May 17 2021 @ 22:10PM

గుమ్మడిగారిని చూడడానికి వెళ్లి.. భయపడి వెనక్కి వచ్చేశాం: గిరిబాబు (పార్ట్ 16)

నా చిన్నతనం నుంచి రామారావుగారిని, నాగేశ్వరరావుగారినీ ఎంత అభిమానించానో అలాగే రంగారావుగారినీ, గుమ్మడిగారిని అంతే అభిమానించేవాడిని. నేను అభిమానించిన నటులతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. ముఖ్యంగా గుమ్మడిగారి గురించి చాలా చెప్పాలి. ఆర్టిస్ట్‌గా ప్రయత్నించే రోజుల్లో ఆయన్ని చూడాలని కోరికగా ఉండేది. ఒకసారి ఇలాగే వేషాల వేటలో ఉన్న నేను గుమ్మడిగారిని చూడాలని మా బ్రదర్‌తో కలిసి ఆయన ఇంటికి వెళ్లాను. హబీబుల్లా రోడ్‌లో ఆయన ఉండేవారు. మేం వెళ్లిన సమయానికి ఆయన వరండాలో కూర్చుని ఏకదీక్షతో హిందూ పేపర్‌ చదువుతున్నారు. ఆయనకి కాస్త దూరంలో మేమిద్దరం నిలబడ్డాం. మధ్యలో చదవడం ఆపి, మా వంక చూస్తారేమోనని ఆశ. కానీ ఆయన మమ్మల్ని గమనించలేదు. కాసేపు అలాగే నిలబడ్డాం. ఆయన మా వంక చూడలేదు, పేపర్‌ చదవడం ఆపలేదు. మా వంక చూస్తే నమస్కారం చేసి, కాసేపు మాట్లాడి వచ్చేద్దామని మా ఆలోచన. అయితే ‘సార్‌’ అని పిలవడానికి కూడా భయపడ్డాను. ఎందుకంటే ఆయన ప్రముఖ నటుడు, మంచి పొజిషన్‌లో ఉన్నారు. అలా పిలవగానే నావంక చూసి కసురుకుంటారేమోనని భయం నాది. అందుకే ఆయన ఏకాగ్రతకి భంగం కలిగించడం ఇష్టం లేక వెనక్కి తిరిగి వచ్చేశాం.


ఆ తర్వాత సినిమాల్లో నటించే అవకాశం నాకు రావడం, ఆర్టిస్ట్‌గా కొంచెం పేరు తెచ్చుకోవడం జరిగిన తర్వాత ‘అనగనగా ఒక తండ్రి’ చిత్రంలో ఆయన కొడుకుగా నటించే అవకాశం నాకు లభించింది. షాట్‌ గ్యాప్‌లో ఆయన్ని పరిచయం చేసుకుని ఆనాడు ఆయన ఇంట్లో కలవాలనుకుని కలవలేకపోయిన విషయాన్ని ఆయనకు చెప్పాను. గుమ్మడిగారు చాలా సున్నిత మనస్కుడు. చాలా మంచి మనిషి. ఈ విషయం నేను చెప్పగానే చాలా ఫీలయిపోయి ‘అయ్యో.. నిజమా.. నన్ను పిలవలేకపోయారా’ అని పదేపదే అన్నారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో మేమిద్దరం కలిసి నటించాం. ‘బంగారు కలలు’ చిత్రం తర్వాత రంగారావుగారితో ‘జమీందారుగారి అమ్మాయి’ చిత్రంలో నటించాను. దురదృష్టవశాత్తు ఆ సినిమా ప్రారంభంలోనే ఆయన కన్నుమూశారు. తర్వాత ఆ పాత్రని గుమ్మడిగారు పోషించారు.

ఇక అప్పటినుంచి గుమ్మడిగారితో నా సాన్నిహిత్యం పెరిగింది. నన్ను బాగా అభిమానించేవారు. పక్కపక్క వీధుల్లో ఉండేవాళ్లం. సాయంత్రమైతే చాలు వాళ్ల ఇంట్లోనో, మా ఇంట్లోనో కలిసేవాళ్లం. వారం రోజులు నేను ఔట్‌డోర్స్‌కి వెళితే వచ్చిన వెంటనే నాకు ఫోన్‌ చేసి ‘గిరిబాబుగారూ .. రండీ’ అనేవారు. నన్ను ‘గారూ’ అనే గౌరవవచనంతో తప్ప ఎప్పుడూ ఏకవచనంతో సంబోధించలేదు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయినా నన్ను తన పెద్దకొడుకుగా భావించేవారు. వాళ్ల ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్‌ జరిగినా నేను ఉండాల్సిందే. ఆ తర్వాత ఇద్దరం హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయ్యాం. మా అనుబంధం మరింత పెరిగింది. అందరితో ఆయన స్నేహంగానే ఉన్నా నేనంటే ప్రత్యేక అభిమానం చూపించేవారు.


ఏ చిన్న సమస్య వచ్చినా, ఎటువంటి సందేహం కలిగినా మొదట నాకే ఆయన ఫోన్‌ చేసేవారు. ఉదాహరణకు చెప్పాలంటే.. రఘుపతి వెంకయ్య అవార్డ్‌ కోసం ఏర్పాటైన కమిటీకి ఓసారి గుమ్మడిగారు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో నాకు ఆయన ఫోన్‌ చేసి ‘గిరిబాబుగారూ రండి.. డిస్కస్‌ చేయాలి’ అని ఫోన్‌ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. నేను వెళ్లాను. ఇద్దరం కూర్చున్న తర్వాత ‘ఇంతవరకూ ఈ అవార్డ్‌ను చాలామందికి ఇచ్చారు. అందులో నేను కూడా ఉన్నాను. ఈసారి బాధ్యత నాకు అప్పగించారు. సీనియారిటీనే కాకుండా హైదరాబాద్‌లో తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేసిన వారిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీ సలహా కూడా కావాలి’ అని అడిగారు. నేను చెప్పాను. దానిని కూడా ఆయన పరిగణనలోకి తీసుకుని అవార్డ్‌కు ఎంపిక చేశారు. నన్ను ‘ఎన్‌సైక్లోపీడియా’గా అభివర్ణిస్తుండేవారు గుమ్మడిగారు. పాత సినిమాల గురించి ఏదన్నా సందేహం కలిగితే ‘గిరిబాబుగారికి ఫోన్‌ చేయండి. ఆయనైతే కరెక్ట్‌గా చెప్పగలడు’ అని చెప్పేవారాయన.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...