Apr 16 2021 @ 11:05AM

తెలుగమ్మాయికి వరుస ఆఫర్స్..!

తెలుగమ్మాలు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యన బాగానే సత్తా చాటుతున్నారు. ఈషా రెబ్బ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో అవకాశాలు అందుకుంటు క్రేజీ స్టార్‌గా మారింది. ఈ క్రమంలో మరో తెలుగమ్మాయి వరసగా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ షాకిస్తోంది. వైజాగ్‌కి చెందిన పూజిత పొన్నాడ చిన్న సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. 'ఉప్మా తినేసింది' అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా టాలీవుడ్ మేకర్స్ దృష్ఠిని ఆకట్టుకున్న పూజిత పొన్నాడ 'దర్శకుడు' సినిమాతో హీరోయింగా మారింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు రావడంతో ఏకంగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ నటించిన 'కల్కి' సినిమాలో నటించి మరో మెట్టు పెకెక్కింది. ఈ క్రమంలో ఆహా కోసం 'రన్' సినిమాలో నటించింది.

పూజిత పొన్నాడ చేసిన సినిమాలు మంచి పేరు తెస్తుండటంతో చిన్న సినిమాలను నిర్మించే మేకర్స్ తన పేరునే పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం పూజిత అయిదారు సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా మారే ప్రయత్నాలు సాగిస్తోంది. దర్శకుడు సంపత్ నంది రూపొందిస్తున్న 'ఓదెల రైల్వేస్టేషన్' లో పూజిత కీలక పాత్ర పోషించింది. అలానే గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న 'ఆకాశ వీధుల్లో' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ సినిమా 'హరిహర వీరమల్లు' లో పూజిత పొన్నాడ చిన్న పాత్రలో కనిపించనుందని సమాచారం. నిజంగా ఇలాంటి పెద్ద అవకాశాలు వస్తే ఖచ్చితంగా తెలుగమ్మాయి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అవుతుందంటున్నారు.