2 వేల అడుగుల ఎత్తులో... విమానం రెక్కపై... తలకిందులుగా SUPER STAR!

ఆయన వయస్సు 59 ఏళ్లు. అయితేనేం, పాతికేళ్ల యువకులు కూడా అవాక్కయ్యేలా సాహసాలు చేస్తుంటాడు. తాజాగా మరోసారి బరిలోకి దిగాడు. సారీ... బరిలోకి ఎగిరాడు!

హాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో టామ్ క్రుయిజ్‌కు స్టంట్స్ కొత్తేం కాదు కదా... ‘మిషిన్ ఇంపాజిబుల్’ స్టార్ మళ్లీ ఆశ్చర్యపరిచాడు. ఈసారి 80 ఏళ్ల పురాతనమైన యుద్ధ విమానంలో గాల్లోకి ఎగిరి విన్యాసం చేశాడు. ఇంతకీ విషయం ఏంటంటే... ఓ ఫైటర్ ప్లేన్‌లో పైలట్‌తో పాటూ కూర్చున్న టామ్ 2 వేల అడుగుల ఎత్తుకి ఎగిరాడు. ఆకాశంలో విమానం ఉండగా... కాక్‌పిట్‌ లోంచి బయటకు వచ్చాడు. మెల్లగా వార్ ప్లేన్ వింగ్ మీదకి చేరాడు. గాల్లో చక్కర్లు కొడుతోన్న విమానం రెక్క మీద నుంచీ తల కిందులుగా వేలాడాడు! అప్పుడు పైలట్ ఏం చేశాడో తెలుసా? రెండో ప్రపంచ యుద్ధంలో పాలుపంచుకున్న ఆ విమానాన్నిఅమాంతం పల్టీ కొట్టించాడు. దాంతో తలకిందులుగా ఉన్న 59 ఏళ్ల టామ్ క్రుయిజ్ విమానం రెక్క మీద నిటారుగా కూర్చున్నాడు!

2023లో విడుదల కానున్న ‘మిషిన్ ఇంపాజిబుల్ 8’ సినిమా కోసం రిహార్సిల్‌గా టామ్ క్రుయిజ్ తాజా స్టంట్‌ను చేశాడు. హాలీవుడ్ సూపర్ స్టార్ ఆకాశంలో విమానం నుంచీ జారి పడిపోకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు మూవీ మేకర్స్. అతడు ప్రయాణించిన వార్ ప్లేన్‌కు తోడుగా మరో విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. అయితే, ‘మిషిన్ ఇంపాజిబుల్ 8‘ కంటే ముందే 2022 సెప్టెంబర్‌లో ‘మిషిన్ ఇంపాజిబుల్ 7’ రిలీజ్ కానుంది. యాక్షన్ లవ్వర్స్ ఆ సినిమా కోసం కరోనా ప్యాండమిక్ కంటే ముందు నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Advertisement