మోదీపై అదర్ పూనావాలా ప్రశంసల జల్లు

ABN , First Publish Date - 2021-04-20T19:20:18+05:30 IST

కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీలకు ఎంతో సహాయపడుతున్న

మోదీపై అదర్ పూనావాలా ప్రశంసల జల్లు

ముంబై : కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీలకు ఎంతో సహాయపడుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌లను సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా ధన్యవాదాలు ప్రశంసించారు. నిర్ణయాత్మక విధాన మార్పులు చేసి, వేగంగా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. పుణేలోని ఈ సంస్థ ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా అభివృద్ధిపరిచిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. 


అదర్ పూనావాలా మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశంలోని వ్యాక్సిన్ పరిశ్రమ తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌లకు ధన్యవాదాలు చెప్తున్నానని, ప్రశంసిస్తున్నానని తెలిపారు. మన దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తికి, పంపిణీకి దోహదపడే విధంగా  నిర్ణయాత్మక విధాన మార్పులు చేశారని, వేగంగా ఆర్థిక సహాయం అందజేశారని పేర్కొన్నారు.


అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ల ఉత్పత్తి కోసం రూ.4,567 కోట్లు మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది. దేశంలో కోవిడ్-19 మహమ్మారి రెండో దశ విజృంభిస్తుండటంతో వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం కోసం ఈ నిధులను మంజూరు చేయడానికి అంగీకరించింది. కోవిషీల్డ్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుండగా, దేశీయంగా అభివృద్ధిపరచిన కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. 


దేశంలో 18 సంవత్సరాల వయసు పైబడినవారందరికీ మే 1 నుంచి వ్యాక్సినేషన్ చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. 


Updated Date - 2021-04-20T19:20:18+05:30 IST