అదానీ లాజిస్టిక్స్‌ చేతికి ఐసీడీ తుంబ్‌

ABN , First Publish Date - 2022-08-17T06:16:28+05:30 IST

అదానీ గ్రూప్‌ మరో భారీ కొనుగోలు జరిపింది. నవకర్‌ కార్పొరేషన్‌కు చెందిన ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపో ‘ఐసీడీ తుంబ్‌ (వాపీ)’ను రూ.835 కోట్లకు కొనుగోలు...

అదానీ లాజిస్టిక్స్‌ చేతికి ఐసీడీ తుంబ్‌

నవకర్‌ కార్పొరేషన్‌ నుంచి కొనుగోలు 

 ఒప్పందం విలువ రూ.835 కోట్లు 


న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ మరో భారీ కొనుగోలు జరిపింది. నవకర్‌ కార్పొరేషన్‌కు చెందిన ఇన్‌ల్యాండ్‌ కంటైనర్‌ డిపో ‘ఐసీడీ తుంబ్‌ (వాపీ)’ను రూ.835 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ (ఏఎల్‌ఎల్‌) ప్రకటించింది. అదానీ గ్రూప్‌ ప్రధాన సంస్థల్లో ఒకటైన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌(ఏపీసెజ్‌) లిమిటెడ్‌ పూర్తి అనుబంధ విభాగమే అదానీ లాజిస్టిక్స్‌. అనుసంధానిత రవాణా సదుపాయాలతోపాటు దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్‌ వసతుల ఏర్పాటు వ్యూహంలో భాగంగానే ఈ కొనుగోలు జరిపినట్లు కంపెనీ తెలిపింది. అదానీ లాజిస్టిక్స్‌ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే ఏడు మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులున్నాయి. తాజాగా ఐసీడీ తుంబ్‌ కూడా ఈ జాబితాలోకి చేరనుంది.


గుజరాత్‌లోని తుంబ్‌ గ్రామంలో ఉన్న ఐసీడీ తుంబ్‌కు వెస్ట్రన్‌ డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌తో (డీఎ్‌ఫసీ) అనుసంధానితమైన నాలుగు రైల్‌ ట్రాక్‌లతో కూడిన ప్రైవేటు ఫ్రైట్‌ టర్మినల్‌, కస్టమ్స్‌ నోటిఫైడ్‌ ల్యాండ్‌, గిడ్డంగులున్నాయి. దీని ద్వారా గుజరాత్‌లోని హజీరా పోర్ట్‌తోపాటు మహారాష్ట్రలోని న్హవా షెవా పోర్ట్‌కు సైతం సేవలందించేందుకు వీలవుతుంది. 

Updated Date - 2022-08-17T06:16:28+05:30 IST