Chhattisgarh: ట్రక్ డ్రైవర్లకు ఖిలేడీ టోకరా.. పోలీస్ యూనిఫామ్ ధరించి లక్షలు వసూలు.. చివరకు..

ABN , First Publish Date - 2022-08-22T16:42:50+05:30 IST

ఆమె ఓ నటి.. ఒరియా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేది.. సంపాదన పెద్దగా రాకపోవడంతో ఓ భారీ స్కెచ్ వేసింది..

Chhattisgarh: ట్రక్ డ్రైవర్లకు ఖిలేడీ టోకరా.. పోలీస్ యూనిఫామ్ ధరించి లక్షలు వసూలు.. చివరకు..

ఆమె ఓ నటి.. ఒరియా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేది.. సంపాదన పెద్దగా రాకపోవడంతో ఓ భారీ స్కెచ్ వేసింది.. పోలీస్ యూనిఫామ్ ధరించి రోడ్ల మీద బొగ్గుతో వెళ్లే ట్రక్కులను ఆపేది.. వారి నుంచి వేల రూపాయలు వసూలు చేసేది.. అయితే ఆమె అత్యాశ ఆమె కొంప ముంచింది.. పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలైంది.. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బిలాస్‌పూర్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Shocking: మద్యం మత్తులో భర్తపై దాడి చేసిన నవ వధువు.. ప్రాణ భయంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన భర్త!



రాయ్‌గఢ్‌కు చెందిన గాయత్రి అనే వర్ధమాన నటి వేరొక వ్యక్తితో కలిసి అక్రమాలకు పాల్పడుతోంది. ఓ కారు అద్దెకు తీసుకుని, పోలీస్ వేషం వేసుకుని రోడ్లపై కాపు కాసేది. బొగ్గు రవాణా చేసే ట్రక్కులను ఆపి చెక్ చేసేది. ఏదో కారణం చెప్పి వారి నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేసేది. బిలాస్‌పూర్‌కు చెందిన దేవేంద్ర యాదవ్ అనే ట్రాన్స్‌పోర్టర్ ట్రక్కును గురువారం రాత్రి 10.30 గంటలకు ఆపింది. తనను తాను పోలీసు, మైనింగ్ శాఖ ఫీల్డ్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకుంది. ట్రక్కులో కల్తీ బొగ్గు ఉందని ఆరోపించి ఏకంగా రూ.2 లక్షలు ఫైన్ వేసింది. 


జరిమానా వెంటనే కట్టకపోతే ట్రక్కులను జప్తు చేస్తామని బెదిరించింది. దీంతో ట్రాన్స్‌పోర్టర్ తన సహచరులతో కలిసి అక్కడకు చేరుకున్నాడు. అంతేకాదు అప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారిని చూసిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. చివరకు వారందరూ పోలీసులకు దొరికిపోయారు. పోలీస్ యూనిఫామ్ ధరించి ఛీటింగ్‌కు పాల్పడుతున్న గాయత్రిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-08-22T16:42:50+05:30 IST