May 19 2021 @ 21:19PM

నాన్నగారి కాళ్లకి నాగేశ్వరరావుగారు నమస్కరించారు: గిరిబాబు (పార్ట్ 18)

మా నాన్నగారికి రామారావుగారు అన్నా, నాగేశ్వరరావుగారన్నా ఎంతో అభిమానం. ఒకసారి నాగేశ్వరరావుగారి పుట్టినరోజున నాన్నను తీసుకెళ్లాను. మా నాన్న వయసు 104 ఏళ్లు అని చెప్పగానే ‘నన్ను ఆశీర్వదించండి’ అంటూ కాళ్లకు నమస్కరించారాయన. ఆ తర్వాత ఇంకోరోజు ఆయన ఇంటికి మేమిద్దరం వెళితే నాన్నగారిని పక్కనే కూర్చోబెట్టుకుని ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. శాలువా కప్పి సత్కరించి, ఫొటో దిగారు. అంతేకాదు రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మా నాన్నని సత్కరించారు నాగేశ్వరరావుగారు.

 

నేనన్నా, మా కుటుంబమన్నా ఎంతో అభిమానంగా ఉండేవారు నాగేశ్వరరావుగారు. అలాగే గుమ్మడిగారు కూడా. కాలానికి ఎవరైనా తల వంచాల్సిందే. తప్పదు. గుమ్మడిగారు పోయిన తర్వాత నా కుడిభుజం లేనట్లు అనిపిస్తుంటుంది. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన ఇంటి ముందు నుంచి వెళుతుంటే మనసంతా అదోలా అవుతుంది. ఎన్నో సాయంత్రాలు అక్కడ గడిపాం. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఆ తర్వాత కొంతకాలానికి నాగేశ్వరరావుగారిని కోల్పోయాం. అంతకుముందు రామారావుగారు పోయారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రెండు కళ్లులా భాసిల్లిన ఈ మహానుభావులుఇద్దరూ రాలిపోయారు. భరించే బాధలు కావివి. కానీ తప్పదు. ఎందుకంటే ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు. ఏదో ఒక రోజున అందరూ వెళ్లిపోవాల్సిందే.

ఏ పల్లె సాటిరాదు మా పల్లెకు

మనిషి తను ఎంత అభివృద్ధిలోకి వచ్చినా జన్మభూమినీ, జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను మరిచిపోకూడదు. తల్లిదండ్రుల్ని బాధ పెట్టే పిల్లల్నీ, వాళ్లని పట్టించుకోకుండా తిరిగే ప్రభుత్వాల గురించి వింటున్నప్పుడు మనసు బాధతో తరుక్కుపోతుంది. ఇటువంటి పనులు చేసేవాళ్లంటే నాకు అసహ్యం. నాకు మాత్రం పుట్టి పెరిగిన ఊరంటే ఎంతో అభిమానం. మా ఊరు రావినూతల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు ఖాళీ దొరికినప్పుడల్లా అక్కడికి వెళతాను. నా మిత్రులు, బంధువులతో కాలక్షేపం చేస్తుంటాను. అక్కడికి వెళ్లి వస్తే రీఛార్జి అయినట్లుగా ఉంటుంది. నేను ఎప్పుడు వస్తానా అని వాళ్లు కూడా నా కోసం ఎదురు చూస్తుంటారు. అక్కడ ‘డెవలప్‌మెంట్‌ కమిటీ’ని ఏర్పాటు చేసి, అందరం చేతనైన సాయం ఊరికి చేస్తున్నాం. మా గ్రామానికి చెందిన దాదాపు 150 మంది విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. ఊరు అభివృద్ది కోసం ఎటువంటి కార్యక్రమం మొదలుపెట్టినా అందరూ తమ వంతు సహకారాన్ని అందిస్తారు. మా ఊర్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒంగోలులో కూడా లేని స్టేడియం మారుమూల గ్రామమైన మా ఊళ్లో ఉంది. ఇరవై ఏళ్ల నుంచి నిర్విరామంగా అక్కడ క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తున్నాం.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...