May 16 2021 @ 15:11PM

ఈ అమ్మాయి.. టాలీవుడ్‌కు దొరికిన కొత్తందం

ఎవరీ అమ్మాయి? ముంబయి ముద్దుగుమ్మా? అప్సరసలకు నిలయమైన మంగళూరు కన్నడిగా? తనది కళ్లు తిప్పుకోలేని అందం. చామనచాయతో తొణికిసలాడే రూపం.. శిల్పంలా చెక్కిన దేహ సౌందర్యం.. హఠాత్తుగా తెలుగులో అందరి మనసు దోచుకున్న ఆ పడచుపిల్ల తెలుగమ్మాయి.. విజయవాడ వాసి..పేరు.. దక్షి గుత్తికొండ.. రామ్‌గోపాల్‌వర్మ తీసిన కరోనా వైరస్‌ చిత్రంతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న దక్షి టాలీవుడ్‌కు దొరికిన కొత్తందం.. వివిధ సందర్భాల్లో ఆమె చెప్పిన కబుర్లు... 


 నేను విజయవాడలో పుట్టాను. బెంగళూరు, హైదరాబాద్‌లలో పెరిగాను. నాకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే మహా ఇష్టం. అయితే కుటుంబ సభ్యులకు ఇష్టం ఉండేది కాదు, వారికి సినిమాలతో ఎలాంటి నేపథ్యం లేదు. ఇంటర్‌ తరువాత ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేశా. నేను రూపొందించిన డిజైన్లతో మోడలింగ్‌ కూడా చేశాను. వాణిజ్య ప్రకటనల్లో అవకాశాలు రావడం మొదలైంది. మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నా. సినిమా అవకాశాలు వచ్చాయి. ఇంట్లో ఆమోదం లభించలేదు. మెల్లగా ఒప్పించాను. సత్యానంద్‌ సార్‌ దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నా. కథక్‌ కూడా నేర్చుకున్నాను. 


మొదట్లో చాలా ఆడిషన్స్‌కు వెళ్లాను. కానీ అవకాశాలు ఇవ్వడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. అయినా నిరుత్సాహపడలేదు. ఫేస్‌బుక్‌లో మోటివేషనల్‌ పోస్టులు పెడుతూ, వాటికి నా ఫోటోను తగిలించేదాన్ని. ఒక రోజు ఆ పోస్టులను చూసిన దర్శకుడు శేఖర్‌సూరి నాకు కబురు పెట్టారు కలవమని. వాళ్ల ఆఫీస్‌కు వెళ్లాను. వెబ్‌సిరీస్‌లో అవకాశం ఇచ్చారు. కొంత భాగం షూట్‌ చేశారు కూడా. అయితే అంతలోనే కరోనా విస్తరించింది. 

రామ్‌గోపాల్‌వర్మ సినిమాల్లో నటించడం ఏ నటులకైనా జీవిత కల. సార్‌ నాకు అవకాశం ఇవ్వగానే చాలా సంతోషించాను. పెద్ద సినిమా కదాని నేను నెర్వస్‌గా ఫీలవ్వలేదు. అదృష్టంగా భావించానంతే! చిన్న వయసులోనే అత్యంత అనుభవజ్ఞుడైన దర్శకుడు ఆర్జీవీ సినిమాల్లో నటించే అవకాశం రావడం అద్భుతమే కదా!. ఆయన చాలా జంటిల్‌మెన్‌, ప్రొఫెషనల్‌. కరోనా వైరస్‌ చిత్రం సున్నితమైన, భావోద్వేగాలతో ముడివడిన కథ. అందులో నాది కీలకపాత్ర. భవిష్యత్తులో నాకు మరిన్ని కొత్త అవకాశాలు కల్పించే సినిమా అవుతుందని ఆశిస్తున్నా. 


ఎక్స్‌పోజింగ్‌ అనేది పాత్రను బట్టి ఉంటుంది. సినిమాలో పాత్ర, సన్నివేశం డిమాండ్‌ చేసినప్పుడు ఎక్స్‌పోజ్‌ చేయక తప్పదు. అందులో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే స్కిన్‌షో మాత్రం అవసరం లేదు. ఆర్జీవీ కరోనా వైరస్‌ చిత్రాన్ని లాక్‌డౌన్‌ వంటి క్లిష్టసమయంలో ఎంతో జాగ్రత్తగా చిత్రీకరించారు. అందరికీ వైద్య పరీక్షలు చేశాకే సెట్‌లోకి అనుమతించేవారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ... సినిమాను చిత్రీకరించారు. ఇలాంటప్పుడు నటించడం నిజంగా ఒక సవాలే!. ఇదొక కొత్త అనుభవం. 


మన సినీ పరిశ్రమ తెలుగు అమ్మాయిలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ముంబయి నుంచి వచ్చిన వాళ్లనే ఎక్కువగా తీసుకుంటున్నారు. మన దగ్గరున్న తెలుగు అమ్మాయిల్లో చాలామంది అద్భుతంగా నటించే వాళ్లున్నారు. అవకాశాలు ఇచ్చినప్పుడే కదా వారి ప్రతిభను నిరూపించుకునేది?.