచో ప్రతిపాదన ఉన్నా అది ఆచరణకు నోచుకోవడం లేదు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో విస్తరించి ఉన్న రాచకొండ గుట్టలు నేరాలకు కేంద్రాలుగా మారాయి. ఈ ప్రాంతం లో అనేక గుర్తు తెలియని మృతదేహాలు పలుమార్లు వెలుగుచూశాయి. 


బాగానే బతుకుతున్నా అన్నాడు..

‘మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో కలిస్తే బాగానే బతుకుతున్నా అన్నాడు. ఇంటికి రమ్మని అడిగితే మీ జాగాలో మీరుండండి.. నా జాగాలో నేనుంటా అన్నాడు... అంతలో ఇంత ఘోరం అవుద్దని అనుకోలేదు.. చివరకు నీకు ఈ గతి పట్టిందిరా కొడుకా’ అంటూ జయేందర్‌ తండ్రి శంకర్‌నాయక్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. మంగళవారం నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో జయేందర్‌ తలను బంధువులతో కలిసి చూసిన ఆయన బోరున విలపించాడు. అనంతరం దేవరకొండ డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మూడు నెలల క్రితం కుమారుడు జయేందర్‌ హైదరాబాద్‌లో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళితే కనిపించడంతో సంతోషపడ్డానని తెలిపారు. ఇంటికి పోదాం రా కొడకా అంటే ‘బాగానే బతుకుతున్నానని’ చెప్పాడని, దీంతో తాను వెనుదిరిగి వచ్చినట్లు తెలిపారు. మతిస్థిమితం కోల్పోయి హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో తిరుగుతున్న తన కుమారుడిని నరబలి చేశారని ఆయన విలపించాడు. జయేందర్‌ను హత్యచేసిన దుండగులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు.


తుర్కయాంజియాల్‌లో చివరి సారిగా

చివరగా రంగారెడ్డి జిల్లా తుర్కయాంజియాల్‌లో జయేందర్‌ను చూసినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. దీంతో అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం, చింతపల్లి వరకు ఉన్న సీసీ కెమెరాలు, రహదారులను పోలీసులు గాలిస్తున్నారు. హత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు పలు కోణాల్లో విశ్లేషణ ప్రారంభించారు. ఈ క్రమంలో మాల్‌ పట్టణంలోని సీసీ కెమెరాల ఫుటేజీలో వారం క్రితం జయేందర్‌ను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఈ కేసు ఛేదనకు మొత్తం ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. మొండెం ఆచూకీ గుర్తించేందుకు ఆరు టీంలు, సీసీ కెమెరాల ఫుటేజ్‌ వడపోతకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. మొత్తం 150 మంది పోలీస్‌ సిబ్బంది ఈ పనిలో నిమగ్నమయ్యారు. జయేందర్‌కు హిజ్రా లక్షణాలు ఏమైనా ఉన్నాయా? లైంగిక వేధింపు లా? తదితర కోణాల్లోనూ పోలీసులు విచారిస్తున్నారు. అతడు మద్యం సేవించిన సమయంలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనల కారణంగా హత్యకు దారితీసిందా? అనే కోణంలోనూ విచారిస్తున్నట్లు తెలిసింది. తల లభించిన ప్రాంతానికి, హత్య జరిగిన స్థలానికి దూరం ఎక్కువగా ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు. తల భాగానికి సమీపంలో రక్తపు మరకలు ఉండకపోవడం, ఘటన స్థలానికి 10కి.మీ పరిధిలో కూడా మొండెం లభించకపోవడం వంటి కారణాలతో కేసు ఛేదనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జయేందర్‌ తలను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. అతడి చర్మాన్ని డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ పంపించినట్లు పోలీసులు తెలిపారు.



Updated Date - 2022-01-12T06:11:53+05:30 IST