అభిమానులతో విజయ్ భేటీ.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమా?

ABN , First Publish Date - 2020-10-25T12:44:12+05:30 IST

‘ఇళయ దళపతి’ విజయ్‌ అభిమాన సంఘ నిర్వాహకులతో హఠాత్తుగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విశ్వనటుడు కమల్‌హాసన్‌ తరువాత అంతటి స్టార్‌డం ఉన్న వ్యక్తి నటుడు విజయ్‌. ఆయన అభిమానులు సంఘాలుగా ఏర్పడి వివిధ సేవా కార్యక్రమాలు

అభిమానులతో విజయ్ భేటీ.. పొలిటికల్ ఎంట్రీ ఖాయమా?

చెన్నై : ‘ఇళయ దళపతి’ విజయ్‌ అభిమాన సంఘ నిర్వాహకులతో హఠాత్తుగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విశ్వనటుడు కమల్‌హాసన్‌ తరువాత అంతటి స్టార్‌డం ఉన్న వ్యక్తి నటుడు విజయ్‌. ఆయన అభిమానులు సంఘాలుగా ఏర్పడి వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కొన్నేళ్లుగా విజయ్‌ రాజకీయాల్లో వస్తారని వార్తలొస్తున్నాయి. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతుగా విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పని చేసినట్లు తెలిసింది. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో విజయ్‌ చేసే ప్రసంగాలు రాజకీయ ప్రకంపనలు రేపాయి. ముఖ్యంగా ‘తలైవా’, ‘కత్తి’ వంటి చిత్రాల్లో విజయ్‌ చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారం లేపాయి. ‘మెర్సల్‌’ చిత్రంలో బీజేపీని, ‘సర్కార్‌’ చిత్రంలో అన్నాడీఎంకేను విమర్శిస్తూ వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. 


గత ఏడాది ‘బిగిల్‌’ చిత్ర విడుదల అనంతరం ఈ ఏడాది విజయ్‌ ఇల్లు, కార్యాలయం, చిత్ర నిర్మాతల గృహాలు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగాయి. కొన్ని రోజుల క్రితం విజయ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ. చంద్రశేఖర్‌ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో... విజయ్‌ మక్కల్‌ ఇయక్కం భవిష్యత్తులో రాజకీయ వ్యవస్థగా మారుతుందని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకే కూటములు, నటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం బరిలో నిలవడం ఖాయమైంది. అదే సమయంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీ ప్రారంభిస్తారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు విజయ్‌ కూడా పార్టీని స్థాపించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు వెలువడ్డాయి. కొంతకాలంగా తనకు సొంతమైన పనయూర్‌ ఫాంహౌస్‌లో అభిమాన సంఘాల నిర్వాహకులతో సమావేశమవుతున్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో తిరుచ్చి నార్త్‌, సౌత్‌, మదురైనార్త్‌, సౌత్‌ జిల్లాల నిర్వాహకులతో విజయ్‌ సమావేశమయ్యారు. కన్నియకుమారి, రాణిపేట, తిరుపత్తూర్‌, కడలూరు అభిమాన సంఘ నిర్వాహకులు, మహారాష్ట్రకు చెందిన అభిమాన సంఘాలతో కూడా ఆయన సమావేశమయ్యారు.


చెంగల్పట్టు, కళ్లకురిచ్చి జిల్లా అభిమాన సంఘ నిర్వాహకులతో త్వరలో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశాల వివరాలు శనివారం మీడియాలో వెలుగుచూశాయి. సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని పేర్కొన్న విజయ్‌ ప్రజల నుంచి విరాళాలు సేకరించరాదని, అవసరమైన సమయంలో తానే సాయం చేస్తానని హామీ ఇచ్చారు. సేవా కార్యక్రమాలతో పాటు తల్లిదండ్రులను బాగా చూసుకోవడమే కాకుండా ఇంటి విషయాలు కూడా పట్టించుకోవాలని సూచించారు. కరోనా కాలంలో చేపట్టిన సేవా కార్యక్రమాలపై సంఘ నిర్వాహకులను అభినందించారు. సభ్యులను చేర్పించడంతోపాటూ వార్డుల వారీగా ప్రతినిధులను ఎంపిక చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఇది సాధారణ సమావేశాలైనా పలు రాజకీయ విషయాలు చర్చించినట్లు సమాచారం. శాసనసభ ఎన్నికలకు ఇంకా 5 నెలలే గడువు ఉండడంతో నటుడు విజయ్‌ తన అభిమాన సంఘ నిర్వాహకులతో సమావేశాలు కావడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. 

Updated Date - 2020-10-25T12:44:12+05:30 IST