Apr 29 2021 @ 18:34PM

ఆ డైరెక్టర్ ఎన్టీఆర్‌ని కూడా కొట్టమన్నారు: గిరిబాబు (పార్ట్ 4)

‘మా ప్రాణాలు తియ్యడానికి కొత్తవాళ్లని తెస్తుంటారండీ.. వీళ్లకి ఎంత చెప్పినా అర్థం కాదు.. రాదు’ అని కోపాన్ని ఆపుకోలేక తిట్టడం ప్రారంభించారు. పాపం మాధవి ఆయన ఉగ్రరూపాన్ని చూసి బిత్తరపోయింది. ఆ కంగారులో మరిన్ని టేకులు తింది. అంతే. మధుసూదనరావుగారికి సహనం నశించి స్ర్కిప్ట్‌ ఫైలు నేల మీదికి విసిరి కొట్టి.. ‘ఏయ్‌ గిరిబాబూ.. నా వల్ల కాదు.. ఈ అమ్మాయికి నువ్వే డైలాగ్‌ నేర్పించు.. మీరిద్దరూ మాట్లాడుకొని రెడీ అయ్యాక చెప్పండి. అప్పుడు షాట్‌ తీద్దాం’ అంటూ మధుసూదనరావుగారి వ్యక్తిత్వం గురించి చెప్పిన నటుడు గిరిబాబు మరికొందరి దర్శకులతో తనకున్న అనుబంధాలను ఈ విధంగా చెప్పుకొచ్చారు.


పి.సి.రెడ్డి..

ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డిగారు. ఆయన్ని ‘పి.సి.రెడ్డి’ అని పిలుస్తుంటారందరూ. ‘బడిపంతులు’, ‘మానవుడు-దానవుడు’, ‘ఇల్లు- ఇల్లాలు’, ‘పాడిపంటలు’ వంటో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన దర్శకుడాయన. సెంచరీ పూర్తి చేసుకోవడానికి దరిదాపుల్లోకి వచ్చిన దర్శకుడు. సెట్లో ఆయన చాలా కూల్‌గా, సరదాగా ఉంటారు. ఇరిటేట్‌ అవరు. అనుకున్నది క్లియర్‌గా తీస్తాడు. ఆయన చేసిన సినిమాల సక్సెస్‌రేట్‌ ఎక్కువ కనుక చాలా సినిమాలు చేయగలిగారు. కొత్త నీరు వచ్చినప్పుడల్లా పాత నీరు కొట్టుకుపోవడం సహజం. అలాగే కొత్త దర్శకులు అనేక మంది వచ్చిన తర్వాత పి.సి.రెడ్డిగారు రేసులో వెనకబడ్డారు. మరో విషయమేమిటంటే ఆయన శిష్యుల్లో చాలా మంది దర్శకులుగా పరిచయమై పరిశ్రమలో మంచి పొజిషన్‌లో ఉన్నారు. ‘పట్నవాసం’ చిత్రంతో ప్రారంభించి పి.సి.రెడ్డిగారి దర్శకత్వంలో చాలా సినిమాలు చేశాను. చాలా మంచి దర్శకుడు.

కె. హేమాంబధరరావు..

ఈయన దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత కూడా. ఆయన నిర్మించిన ‘పరివర్తన’ వంటి సినిమాల్లోనూ నేను నటించాను. ఆయన ఏ మాత్రం కోపిష్టి కాదు. చాలా సౌమ్యుడు. విషయ పరిజ్ఞానం ఎక్కువ. సబ్జెక్ట్‌ మీద కమాండ్‌ ఎక్కువ. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా అద్భుతంగా సీన్లు తీసేవాడు.

 

తాతినేని రామారావు..

రామారావుగారి దర్శకత్వంలో నేను తొలిసారిగా ‘దొరబాబు’ చిత్రంలో నటించాను. ఆ తర్వాత ఐదారు చిత్రాలు చేశాను. తపన కలిగిన దర్శకుడాయన. సెట్‌లోకి వస్తే ఆయన దృష్టంతా షాట్‌ ఎలా తీయాలి, సీన్‌ని ఎలా పండించాలి అని ఆలోచించేవారు తప్ప మిగిలిన విషయాల జోలికి వెళ్లరు. కన్‌ఫ్యూజన్‌ లేని డైరెక్టర్‌. తెలుగులోనే కాదు హిందీలోనూ ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన దర్శకుడాయన. రామారావుగారి దర్శకత్వంలో నటిస్తున్పప్పుడు నాకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు.

 

కె.బాపయ్య..

వెరీ డెడికేటెడ్‌ డైరెక్టర్‌ బాపయ్యగారు. సెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత బయటి ప్రపంచం గురించి ఆయన మరిచిపోయేవారు. తను బాపయ్యని అనే విషయం కూడా ఆయనకి గుర్తుండేది కాదు. సెట్‌లో ఫైట్‌ తీస్తుంటే కెమెరా వెనుక నిలబడి ఈయన ఫైట్‌ చేసేవారు. హీరోహీరోయిన్‌ డాన్స్‌ చేస్తుంటే తను కూడా డాన్స్‌ చేసేవారు. అంతగా ఇన్‌వాల్వ్‌ అయ్యేవారు. ఆర్టిస్టుల పేర్లు కూడా మరిచిపోయేవారు. నా పేరు గిరిబాబు అన్న విషయం చాలా సార్లు మరిచిపోయి, దాదాపు పది వేరే పేర్లతో పిలిచి ఉంటాడు. ‘వెంకట్రామయ్యా’ అని ఒకసారి, ‘పుల్లారెడ్డి’ అని మరోసారి పిలిచేవాడు. ‘సార్‌ నా పేరు గిరిబాబు అండీ’ అనగానే ‘అవును కదూ.. మరిచిపోయానోయ్‌’ అనేవారు. ఆ రోజుల్లో ఆయన గురించి ఒక జోక్‌ చెప్పేవారు. అదేమిటంటే ‘ఎదురులేని మనిషి’ చిత్రంలో రామారావుగారి మీద ఒక ఫైట్‌ సీన్‌ తీస్తున్నారు. రామారావుగారు ఫైటర్లని కొట్టే షాట్‌ అది. ‘కొట్టు వాడిని బాగా కొట్టు’ అని కెమెరా వెనక నిలబడి ఎంకరేజ్‌ చేశారు బాపయ్య. ఆ తర్వాత ఫైటర్‌ రామారావుగారిని కొట్టే షాట్‌ తీస్తున్నారు. ఆ విషయం మరిచిపోయి ‘కొట్టు బాగా కొట్టు’ అనేశారు బాపయ్య యథాలాపంగా. వెంటనే రామారావు గారికి కోపం వచ్చి ‘ఏమిటి బ్రదర్‌ బాపయ్యగారూ.. ఏమైంది మీకు?’ అని అనగానే నాలిక కరుచుకుని సారీ చెప్పేశారు. ఆ రోజుల్లో బాగా ప్రచారంలో ఉన్న జోక్‌ ఇది. షూటింగ్‌కు వచ్చిన తర్వాత తన ఇల్లు గురించి కూడా మరిచిపోయేవారు. ఈ సందర్భంగా జరిగిన ఒక తమాషా సంఘటనని మీకు చెప్పాలి. 

ఒక రోజు ‘సాహసవంతుడు’ షూటింగ్‌ ప్యాకప్‌ కాగానే ‘గిరిబాబూ.. నువ్వు డైరెక్టర్‌గారిని ఇంటి దగ్గర దించేసి అదే కార్లో మీ ఇంటికి వెళ్లిపో’ అని ప్రొడక్షన్‌ మేనేజర్‌ చెప్పడంతో సరేనన్నాం. నేను, బాపయ్యగారు కారు ఎక్కాం. ఆయన ఇల్లు ఎక్కడో నాకు తెలీదు. కృష్ణవేణి థియేటర్‌ దగ్గర నంది సి.ఐ.టి. నగర్‌లో ఉంటారని మాత్రం తెలుసు. డ్రైవర్‌ కొత్త వాడు కావడంతో అతనికీ రూట్‌ తెలీదు. అయినా నాకు సి.ఐ.టి నగర్‌ తెలుసు కనుక కారెక్కి పోనివ్వమన్నాం. కాసేపటికి నంది సి.ఐ.టి. నగర్‌ చేరుకున్నాం. కారుని కొంచెం స్లో చేసి ‘సార్‌.. మన ఇల్లు ఎక్కడ’ అని అడిగాడు డ్రైవర్‌. ‘మా ఇల్లు... ఇక్కడో ఎక్కడో ఉండాలి’ అని నావైపు తిరిగి ‘గిరిబాబూ నీకు తెలీదా?’ అనడిగాడు. ఆయన అలా అడిగేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి ‘తెలీదు సార్‌’ అన్నాను. దాంతో బాపయ్యగారు కన్‌ఫ్యూజన్‌లో పడి ‘అలాగా.. అయితే కొంచెం ముందుకు పో అక్కడుందేమో చూద్దాం’ అన్నారు. ముందుకు వెళ్లిన తర్వాత రెండు రోడ్లు వచ్చాయి. బాపయ్యవైపు తిరిగి ‘సార్‌.. లెఫ్టా.. రైటా’ అనడిగాడు డ్రైవర్‌. ఏ విషయం చెప్పలేక ఆలోచనలో పడ్డారాయన. ఆయన పరిస్థితి చూసేసరికి నాకు నవ్వు ఆగలేదు. ‘ఏమిటి సార్‌... లెఫ్టా, రైటా అని అడుగుతుంటే చెప్పకుండా ఆలోచిస్తారేమిటి డైరెక్టర్‌గారూ’ అన్నాను. ‘ఇక్కడే ఉండాలయ్యా.. నేనూ అదే చూస్తున్నాను.. లెఫ్ట్‌కు పోనియ్యి.. అక్కడుందేమో చూద్దాం’ అన్నారు. లెఫ్ట్‌కు తిరిగింది కారు. అక్కడ తన ఇల్లు లేకపోయేసరికి రైట్‌కు పోనివ్వమన్నారు. అక్కడ కూడా ఇల్లు కనిపించలేదు. ఇలా అరగంట సేపు సందులుగొందులు తిప్పేసరికి కారు డ్రైవర్‌కి ఓపిక నశించింది. రోడ్డు పక్కన కారు ఆపేసి ‘కరెక్ట్‌గా ఎక్కడో చెప్పండి సార్‌.. అక్కడికి తీసుకెళతాను’ అని బతిమాలాడు. పాపం.. బాపయ్యగారికి తన ఇల్లు ఎక్కడుందనేది గుర్తుకు రావడం లేదు. ఆలోచనలో పడ్డాడు. ఏం చేయాలో తోచలేదు నాకు. తెలిసిన వాళ్లెవరైనా కనిపిస్తారేమోనని అటూ ఇటూ చూశాను.

 

సరిగ్గా ఆ సమయంలో ఫుట్‌పాత్‌ మీద నడుచుకుంటూ వస్తున్న రచయిత భమిడిపాటి రాధాకృష్ణ కనిపించారు. వర్షం కురుస్తుండటంతో గొడుగుతో కవర్‌ చేసుకుంటూ మెల్లిగా నడుస్తున్నారాయన. థాంక్‌గాడ్‌ అనుకుని ఆయన్ని పిలిచాను. ‘ఎవరూ’ అనుకుంటూ మా కారు దగ్గరికి వచ్చారు. 

 

‘నేనండీ గిరిబాబుని.. బాపయ్యగారింటికి వెళ్లాలి. ఇల్లు ఎక్కడో మాకు తెలియడం లేదు’ అన్నాను.

 

‘బాపయ్యగారికి ఫోన్‌ చేసి అడగకపోయారా’ అని ప్రశ్నించాడాయన.

 

‘ముందు సీట్లో కూర్చున్నది ఆయనేనండీ. వర్షం పడుతోంది కదా. ఆయనకీ దారి తెలియడం లేదు’ అన్నాను.

 

‘ఏమయ్యా .. మీరు జోకులు వెయ్యడానికి నేనే దొరికానా..’ అని విసుక్కుని బాపయ్యగారి వైపు తిరిగి బాపయ్యా.. నీ ఇల్లు ఎక్కడో నేను చెప్పాలా’ అనడిగారు రాధాకృష్ణగారు. బాపయ్యగారు ఇబ్బందిగా సీట్‌లో కదిలారు కానీ ఏమీ మాట్లాడలేదు. 

 

‘కాదు సార్‌.. నిజమే .. మమ్మల్ని అర్థం చేసుకోండి’ అన్నాను.

 

బాపయ్యగారి సంగతి ఆయనకు తెలుసు కనుక విషయం అర్థమై ‘అదుగో.. కనిపిస్తోందే ఆ లెఫ్ట్‌.. అటువైపు వెళితే మొదటి ఇల్లు బాపయ్యదే’ అని చెప్పి వెళ్లిపోయారు రాధాకృష్ణగారు. చివరికి ఎలాగైతేనేం ఆయన్ని ఇంటికి దగ్గర దింపేసి మా ఇంటికి వెళ్లిపోయాను. మర్నాడు షూటింగ్‌లో ప్రభాకరరెడ్డి, తదితరులకు ఈ విషయమంతా చెప్పాను. విని వాళ్లు ఒకటే నవ్వు. బాపయ్య సెట్‌లోకి రాగానే ‘ఏం బాపయ్యా.. రాత్రి మీ ఇల్లు నువ్వు మరిచిపోయావట కదా’ అని ప్రభాకరరెడ్డి ఆట పట్టించగానే ఆయన కాస్త సిగ్గు పడ్డారు. బాపయ్యగారితో అదో తమాషా అనుభవం నాకు. 

 

‘దానవీరశూర కర్ణ’ మిస్‌ అయ్యా...

సింగీతం శ్రీనివాసరావు, కె.విశ్వనాథ్‌, బాపు, జంధ్యాల .. ఇలా ప్రతి ఒక్క దర్శకునితో పనిచేసే అవకాశం నాకు లభించింది. మరో సీనియర్‌ డైరెక్టర్‌ కమలాకర కామేశ్వరరావుగారి దర్శకత్వంలో ‘కురుక్షేత్రం’ సినిమా చేశాను. అందులో దుశ్శాసునుడి వేషం నాది. నేను మిస్‌ అయిన డైరెక్టర్‌ ఎన్టీఆర్‌. ఆయన దర్శకత్వం వహించిన ‘దానవీరశూర కర్ణ’ చిత్రంలో అర్జునుడి వేషం నేనే వెయ్యాలి. అప్పటికే ‘కురుక్షేత్రం’ సినిమా కమిట్‌ కావడంతో, డేట్స్‌ అడ్జెస్ట్‌ అవక నటించలేదు. ఆ తర్వాత ఆ వేషానికి మాదాల రంగారావుని తీసుకున్నారు. మరి తర్వాత ఏమైందో తెలీదు కానీ అర్జునుడి వేషం హరికృష్ణ వేశారు.

(ఇంకా ఉంది)

 -వినాయకరావు

FilmSerialమరిన్ని...