అడవి బిడ్డల అరణ్య రోదన!

ABN , First Publish Date - 2022-08-09T06:26:31+05:30 IST

ఆధునికత సంతరించుకుని రవాణా వ్యవస్థల్లో ఎంతో మార్పు చోటు చేసుకున్న ఈ రోజుల్లోనూ ఆదివాసులు రోగులను డోలీల్లో మోయడం, తమ ప్రయాణానికి గుర్రాలను వినియోగిస్తుండడం మన్యంలో రవాణా వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోంది.

అడవి బిడ్డల అరణ్య రోదన!
తప్పని డోలీ మోత (ఫైల్‌ ఫొటో)

- అభివృద్ధికి నోచుకోని ఆదివాసీలు

- నేటికీ దుర్భర జీవనం 

- రహదారి, వైద్య సదుపాయం లేక అవస్థలు

నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా...

తరాలు మారినా.. పాలకులు మారినా అడవి బిడ్డల బతులు మారడం లేదు. ఇప్పటికీ వందల సంఖ్యలోని పల్లెలకు రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడం, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లోనూ కనీస పురోగతి సాధించకపోవడంతో ఆదివాసీల బతుకుల్లో వెలుగులు ప్రసరించడం లేదు. ఈ నెల 9న ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం’ సందర్భంగా మన్యంలోని ఆదివాసుల జీవన చిత్రంపై ప్రత్యేక కథనం. 


                             (ఆంధ్రజ్యోతి- పాడేరు) 

ఆధునికత సంతరించుకుని రవాణా వ్యవస్థల్లో ఎంతో మార్పు చోటు చేసుకున్న ఈ రోజుల్లోనూ ఆదివాసులు రోగులను డోలీల్లో మోయడం, తమ ప్రయాణానికి గుర్రాలను వినియోగిస్తుండడం మన్యంలో రవాణా వ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోంది. ఏజెన్సీ వ్యాప్తంగా 244 గ్రామ పంచాయతీల్లో సగం పంచాయతీ కేంద్రాలకు మాత్రమే రోడ్డు సదుపాయం ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏజెన్సీలో నేటికీ సగానికి పైగా గిరిజన పల్లెలకు కనీస రోడ్డు సౌకర్యం లేని పరిస్థితి. ఏజెన్సీలో మారుమూల పల్లెలు అధికంగా ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో వందలాది గ్రామాల్లో ఆదివాసులు నేటికి గుర్రాలతోనే తమ రాకపోకలు సాగిస్తున్నారు. వాటిని కొనలేని పేద గిరిజనులు కాలినడకనే తమ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఏజెన్సీలో మండల కేంద్రాలు, కాస్త రోడ్డు పక్కన గ్రామాలకు మాత్రమే రోడ్డు, రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో నిత్యం కొండలు, గెడ్డలు దాటుకుంటూ రాకపోకలు సాగించాల్సిన దుస్థితి  

విద్య, వైద్య రంగాల్లో వెనుకబాటు

విద్య, వైద్య రంగాల్లోనే ఆదివాసీ ప్రాంతం ఇంకా వెనుకబడే ఉంది. పాడేరు, అరకులోయ, కొయ్యూరు ప్రాంతాల్లో డిగ్రీ, ప్రతి మండలంలో ఒక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, 122 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, రెండు వేల వరకు ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలున్నప్పటికీ, ఆదివాసీలకు నేటికీ నాణ్యమైన విద్య అందని దుస్థితి కొనసాగుతున్నది. విద్యా వ్యవస్థపై పర్యవేక్షణ లేమి, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వంటి కారణాలతో విద్యాభివృద్ధికి విఘాతంగా మారాయి. అలాగే వైద్యం విషయానికి వస్తే పాడేరులో జిల్లా ఆస్పత్రి, అరకులోయలో ఏరియా ఆస్పత్రి, చింతపల్లి, ముంచంగిపుట్టులో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏజెన్సీ వ్యాప్తంగా 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నా నేటికీ గిరిజనులకు సకాలంలో వైద్య అందని పరిస్థితి. దీంతో ప్రతి ఏడాది లక్షల మంది గిరిజనులు జ్వరాల బారినపడుతున్నారు. అయితే వ్యవస్థలో లోపాల కారణంగా గిరిజన ప్రాంతంలో పని చేసేందుకు వైద్యులు, సిబ్బంది రాకపోవడం వంటి కారణాలతో ఆదివాసీలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది. దీనికి తోడు గిరిజనులకు సురక్షితమైన తాగునీరు లభించని పరిస్థితి కొనసాగుతున్నది. గిరిజన పల్లెల్లో తాగునీటి సదుపాయాల కల్పన పేరిట ఏటా రూ.కోట్లు వ్యయం చేస్తున్నా నేటికీ ఊటగెడ్డలపైనే ఆదివాసీలు ఆధారపడుతున్నారు. ఏజెన్సీలో రోగాల సమస్యకు సురక్షితమైన తాగునీరు లేకపోవడం ఒక కారణమని వైద్యశాఖ పేర్కొంటుంది. అలాగే గిరిజన ఆర్థికాభివృద్దికి దోహదపడేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అఽభివృద్ధికి చర్యలు చేపడుతున్న దాఖలాలు లేవు. అందువల్లే నేటికి ఏజెన్సీ ప్రాంతంలో ఎకరానికి 20 బస్తాలు ధాన్యం దిగుబడి సాధించడం మహా కష్టంగా మారింది. దీంతో వ్యవసాయం పరంగా గిరిజనులు సాధించిన ప్రగతి ఏపాటితో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆదివాసీల అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. వారి జీవన స్థితిగతులను మార్చాలనే చిత్తశుద్ధి పాలకుల్లో లేనంత కాలం ఎన్ని ఆదివాసీ దినోత్సవాలు నిర్వహించినా వారి బతుకుల్లో వెలుగులు చూడలేమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


నేడు ఆదివాసీ దినోత్సవం

- ముగ్గురు మంత్రులు హాజరయ్యే అవకాశం  

- అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియంలోనే కార్యక్రమం 

పాడేరు, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): స్థానిక ఐటీడీఏ పరిధిలో డివిజన్‌ స్థాయి ఆదివాసీ దినోత్సవాన్ని స్థానిక అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియంలోనే మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరైతే స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలోనే వేడుకలను నిర్వహించాలని భావించారు. అయితే సీఎం పర్యటన రద్దు కావడంతో కేవలం డివిజన్‌ స్థాయిలోనే ఈ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం వర్షం పడుతుండడంతో కొద్ది మందితో స్థానిక అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో మమా అనిపించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్లను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ సోమవారం పరిశీలించారు. 

ముగ్గురు మంత్రులు హాజరయ్యే అవకాశం

పాడేరులో నిర్వహించే ఆదివాసీ దినోత్సవానికి డిప్యూటీ సీఎంలు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌ హాజరుకానున్నారు. అలాగే అరకులోయ ఎంపీ జి.మాధవి, ఎస్‌టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కుంభా రవిబాబు, జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, నాగులాపల్లి ధనలక్ష్మి, ఏజెన్సీలో ప్రాంత ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు హాజరవుతారు. అయితే దీనిపైనా అధికారులు స్పష్టమైన ప్రకటన చేయలేదు.  


రూ.కోటి ప్రజాధనం వృథా  

- సీఎం జగన్‌ పర్యటనల రద్దు ఫలితం

- అక్కరకు రాని అధికారుల ఏర్పాట్లు 


                         (ఆంధ్రజ్యోతి- పాడేరు)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాడేరు పర్యటనల రద్దు కారణంగా అక్షరాల రూ.కోటి ప్రజాధనం వృథా అయిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మే నెల 12న మోదకొండమ్మ ఉత్సవాలకు సీఎం జగన్‌ హాజరవుతారని అప్పట్లో అధికారులు అవసరమైన  ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా మండలంలో వర్తనాపల్లి ప్రాంతంలో హెలీప్యాడ్‌, అక్కడి నుంచి కిండంగి వరకు సుమారు కిలోమీటరున్నర తారురోడ్డు వేశారు. అలాగే ఆ రోడ్డుకు అడ్డదిడ్డంగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను సరిచేశారు. ఈ క్రమంలో మే 12న సీఎం రాక కోసం సుమారుగా రూ.40 లక్షల వరకు వ్యయం చేశారు. అలాగే ఆదివాసీ దినోత్సవానికి సీఎం జగన్‌ వస్తారని భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సుమారుగా 20 వేల మంది కూర్చునే విధంగా వాటర్‌ ప్రూఫ్‌ షామియానాను ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్‌ను సభా వేదిక వరకు మూడు కిలోమీటర్ల పొడవున బారికేడ్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. కానీ సీఎం పర్యటన రద్దు కావడంతో మూడు రోజులుగా అధికారులు చేసిన ఏర్పాట్లన్నీ వృథా అయ్యాయి. ఇందుకు గాను సుమారుగా రూ.60 లక్షల వరకు వృథా అయిందనేది అంచనా. దీంతో సీఎం జగన్‌ రెండు మార్లు పాడేరు పర్యటన రద్దు కారణంగా సుమారుగా రూ.కోటి నిధులు వృథా అయ్యాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, జనసేన అరకు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి వంపూరు గంగులయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల అభివృద్ధిపై సీఎం జగన్‌కు శ్రద్ధ లేకపోవడం వల్లే ఇటువంటి నిధుల వృథా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Updated Date - 2022-08-09T06:26:31+05:30 IST