Apr 23 2021 @ 22:47PM

లాల్‌గారు అలా చెప్పగానే కళ్లలో నీళ్లు తిరిగాయి: గిరిబాబు (పార్ట్ 2)

కోపంతో గొడ్డలిని నేలపైకి విసిరేశా అని ప్రముఖ నటుడు గిరిబాబు.. అలా ఎందుకు జరిగిందో? ఏ సందర్భంలో జరిగిందో మొదటి పార్ట్‌లో తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో.. ఆయన మాటల్లోనే..


ఎస్‌.డి.లాల్‌ గొప్పతనం

సరిగ్గా ఉదయం ఆరు గంటలకు ఎవరో మా గది తలుపులు తట్టారు. నేను మంచి నిద్రలో ఉండటంతో ప్రసాద్‌ వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా... ఎస్‌.డి. లాల్‌గారు! ఆయన్ని చూడగానే ఒక్కసారిగా కంగారుపడి ‘ఒరేయ్‌.. లాల్‌గారు వచ్చారు.. లేరా నాయనా’ అని హడావిడి చేశాడు ప్రసాద్‌. ఆ మాట వినగానే ఉలిక్కిపడి లేచాను. లాల్‌గారు నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టారు. ఆయనకి నమస్కారం చేసి ‘అదేమిటి సార్‌.. ఇంత పొద్దున్నే వచ్చారు?’ అని అడిగాను. ఆయన కుర్చీలో కూర్చుని సూటిగా అసలు విషయానికి వస్తూ ‘ఒరేయ్‌ నాయనా.. నువ్వు నా సొంత బిడ్డవి. శ్యామలరావు అలా టేకుల మీద టేకులు తింటూ రాత్రి ఒంటిగంట సమయంలో నన్ను ఇరిటేట్‌ చేస్తే తట్టుకోలేక... అతన్ని ఏమీ అనలేక నిన్ను తిట్టేశాను. నువ్వు గొడ్డలి కింద పడేసి, సెట్‌లో అందరి ముందు నన్ను ఇన్సల్ట్‌ చేసి వెళ్లిపోయావు. మీ నాన్న మందలిస్తే ఇలాగే చేస్తావా..’’ అని మెల్లిగా అడిగేసరికి నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి.


‘సారీ గురువుగారూ.. తప్పయిపోయింది. నేను ఇలా ఊహించలేదు’ అన్నాను. ‘ఇట్సాల్‌ రైట్‌.. ఇదేమీ నువ్వు మనసులో పెట్టుకోవద్దు. తొందరగా రెడీ అయి.. షూటింగ్‌కు రా. ఇది చెబుదామనే పొద్దున్నే వచ్చాను’ అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు. అంత గొప్ప మనిషి లాల్‌గారు! 

ఆ తర్వాత కొన్ని రోజులు షూటింగ్‌ జరిగింది కానీ ఆర్టిక కారణాల వల్ల ఆయన సినిమాని పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత నేను లాల్‌గారి సలహా మీద ఊరికి వెళ్లిపోవడం, మళ్లీ ‘జగమేమాయ’ చిత్రం కోసం మద్రాసు రావడం, నేను ఆర్టిస్ట్‌ని కావడం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. విలన్‌గా నేను వేషాలు వేస్తున్న తరుణంలో లాల్‌గారు ‘అన్నదమ్ముల అను బంధం’, ‘నేరం నాది కాదు ఆకలిది’ చిత్రాల్లో నాకు మంచి వేషాలు ఇచ్చారు. నేను ఆర్టిస్ట్‌గా బిజీ అయినప్పటికీ తీరిక చేసుకుని ఆయన ఇంటికి అప్పుడప్పుడు వెళ్లేవాడిని. ‘మావాడు’ అని గర్వంగా ఆయన ఇతరులకు పరిచయం చేసేవాడు. అలా నన్ను ప్రారంభంలో ఎంతో ప్రోత్సహించిన లాల్‌గారిని మరువలేను. ఆయన నా ఫొటోలను అట్లూరి పూర్ణచంద్రరావుగారి ఆఫీసుకు పంపించి ఉండకపోతే ‘జగమేమాయ’ చిత్రంలో నాకు అవకాశమే వచ్చి ఉండేది కాదు. నేను చెప్పడానికి ఈ కథంతా ఉండేది కాదు. లాల్‌గారి తర్వాత నేను మరిచిపోలేని మరో ఇద్దరు వ్యక్తులు... అట్లూరి పూర్ణచంద్రరావుగారు, దర్శకుడు ఐ.ఎన్‌. మూర్తిగారు.


‘జగమేమాయ’ సినిమా పూర్తి కాకుండానే నాకు ఎన్నో ఆఫర్లు వస్తే తను ఎంకరేజ్‌ చేయడమే కాకుండా, తన సినిమా రష్‌ మిగిలిన నిర్మాతలకు చూపించి, నటుడిగా నేను బిజీ అవడానికి కారకులైన పూర్ణచంద్రరావుగారి మేలు మరిచిపోలేను. అలాగే మూర్తిగారు ఆ తర్వాత సినిమాలు చేయకపోయినా నా గురించి, మురళీమోహన్‌ గురించి కనిపించిన ప్రతి ఒక్కరితో చాలా గొప్పగా చెప్పేవారు. పూర్ణచంద్రరావుగారు ఆ తర్వాత నిర్మించిన అన్ని సినిమాల్లో నేను ఉన్నాను. చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ మధ్యే పూర్ణచంద్రరావుగారిని కలిశాను. హైదరాబాద్‌ వచ్చిన ఆయన మా ఇంటికి కూడా వచ్చారు. పాత విషయాలన్నీ ముచ్చటించుకున్నాం. ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నాం. ‘జగమేమాయ’ చిత్రం షూటింగ్‌ ఎక్కడ ప్రారంభించామో అదే మెర్కరాలో ఆయన ప్రస్తుతం ఉంటున్నారు. పది ఎకరాల పొలం కొని, అక్కడే ఇల్లు కట్టి ఉంటున్నారు. నన్ను, మురళీమోహన్‌ని అక్కడికి వచ్చి ఓ పది రోజులు ఉండాలని ఆయన కోరారు. సరేనన్నాను.

సి.ఎస్‌.రావు

సి.ఎస్‌.రావుగారి దర్శకత్వంలో ‘అనగనగా ఓ తండ్రి’ చిత్రంలో నటించాను. అప్పటికే ఆయన చాలా పెద్ద డైరెక్టర్‌. ఈ సినిమాలో గుమ్మడి, సావిత్రిగార్లకు ముగ్గురు కొడుకులు. కృష్ణంరాజు, రాజబాబు, నేను. నాది నెగిటివ్‌ రోల్‌. పెళ్లాం ఏది చెబితే అది వింటూ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే పాత్ర. ఆర్టిస్టులకు నటించి చూపించడం సి.ఎస్‌.రావుగారికి అలవాటు. అలాగే నాకూ నటించి చూపించారు. అయితే కొంత ఇబ్బందిని ఎదుర్కొవలసి వచ్చింది. ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌ గమ్మత్తుగా ఉంటాయి. అవి కృతకంగా ఉన్నాయని నాకు మనసులో అనిపించేది. అయినా ఎదురు చెప్పలేని పరిస్థితి. కొత్త కదా. అందుకే ఆయన ఎలా చేసి చూపించారో అలాగే చేశాను. నేను బాగా చేయలేదని, పాత్రకు అన్యాయం చేశాననీ నాకు అనిపించింది. అందుకే ఫస్ట్‌ కాపీ వేస్తే నేను చూడలేదు. ఆ సినిమాని దర్శకుడు గుత్తా రామినీడుగారు చూశారు. ఆ మర్నాడు వాళ్ల ఇంటికి పిలిస్తే వెళ్లాను. ‘ఏమైంది నీకు గిరిబాబు.. ఛైర్మన్‌ చలమయ్యలో అద్భుతంగా చేశావు. ఈ సినిమాలో అంత చండాలంగా చేశావేమిటి.. అవకాశాలు వస్తున్నాయి కదా అని పొగరు పెరిగిందా’ అని చెడామడా తిట్టేశారు. అవన్నీ భరించి మౌనంగా ఉన్నాను కానీ సి.ఎస్‌.రావుగారు అలాగే చెయ్యమన్నారండీ అని చెప్పలేదు.

 

ఆ తర్వాత సి.ఎస్‌.రావుగారి దర్శకత్వంలోనే ‘కచదేవయాని’ అనే సినిమా చేశాను. అందులో దేవేంద్రుడి పాత్ర నాది. సత్యనారాయణగారు శుక్రాచార్యునిగా నటించారు. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఆయన ‘సింహాసనం’లో ఆర్టిస్ట్‌గా నటించారు. అందులో నేను ఒక విలన్‌ని. అంతే మా ఇద్దరి అనుబంధం. అద్భుతమైన ఎన్నో చిత్రాలను రూపొందించి ఎంతో పేరు తెచ్చుకున్న సి.ఎస్‌.రావుగారి చరమదశ అంత ఘోరంగా ఉంటుందని ఎవరూ ఊహించలేరు. బహుశా ఆయన కూడా ఊహించి ఉండరు. అయినవాళ్లు అందరూ ఉండి కూడా ఆయన ఒక అనాధలా కన్ను మూయాల్సి రావడం విషాదకరం.

(ఇంకా ఉంది)

- వినాయకరావు

FilmSerialమరిన్ని...