ఉప్పు, పప్పులు బంద్‌

ABN , First Publish Date - 2022-05-01T06:32:28+05:30 IST

ప్రభుత్వ ఛౌకధరల దుకాణాలలో పప్పు, ఉప్పులు, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తిగా నిలిచి పోయింది. కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. కరోనా పరిస్థితులతో గత కొద్ది కాలంగా ఉచిత బియ్యాన్ని అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అం దించిన తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు.. ప్రస్తుతం మచ్చుకైనా కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో

ఉప్పు, పప్పులు బంద్‌
బియ్యాన్ని సరఫరా చేస్తున్న రేషన్‌ దుకాణం డీలర్‌

రేషన్‌ దుకాణాలలో బియ్యంతోనే సరిపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

పూర్తిగా నిలిచిపోయిన నిత్యావసర సరుకుల పంపిణీ

బహిరంగ మార్కెట్‌లో భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలు

అర్ధాకలితో అలమటిస్తున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు

జిల్లా వ్యాప్తంగా 355 రేషన్‌ దుకాణాల పరిధిలో లక్షా 92వేల కార్డులు

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఛౌకధరల దుకాణాలలో పప్పు, ఉప్పులు, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ పూర్తిగా నిలిచి పోయింది. కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. కరోనా పరిస్థితులతో గత కొద్ది కాలంగా ఉచిత బియ్యాన్ని అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అం దించిన తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు.. ప్రస్తుతం మచ్చుకైనా కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కంది పప్పు, పామాయిల్‌, పసుపు, ఉప్పు, చక్కెర, గోధుమ పిండి, మైదం పిండి, చింత పండు, కారంపొడిని పంపిణీ చేసేవారు. ఇందులో ఒక్కొక్కటిగా తగ్గిస్తూ.. ప్రస్తుతం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 355 రేషన్‌ దుకాణాల పరిధిలో లక్షా 92వేల రేషన్‌కార్డులున్నాయి. ఈ కార్డులకు నెలకు సుమారుగా 40 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరలతో పేద, మధ్య తరగతి ప్రజ లు అల్లాడుతున్నారు. అసలు పూటగడవడమే గగనంగా మారింది. రోజు కూలీ చేసుకునే కుటుంబమైతే ఉన్నదాంట్లో సర్దుకొని అర్ధాకలితో కాలం గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేదెక్కిన చక్కెర

పేద, మధ్య తరగతి కుటుంబాలకు మూడు పూటల కడుపునిండా భోజనం అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యంతో పాటు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు నెలనెలా అందించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం పేదల ఆకలిని పట్టించుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ప్రతీ కుటుంబంలో ఉదయం నుంచి రాత్రి వరకు టీ తాగడం అలవాటుగా ఉం టుంది. కానీ చక్కెర పంపిణీ కూడా ఎత్తివేయడంతో పేదల ఇళ్లలో తీపి అనే మాటనే ఎరగడం లేదు. మున్సిపాలిటీలలో అంత్యోదయ, అన్నపూర్ణకార్డుదారులకు అరకిలో చక్కెర అందించాలనే ప్రభుత్వ ఆదేశాలు ఉన్న రేషన్‌ డీలర్లు మాత్రం అసలు చక్కెర జోలికి వెళ్లడం లేదు. ఎందుకంటే కొంత మందికి సరఫరా చేసి, మరికొంత మందికి నిరాకరిస్తే ఇబ్బందులు వస్తాయని పూర్తిగా నిలిపి వేస్తున్నారు. కొంత మంది రేషన్‌డీలర్లు సొంత డబ్బులతో హోల్‌సెల్‌ దుకాణాల నుంచి సబ్బులు, ఉప్పులు, పప్పులు, పామాయిల్‌, టీ పొడి లాంటి నిత్యావసర సరుకులను తెచ్చి అమ్ముతున్నారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న ధరల కంటే అధికంగా, నాసిరకంగానే ఉంటున్నాయని కార్డుదారులు పేర్కొంటున్నారు. 

భగ్గుమంటున్న ధరలు

వేసవి ఎండల మాదిరిగానే.. నిత్యావసర సరుకుల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. దీంతో ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అన్నట్లుగా పరిస్థితులు మారాయంటున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని సాకుగా చూపుతున్న వ్యాపారులు.. అడ్డగోలుగా ధరలను పెంచేస్తున్నారు. రేషన్‌ దుకాణాలలో రూ.6.70 ఉన్న కిలో చక్కెర ధర, బయట మార్కెట్‌లో రూ.40 పలుకుతోంది. అదేమాదిరి గా పామాయిల్‌ రూ.40 నుంచి రూ.180కి చేరింది. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ అయితే రూ.205 పలుకుతోంది. గోధుమ పిండి రూ.40, కంది పప్పు రూ.120, చింతపండు రూ.150, పసుపు(100 గ్రాములు) రూ.30, ఉప్పు కిలో ప్యాకెట్‌ రూ.15 పలుకుతోంది. ఇలా అన్ని రకాల నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం పడుతోంది. ప్రభుత్వమే ఛౌకధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తే పేద ప్రజలకు కొంతమేలు జరిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో కిలో కొ నుగోలు చేసే వారంతా ప్రస్తుతం పావుకిలోతో నే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. రేషన్‌ దుకాణాలలో కేవలం బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేసి ప్రభు త్వం చేతులెత్తేయడంతో రేషన్‌ డీలర్లకు కూడా గిట్టుబాటు కావడం లేదు.  భారీగా కమీషన్‌ తగ్గిపోవడంతో వృత్తిని వదిలేసేందుకు కొందరు డీలర్లు సిద్ధమవడం గమనార్హం. 

ఎట్ల బతకాలో అర్థం కావడం లేదు

: మనిషా, గృహిణి, ఇచ్చోడ మండలం

ముందటి మాదిరిగా రేషన్‌ దుకాణాలలో నిత్యావసర వస్తువులు సరఫరా  లేదు. బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ఎట్ల బ్రతకాలో అర్థం కావడం లేదు. అసలే వేసవి కాలం.. పనులు కూడా దొరుకత లేవు. ఉన్నదాంట్లోనే సర్దుకొని బతకాల్సి వస్తుంది. ఏ వస్తువు కొన్నా.. ధరలు భగ్గుమంటున్నాయి. రూ.వెయ్యి పెట్టినా ఏమాత్రం సరుకులు రావడం లేదు. ధరలు తగ్గిస్తేనే పేద, మధ్య తరగతి ప్రజలకు కాస్త ఉపశమనం. ప్రభుత్వం బియ్యాన్నే ఇస్తే ఎలా?!

బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నాం

: సుదర్శన్‌, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, ఆదిలాబాద్‌

ప్రస్తుతం రేషన్‌ దుకాణాలలో బియ్యాన్ని మాత్రమే సరఫరా చేస్తున్నాం. గతంలో పంపిణీ చేసిన తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు నిలిచిపోయాయి. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మున్సిపాలిటీల్లోనూ చక్కెర సరఫరా కావడం లేదు. ప్రస్తుతం ఉచితంగానే బియ్యాన్ని సరఫరా చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి సరఫరా అయితేనే నిత్యావసర సరుకులను అందించే అవకాశం ఉంది. 

Updated Date - 2022-05-01T06:32:28+05:30 IST