అసలే అధిక రేటు.. ఆపై కల్తీ కాటు!

ABN , First Publish Date - 2021-10-19T05:13:19+05:30 IST

ఓవైపు పెట్రోల్‌ ధర మండిపోతుంటే...మరోవైపు బంకుల యాజమాన్యాలు కల్తీతో వినియోగదారులను దోచుకుంటున్నాయి. కొలతల్లోనూ చిలక్కొట్టుడు తప్పడం లేదు. పొరపాటున ఎవరైనా వినియోగదారుడు ప్రశ్నిస్తే... అక్కడి సిబ్బంది మూకుమ్మడిగా దాడికి సిద్ధమవుతారు. ఇక బిల్లుల ఊసే ఉండదు.

అసలే అధిక రేటు.. ఆపై కల్తీ కాటు!
శ్రీకాకుళం : రైతుబజారు సమీపాన బంక్‌ వద్ద పెట్రోల్‌లో నీరు కలిసిన కారణంగా విక్రయాలు నిలిపేసిన దృశ్యం

పెట్రోల్‌ బంకుల్లో యథేచ్ఛగా కల్తీ

కొలతల్లోనూ మోసాలు 

నష్టపోతున్న వినియోగదారులు

కనిపించని తనిఖీలు

శ్రీకాకుళంలో నీళ్లు కలిపి విక్రయాలు

పెట్రోల్‌ బంకుపై కేసు నమోదు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి) 

ఓవైపు పెట్రోల్‌ ధర మండిపోతుంటే...మరోవైపు బంకుల యాజమాన్యాలు కల్తీతో వినియోగదారులను దోచుకుంటున్నాయి. కొలతల్లోనూ చిలక్కొట్టుడు తప్పడం లేదు. పొరపాటున ఎవరైనా వినియోగదారుడు ప్రశ్నిస్తే... అక్కడి సిబ్బంది మూకుమ్మడిగా దాడికి సిద్ధమవుతారు. ఇక బిల్లుల ఊసే ఉండదు.

..............................

పెట్రోల్‌ బంకుల్లో నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. కొన్నిచోట్ల పెట్రోల్‌, డీజిల్‌ను యథేచ్ఛగా కల్తీ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కొలతల్లో తేడాతో వినియోగదారులను దోచుకుంటున్నారు. అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేసి వదిలేస్తుండడంతో.. పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. జిల్లాలో 125 పెట్రోలు బంకులు ఉన్నాయి. ఒక్క బంకులో కూడా నిబంధనలు సక్రమంగా అమలుకావడం లేదు. లీటర్‌ పెట్రోల్‌ ప్రస్తుతం రూ.112 దాటింది. వాహనాలకు పెట్రోల్‌ వేసే సమయంలో బంకుల దగ్గర పంపుహెడ్‌లో రీడింగ్‌ సరిగానే చూపిస్తోంది. కానీ, కొన్ని మిల్లీలీటర్లు తగ్గేలా కొన్ని బంకులు గుట్టుగా ఏర్పాట్లు చేసుకున్నాయి. మరికొన్ని బంకుల్లో పెట్రోల్‌లో నీరు కలిపి విక్రయిస్తున్నారు. ఇటువంటి ఘటన ఇటీవల శ్రీకాకుళం రైతుబజారుకు సమీపంలో ఉన్న బంకులో వెలుగుచూసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి తన కారులో ఫుల్‌ ట్యాంక్‌ పెట్రోల్‌ వేయించారు. మధ్యలో కారు ఆగిపోగా.. పెట్రోల్‌లో నీరు కలపడమే దీనికి కారణమని తేలింది. దీంతో పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యం తీరుపై ఆ వ్యక్తి ఆందోళన చేయడంతో ఉన్నతాధికారులకు ఈ విషయం చేరింది. ఈ నేపథ్యంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటరమణ ఈ బంకులో పెట్రోల్‌ను  తనిఖీ చేశారు. నీరు కలసిందని.. నిర్ధారించి.. కేసు నమోదు చేశారు. ఈ కేసు జాయింట్‌ కలెక్టర్‌ కోర్టుకి బదిలీ చేసేశారు. ఈ కేసు విషయం తేలే వరకు బంకులో విక్రయాలు నిలిపివేశారు. గత ఏడాది శ్రీకూర్మంలో కూడా ఇటువంటి పరిస్థితే చోటుచేసుకుంది. కానీ యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకోలేదు. 


కానరాని బిల్లులు  

బంకుల వద్ద పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసిన వినియోగదారులకు సిబ్బంది బిల్లులు ఇవ్వాలి. కానీ,  జిల్లాలో ఎక్కడా బిల్లులు ఇవ్వడం లేదు. ప్రభుత్వ అధికారులకు చెందిన అద్దె వాహనాలకు సంబంధించి మాత్రమే కొన్నిచోట్ల బిల్లులు  ఇస్తున్నారు. మిగిలిన చోట్ల వినియోగదారులు పట్టుపట్టి మరీ అడిగితేనే బిల్లు ఇస్తున్నారు. ఇలా అయితే పన్నుల చెల్లింపుల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ ఏ రీతిలో జరుగుతోంది. స్పిరిట్‌ ఎంత మోతాదులో కలుపుతున్నారు. తదితర అక్రమాలపై బంకులకు పెట్రోల్‌ సరఫరా చేస్తున్న సంస్థలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. బిల్లు జంపింగ్‌పైనా దృష్టి సారించడం లేదు. ఈ నేపథ్యంలో యథేచ్ఛగా అక్రమాలు సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 


8 బంకుల్లో అక్రమాలు...

జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 45 బంకుల్లో తూనికలు, కొలతలు శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఇందులో 8 బంకుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇందులో ఐదు బంకుల్లో పెట్రోల్‌ కొలత తక్కువగా ఉందని గుర్తించి కేసులు నమోదు చేశారు.  మరో మూడు బంకుల్లో సకాలంలో కొలత పాత్రలకు ముద్రలు వేయలేదని గుర్తించి వాటిపై కేసు నమోదు చేశారు. టెక్కలి, ఇచ్ఛాపురంలలో ఒక్కొక్కటి, జి.సిగడాం, పాలకొండ, శ్రీకాకుళం ప్రాంతాల్లో రెండేసి బంకుల నుంచి అపరాధ రుసుం కింద రూ. 35వేలు వసూలు చేశారు. కేసులు నమోదు చేసిన బంకుల పేర్లు మాత్రం అధికారులు వెల్లడించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి బంకుల్లో అక్రమాలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

 

తేడాలుంటే ఫిర్యాదు చేయండి

బంకుల్లో పెట్రోలు, డీజిల్‌ కొలతల్లో తేడా ఉన్నా, కల్తీ జరిగినా 93981 53671 నెంబర్‌కు ఫిర్యాదు చేయండి. ఈ ఏడాది 8 బంకులపై కేసులు నమోదు చేశాం. వాటి పేర్లను మాత్రం చెప్పకూడదు. 

-విశ్వేశ్వరరావు, అసిస్టెంట్‌ కంట్రోలర్‌, తూనికలు కొలతల శాఖ

Updated Date - 2021-10-19T05:13:19+05:30 IST