Jul 21 2021 @ 17:12PM

ఫామ్‌హౌస్‌లో మందు పార్టీ: నటి సహా 15 మంది అరెస్ట్

చెన్నై: స్థానిక ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డు కానత్తూరులోని ఓ ఫామ్‌ హౌస్‌లో ఆదివారం రాత్రి మందు పార్టీలో అశ్లీల నృత్యాలు చేసిన టీవీ నటి సహా 15 మంది యువతీయువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వారిని తీవ్రంగా మందలించి విడుదల చేశారు. నగరానికి దూరంగా ఉన్న కానత్తూరు ఫామ్‌ హౌస్‌లలో వారంతపు సెలవుదినాల్లో మందు పార్టీలు, బుల్లితెర నటీనటుల అశ్లీల నృత్యాలు జరుగుతున్నట్టు పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి.


ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి అక్కడి ఫామ్‌ హౌస్‌లో టీవీ సీరియల్‌ నటి కవితాశ్రీ మరికొందరు యువతులు మందు పార్టీలో పాల్గొన్నారు. ఈ మందు పార్టీలో పాల్గొనేందుకు నగరంలోని ప్రముఖులు, యువకులు తరలివచ్చారు. ఈ పార్టీలో పాల్గొనేందుకు వారి వద్ద తలా రూ.5 వేల చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. ఈ మందు పార్టీ గురించి సమాచారం అందటంతో కానత్తూరు పోలీసులు రాత్రి పది గంటల ప్రాంతంలో ఆ ఫామ్‌ హౌస్‌ వద్దకు వెళ్ళారు. పోలీసులు వచ్చారని తెలియటంతో నృత్యకార్యక్రమాల్లో పాల్గొన్న యువతీయువకులు ఫామ్‌హౌస్‌ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటాడి టీవీ నటి కవితాశ్రీ సహా 15 మంది యువతీయువకులను నిర్బంధించారు. పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్ళి విచారణ జరిపి విడిచిపెట్టారు. అయితే కరోనా నిరోధక నిబంధనలు ఉల్లంఘించి ఫామ్‌హౌస్‌లో మందు పార్టీలు జరిపినందుకు పోలీసులు 15 మందిపైనా కేసు నమోదు చేశారు.