సీనియర్ నటి వాణిశ్రీ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేశ్ కార్తీక్ (36) ఆత్మహత్య చేసుకున్న విషయం ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభినయ్ గుండెపోటుతో మృతి చెందారని తొలుత వార్తలు వెలువడినా.. చెంగల్పట్టు సమీపం తిరుక్కలికుండ్రంలోని తండ్రి కరుణాకర్‌కు చెందిన బంగళాలో అభినయ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
దీనిపై తిరుక్కలికుండ్రం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల మేరకు... అభినయ్ బెంగళూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తుండేవారు. లాక్డౌన్ తరువాత అభినయ్ ఒంటరిగా తిరుక్కలికుండ్రంలోని తండ్రి నివాసానికి వచ్చారు. అయితే శుక్రవారం ఉదయం ఉరికి వేలాడుతూ కనిపించారు.
వెంటనే కరుణాకర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. ఒత్తిడి కారణంగానే అభినయ్ బలవన్మరణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. అభినయ్‌కి భార్య, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. కరుణాకర్, వాణిశ్రీ దంపతుల కుమార్తె అనుపమ కూడా డాక్టరే. ఈ వార్త తెలియగానే సీనియర్ నటి తులసి సహా పలువురు వాణిశ్రీకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.