‘శ్రీమంతుడు, దువ్వాడ జగన్నాథం, వినయ విధేయ రామ, జై లవకుశ, నా పేరు సూర్య, పుష్ప’ లాంటి సినిమాల్లో విలన్ గా నటించి టాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడు హరీశ్ ఉత్తమన్. తమిళ మాతృభాష అయినప్పటికీ.. తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ హరీశ్ నటించి మెప్పించాడు. నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన హరీశ్ ఉత్తమన్ ఇప్పుడో ఇంటివాడయ్యాడు. మలయాళ నటీమణి చిన్ను కురువిళను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు.కేరళలోని మావేలిక్కర సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో వారి పెళ్ళి జరిగింది. అనంతరం దగ్గర బంధువులకు, స్నేహితులకు రిసెప్షన్ ను కూడా ఏర్పాటు చేశారు. కొన్ని మలయాళ చిత్రాల్లో నటించి ప్రస్తుతం ఆపరేటివ్ కెమేరా విమన్ గా పనిచేస్తున్న చిన్ను.. త్వరలో కెమేరా విమన్ గా మారే ప్రయత్నంలో ఉంది. ఓ మలయాళ సినిమా షూటింగ్ సందర్భంగా పరిచయమై.. ఆపై ప్రేమలో పడిన ఈ జంట.. ఇప్పుడు పెళ్ళితో ఒకటయ్యారు.