May 16 2021 @ 22:46PM

మా అబ్బాయ్ సినీ కెరీర్‌ నాశనం కావడానికి కొన్ని శక్తులే కారణం: గిరిబాబు (పార్ట్ 15)

నా జీవితంలో తొలిసారిగా ఓడిపోయాను. పరిస్థితులతో రాజీపడిపోయాను. ప్రకటించిన విధంగా ‘కొదమసింహం’ చిత్రం విడుదలైంది. అదే రోజున విడుదల కావాల్సిన నా ‘ఇంద్రజిత్‌’ మాత్రం ఆగిపోయింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ‘కొదమసింహం’ రిజల్ట్‌ అంత ఆశాజనకంగా లేదని రెండో రోజే నాకు తెలిసింది. అందులో తన పాత్రకు చిరంజీవి పూర్తి న్యాయం చేసినా, కథాలోపం వల్లో, తీసిన విధానం వల్లో ఆ సినిమా అంతగా ఆడలేదు. ‘కొదమసింహం’ చిత్రానికి నెగెటివ్‌ టాక్‌ రావడం కూడా నా సినిమాకి మైనస్‌ అయింది.


‘అంత పెద్ద హీరో నటించిన సినిమా, అత్యంత భారీ వ్యయంతో తీసిన సినిమా జనం చూడలేదు. అది ఆడలేదు. మరి కొత్త హీరోతో నువ్వు తీసిన సినిమా ఎలా ఆడుతుందని అనుకుంటున్నావు గిరిబాబూ..’ అని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తుండటంతో సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. ఎంతో ఇష్టపడి, కష్టపడి తీసిన సినిమాను ఇంత వ్యతిరేక వాతావరణంలో ఎలా బయటపడేయాలో నాకు అర్థం కాలేదు. కానీ ఆ సినిమాలో హీరోగా నటించింది మా అబ్బాయి కనుక తప్పకుండా విడుదల చేయాల్సిందే. వెనకడుగు వేసే ప్రశ్నే లేదు. అందుకే ఒక చాలెంజ్‌గా తీసుకుని ‘కొదమసింహం’ విడుదలైన నెలన్నర తర్వాత మెల్లిగా మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాను. బయ్యర్లకు కబురు పెట్టాను. బేరసారాలు ప్రారంభించాను. ‘కొదమసింహం’ పెద్దగా ఆడలేదనే అంశాన్ని సాకుగా చూపించి మరీ తగ్గించి అడగటం మొదలుపెట్టారు. నాకు మరో మార్గం లేదు. ఏదో ఒక రేటుకి అమ్మేసి సినిమా విడుదల చేయాల్సిందే. ఆ రోజుల్లో ‘ఇంద్రజిత్‌’ తీయడానికి నాకు రూ. 40 లక్షలు అయింది. కానీ అన్ని ఏరియాలు అమ్మినా నాకు రూ. 20 లక్షలకు మించి రాలేదు. రూ. 20 లక్షల డెఫిసిట్‌తో ‘ఇంద్రజిత్‌’ని విడుదల చేశాను.

రేపు సినిమా రిలీజవుతుందనగా ఈ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. రిజల్ట్‌ ఎలా ఉంటుంది, మా అబ్బాయి భవిష్యత్తు ఏమిటీ... ఇవే ఆలోచనలు. ఎప్పటికో నిద్ర పట్టింది. తెల్లారింది. నా సినిమా విడుదలైంది. మధ్యాహ్నానికల్లా సినిమా బాగుందని టాక్‌ రావడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నాను. గొప్పలు చెప్పడం కాదు కానీ నా సినిమా కొన్న ప్రతి ఒక్క బయ్యరూ లాభపడ్డాడు. 50 రోజులు విజయవంతంగా ఆడింది. అయితే ఈ విజయాన్ని చాలా మంది సహించలేకపోయారు. తట్టుకోలేకపోయారు. ‘ఇంద్రజిత్‌’ సినిమా ఫ్లాప్‌ అయింది’ అని పని కట్టుకుని ప్రచారం చేసి, మా బోసుబాబుకు మరో సినిమా రాకుండా చేశారు. అలా వాడి కెరీర్‌ను దెబ్బతీశారు. కానీ ఆర్టిస్ట్‌గా మా వాడిలో ఎలాంటి లోపం లేదు. అద్భుతంగా చేశాడు. సినిమా కూడా బాగా ఆడింది. కానీ ఇటువంటి విష ప్రచారం వల్ల ఒక అప్‌ కమింగ్‌ హీరో పైకి రాలేకపోయాడు. ఇది ఒకరో, ఇద్దరో చేసిన పని కాదు. కొన్ని శక్తులు కలసి పనిచేసి  తీరని వేదనని నాకు మిగిల్చాయి. ‘ఇంద్రజిత్‌’ తర్వాత నేను చిత్రనిర్మాణానికి పుల్‌స్టాప్‌ పెట్టాను.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...