Apr 27 2021 @ 17:22PM

సహనం నశించి స్ర్కిప్ట్‌ ఫైలు నేల మీదికి విసిరి కొట్టారు: గిరిబాబు (పార్ట్ 3)

తన తప్పు లేకపోయినా.. డైరెక్టర్‌ తనని టార్గెట్‌ చేస్తూ.. మాట్లాడారని ప్రముఖ నటుడు గిరిబాబు తన భుజంపై ఉన్న గొడ్డలిని నేలకేసి విసిరేసి.. సెట్‌లో నుంచి వెళ్లిపోయినట్లుగా తెలిపిన విషయం తెలిసిందే. అలా ఎందుకు జరిగిందో.. ఆ తర్వాత ఆ డైరెక్టర్‌ ఏం చేశారో పార్ట్ 1, 2లలో తెలిపారు. ఈ పార్ట్‌లో అందరూ దుర్వాసుడిలా భావించే దర్శకుడు మధుసూదనరావు గురించి, ఆయనతో గిరిబాబుకి ఉన్న అనుబంధం గురించి తెలిపారు. మరెందుకు ఆలస్యం.. అప్పటి మధుర జ్ఞాపకాలను మీరూ తెలుసుకోండి.


మధుసూదనరావు

రామకృష్ణారావు అని కెమెరామన్‌ ఉండేవారు. ‘గాజుల కిష్టయ్య’ చిత్రానికి కూడా ఆయన పనిచేశారు. ఆయన నిర్మాతగా మారి ‘జడ్జిగారి కోడలు’ అనే సినిమా తీశారు. జడ్జిగా సత్యనారాయణగారు నటించారు. రామకృష్ణ, జయప్రద హీరోహీరోయిన్లు. మధుసూదనరావుగారంటే ఇండస్ట్రీలో టెర్రర్‌. ఏ మాత్రం తప్పుగా నటించినా, ఒకటి రెండు టేకులు తిన్నా దుర్వాసుడిలా మారిపోయి ఆర్టిస్టుల్ని తిట్టేసేవారాయన. అందుకే ఆయన పేరు చెబితే ఆర్టిస్టులు హడలిపోయేవారు. ఈ సినిమాకి ఆయన డైరెక్టర్‌. నేను విలన్‌గా చాలా బిజీగా ఉన్నాను. సినిమాలో నాకో వేషం ఉందని రామకృష్ణారావుగారు కాల్షీట్‌ పంపించారు. ఆ వేషాన్ని ఒప్పుకోవాలా, వద్దా అని చాలా సేపు తటపటాయించాను. ‘ఎవరన్నా నా గురించి పరుషంగా మాట్లాడితే నేను సహించలేను. అది ఆత్మాభిమానం అనుకోండి, మరేదన్నా అనుకోండి. ఒక వేళ నేను పొరపాటున సరిగ్గా చేయలేకపోతే మధుసూదనరావుగారు ఆగ్రహిస్తారేమో.. దాన్ని సహించగలమా.. దానికి బదులు ఈ సినిమా వదిలేస్తే బెటరు కదా’ అనిపించింది.

కానీ మధుసూదనరావు గొప్ప దర్శకుడు. ఆయన దగ్గర పనిచేసే అవకాశం రాకరాక వచ్చింది. దాన్ని వదులుకోవడమా.. ఇలా ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడాను. సుదీర్ఘంగా ఆలోచించి ఆ సినిమా చేయకపోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చేసి ‘కాల్షీట్లు లేవు’ అని రామకృష్ణారావుకు కబురు చేశాను. అయినా ఆయన నన్ను వదిలి పెట్ట లేదు. ‘ఒకసారి ఆఫీసుకు రండి. డైరెక్టర్‌గారు పిలుస్తున్నారు’ అని కబురు చేశారు. సరేనని ఆఫీసుకు వెళ్లాను. ‘ఏమిటయ్యా.. ఈ సినిమా చెయ్యనన్నావట. ఏమిటీ కారణం’ అని వెళ్లగానే ప్రశ్నించారు మదుసూదనరావుగారు. అసలు విషయం ఆయనతో చెప్పడానికి భయపడి ‘ఏం లేదు గురువుగారూ.. కాల్షీట్లు ఎడ్జెస్ట్‌ కావడం లేదు’ అని నసిగాను. ‘ఏ సినిమాలు చేస్తున్నావు ఇప్పుడు’ అని అడిగి తెలుసుకుని వాళ్లతో మాట్లాడి మొత్తానికి ఎలాగైతేనేం నేను ఆ సినిమాలో నటించేటట్టు చేశారు మధుసూదనరావుగారు. నా పక్కన మాధవిని బుక్‌ చేశారు. ‘తూర్పు-పడమర’ సినిమా తర్వాత ఆమెకి ఇది రెండో సినిమా. డేట్స్‌ దగ్గర పడిన కొద్దీ నాలో టెన్షన్‌ స్టార్ట్‌ అయింది.


అసలే ఆయన్ని చూస్తే దడ. ఆ భయంతో చెప్పే డైలాగుని కూడా సరిగ్గా చెప్పగలనా లేదా అని సందేహం. చెప్పకపోతే ఏమన్నా అంటారేమో.. అంటే నేను సహించి ఊరుకోగలనా..

సెట్‌లో ఆయనకు ఎదురుతిరిగి మాట్లాడితే.. ఆ తర్వాత ఏమవుతుంది.. ఇన్ని ఆలోచనలతో ఆ రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోలేదు. ఆ మర్నాడు పొద్దునే లొకేషన్‌కి వెళ్లాను. అంతవరకూ చాలా సినిమాలు చేసినా అదే తొలి సినిమా అనే ఫీలింగ్‌.. మనసులో ఏదో బెరుకు.

 

శివాజీ గార్డెన్స్‌లో షూటింగ్‌. మాధవితో కాంబినేషన్‌. మా ఇద్దరి మధ్య రొమాంటిక్‌ సీన్లు తీయాలి. టిఫెన్‌ చేశాను. అల్లంతదూరంలో మధుసూదనరావుగారు కూర్చుని ఉంటే వెళ్లి నమస్కారం పెట్టాను.

 

‘ఏమయ్యా.. సీన్‌ చూశావా’ అని అడిగారు మధుసూదనరావుగారు.

ఆయన మామూలుగా అడిగినా సింహం గర్జించినట్లుగా నాకు అనిపించింది.


‘చూశానండీ’ అని సమాధానం చెప్పాను.

 

‘ఓ.కే. మీ ఇద్దరి మీదే వర్క్‌ ఇవాళ. బాగా చెయ్యండి’ అనేసి తన పనిలో నిమగ్నమయ్యా రాయన.

 

షాట్‌ తీసే టైమ్‌ దగ్గరయ్యేకొద్దీ నాకు బి.పి. పెరుగుతోంది. అయినా నా జాగ్రత్తలో నేనున్నాను. ఆ రోజుల్లో సిగరెట్‌ తాగేవాణ్ణి. జేబులోంచి సిగరెట్‌ ప్యాకెట్‌ బయటికి తీశాను. నాకు అల్లంత దూరంలో మధుసూదనరావుగారు కూర్చుని సీన్‌ పేపర్‌ చదువుతున్నారు. పాకెట్‌లోంచి సిగరెట్‌ బయటికి తీసి ‘డైరెక్టర్‌గారూ.. మీరు సిగరెట్‌ తాగుతారా?’ అనడిగాను. తపోభంగం అయిన మునిలా ఆయన కోపంగా నా వంక చూసి ‘సిగరెట్టా... తాగుతాను.. అయితే ఏమిటి?’ అని సీరియస్‌గా ప్రశ్నించారు.

‘అహా.. ఏమీ లేదు సార్‌.. మీరు సిగరెట్‌ కాలుస్తారేమోనని....’

 ‘నువ్వు కాలుస్తావా.. అలవాటా బాగా...’

 ‘అవునండీ’

 ‘ఓ.కే, ఓకే .. అదేదో త్వరగా కానిచ్చి సీన్‌ సంగతి చూడు’ అని పర్మిషన్‌ ఇచ్చేశారు.

‘హమ్మయ్య...’ అనుకుని ఓ పక్కకు వెళ్లి సిగరెట్‌ కాల్చుకుని వచ్చి, మళ్లీ కుర్చీలో కూర్చున్నాను.

 

కాసేపటికి షూటింగ్‌ మొదలైంది. నేను డైలాగు బాగానే చెబుతున్నాను కానీ, కొత్త కావడంతో మాధవి నటించడానికి తడబడుతోంది.. పైగా అక్కడున్నది అపర దుర్వాసుడు మధుసూదనరావుగారాయే. నేను బెటర్‌గానే చేస్తుండటంతో ఆయన నా గురించి ఆలోచించడం మానేసి మాధవి మీద దృష్టిని కేంద్రీకరించారు. ఆమె టేకులు ఎక్కువ తింటున్నకొద్దీ ఆయనలో ఇరిటేషన్‌ మొదలైంది. ‘మా ప్రాణాలు తియ్యడానికి కొత్తవాళ్లని తెస్తుంటారండీ.. వీళ్లకి ఎంత చెప్పినా అర్థం కాదు.. రాదు’ అని కోపాన్ని ఆపుకోలేక తిట్టడం ప్రారంభించారు. పాపం మాధవి ఆయన ఉగ్రరూపాన్ని చూసి బిత్తరపోయింది. ఆ కంగారులో మరిన్ని టేకులు తింది. అంతే. మధుసూదనరావుగారికి సహనం నశించి స్ర్కిప్ట్‌ ఫైలు నేల మీదికి విసిరి కొట్టి.. ‘ఏయ్‌ గిరిబాబూ.. నా వల్ల కాదు.. ఈ అమ్మాయికి నువ్వే డైలాగ్‌ నేర్పించు.. మీరిద్దరూ మాట్లాడుకొని రెడీ అయ్యాక చెప్పండి. అప్పుడు షాట్‌ తీద్దాం’ అని దూరంగా వెళ్లి కూర్చున్నారు.

మాధవికి మెల్లిగా నచ్చజెప్పాను. ‘ఏమీ భయపడొద్దమ్మా.. ఆయన పెద్ద డైరెక్టర్‌ కదా. అలాగే అంటారు. నువ్వు కాసేపు డైలాగ్‌ ప్రాక్టీసు చెయ్యి.. అదే వస్తుంది.. నువ్వు చెప్పగలవు’ అని చెప్పేసరికి మాధవి కొంత కుదటపడింది. తను ప్రిపేర్‌ అయ్యాక ‘రెడీ సార్‌’ అన్నాను. మధుసూదనరావుగారు మళ్లీ షూటింగ్‌ మొదలుపెట్టారు. మొత్తానికి ఆ రోజు పన్నెండో టేక్‌కు షాట్‌ ఓకే అయింది. వెంటనే ఆయన ఆ స్పాట్‌లో పిల్లిమొగ్గ వేసి ‘అమ్మయ్య... షాట్‌ ఓకే అయింది బాబూ’ అని ఆనందపడ్డారు. ఆ తర్వాత మాధవికి కూడా అలవాటు కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా షూటింగ్‌ సాఫీగానే జరిగింది. 

 

ఇదిలా ఉంటే ఒంగోలులో ‘నవభారత్‌’ అనే థియేటర్‌ను నిర్మాత బాబూరావు కట్టారు. నేను, మాదాల రంగారావు, బాబూరావు స్నేహితులం కదా. ఒకరోజు అతను నా దగ్గరికి వచ్చి ‘మామయ్యా... మన థియేటర్‌ ఓపెనింగ్‌కు శోభన్‌బాబుగారు, మంజులగారు, జయమాలిని, నాగభూషణంగారు, మధుసూదనరావుగారు.. వీళ్లందరినీ పిలుద్దాం. మీరు కొంచెం హెల్ప్‌ చెయ్యాలి’ అని అడిగాడు. నేను సరేనన్నాను.

 

నేను, మాదాల రంగారావు పూనుకుని అందరి ఇళ్లకు వెళ్లి వాళ్లతో మాట్లాడి ఓకే చేశాం. జయమాలినితో డాన్స్‌ ప్రోగ్రామ్‌ ఏర్పాటు చేశాం. మద్రాసు నుంచి వాళ్లందరినీ ఒంగోలుకి తీసుకువచ్చి, అతిధి మర్యాదలు చేసి, తిరిగి క్షేమంగా మద్రాసు పంపేవరకూ మేమిద్దరం బాధ్యత వహించాం. ఏర్పాట్లు చాలా ఘనంగా చేశాడు బాబూరావు. నాగభూషణంగారు, మధుసూదనరావుగారు ఒకే రూమ్‌లో ఉండేవారు. సాయంత్రం ఫంక్షన్‌. మధ్యాహ్నమే అంతా ఒంగోలు చేరుకున్నారు. ఎక్కడా ఎటువంటి లోటు లేకుండా చూసుకునేసరికి మధుసూదనరావుగారికి సన్నిహితుడయ్యాను. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో చాలా సినిమాలు చేశాను.

 

ఆయన, గుమ్మడిగారు, నేను హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయిన తర్వాత ప్రతి రోజూ సాయంత్రం గుమ్మడిగారి ఇంట్లోనో, మధుసూదనరావుగారి ఇంట్లోనే కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకొనేవాళ్లం. మధుసూదనరావుగారు గోంగూర పచ్చడిని బాగా చేయించేవారు. పెద్ద హార్లిక్స్‌ సీసాల్లో మాకు పంపించేవారు. అటువంటి గొప్ప దర్శకుని దగ్గర పనిచేయడం నా అదృష్టం. ఆయన చేత ఒక్క తిట్టు తినకుండా అన్ని సినిమాలు చేయగలిగాను.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...