పాక్, ఆఫ్ఘన్, ఇరాన్ సరుకు దించం: Adani Ports

ABN , First Publish Date - 2021-10-12T20:37:45+05:30 IST

గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున హెరాయిన్

పాక్, ఆఫ్ఘన్, ఇరాన్ సరుకు దించం: Adani Ports

న్యూఢిల్లీ : గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుబడటంతో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీఎస్ఈజెడ్) సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి ఇరాన్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వచ్చే కంటెయినర్ కార్గోను హ్యాండిల్ చేయబోమని ప్రకటించింది. ఏపీఎస్ఈజెడ్ నిర్వహించే అన్ని టెర్మినల్స్, ఏపీఎస్ఈజెడ్  పోర్టులోని థర్డ్ పార్టీ టెర్మినల్స్‌లలో వచ్చే నెల 15 నుంచి ఈ మూడు దేశాల నుంచి వచ్చే కంటెయినర్ కార్గోను హ్యాండిల్ చేయబోమని తెలిపింది. ఏపీఎస్ఈజెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుబ్రత్ త్రిపాఠీ ఈ నోటీసును జారీ చేశారు. 


ఈ చర్య వల్ల ఎగుమతి వ్యయంపై పడే ప్రభావం గురించి చర్చించేందుకు ఎగుమతిదారులు ప్రభుత్వంతో సంప్రదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్‌కు ఎగుమతి చేయడానికి అయ్యే ఖర్చులపై ఏపీఎస్ఈజెడ్ నిర్ణయం ప్రభావం పడుతుందని ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ ఎగుమతిదారుల సంస్థల సమాఖ్య డైరెక్టర్ జనరల్, సీఈఓ అజయ్ సహాయ్ మాట్లాడుతూ, ఏపీఎస్ఈజెడ్ తీసుకున్న నిర్ణయం వల్ల చాలా మంది ఎగుమతిదారులు తమ సరుకును ఇతర పోర్టుల ద్వారా పంపించవలసిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుందన్నారు. షిప్‌మెంట్ వ్యయం పెరుగుతుందని, ఇది వాణిజ్య రంగానికి ఎదురు దెబ్బ అని తెలిపారు. ఉత్తరాదిలోని చాలా మంది ఎగుమతిదారులు ముంద్రా పోర్టును ఉపయోగించుకుంటున్నారన్నారు. 


సెప్టెంబరు 16న ముంద్రా పోర్టులో రెండు కంటెయినర్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) స్వాధీనం చేసుకుంది. వీటిలో సెమీ ప్రాసెస్డ్ టాల్క్ స్టోన్స్  ఉన్నట్లు ప్రకటించింది. ఇరాన్‌‌లోని బందర్ అబ్బాస్ పోర్టు ద్వారా ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఆ కార్గో వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్న ట్రేడింగ్ కంపెనీ పేరు మీద ఈ సరుకు వచ్చింది. ఈ కంటెయినర్లలో 2,988 కేజీల హెరాయిన్ ఉందని, దీని విలువ రూ.21,000 ఉంటుందని అంచనా. అక్టోబరు 6న ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ చేశారు. అదానీ గ్రూప్ కంపెనీకి మన దేశంలో 13 పోర్టులు, టెర్మినల్స్ ఉన్నాయి. 


Updated Date - 2021-10-12T20:37:45+05:30 IST