May 13 2021 @ 20:42PM

ఇంతవరకూ మా ఇంట్లో వాళ్లకి ఆ సినిమా చూపించలేదు: గిరిబాబు (పార్ట్ 12)

దర్శకుడు కోడి రామకృష్ణ ‘దొంగోడొచ్చాడు’ చిత్రంతో గిరిబాబులోని కొత్తకోణాన్ని బయటకు తీశారు. కమెడియన్‌గా ఆయనని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ తర్వాత ‘పెళ్లాం చెబితే వినాలి’ చిత్రంలో తను చేయనన్న పాత్రని కోడి రామకృష్ణ పట్టుబట్టి మరీ చేయించారని పార్ట్ 11లో గిరిబాబు తెలిపారు. ఇప్పుడు విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ‘పోలీస్ లాకప్’ చిత్రంలో తను చేసిన పాత్ర గురించి, ఆ పాత్రకు తనకు ఎటువంటి పేరు వచ్చిందనేది తెలిపారు. అంతేకాదు ఆ సినిమాని ఇంత వరకూ తన ఇంటిలోని వారికి చూపించలేదంట.. ఎందుకో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..


ఆ పాత్ర వెనుక అంత కథ ఉంది

అలా కోడి రామకృష్ణ దర్శకత్వంలో దాదాపు 30 చిత్రాలు చేసి ఉంటాను. అయితే వాటిలో ఒకే ఒక సినిమాని ఏమాత్రం ఇష్టం లేకుండా చేశాను. ఆ సినిమా పేరు ‘పోలీస్‌ లాకప్‌’. విజయశాంతి కథానాయికగా నటించిన ఆ చిత్రాన్ని ఎమ్మెస్‌ రాజు నిర్మించారు. ఇప్పటికీ నాకు ఇష్టం లేని పాత్ర అది. ఇదే చిత్రాన్ని తమిళంలో డబ్‌ చేశారు. అక్కడ కూడా పెద్ద హిట్‌. నేను ఒకసారి బట్టలు కొనడానికి ఓ షాప్‌కి వెళితే, అందులో సేల్స్‌మెన్‌ నన్ను గుర్తుపట్టి ‘సార్‌.. ఆ సినిమాలో నటించింది మీరే కదూ’ అని అడిగాడు. ఔనని ఒప్పుకోవడానికి నాకు సిగ్గేసింది. ఇంతకీ ‘పోలీస్‌ లాకప్‌’ చిత్రంలో నేను పోషించిన పాత్ర ఏమిటో తెలుసా... హిజ్రా.

 

అలాంటి వేషం అని నాకు ముందు చెప్పలేదు. కాల్షీట్లు ఇచ్చారు. దర్శకుడు కోడి రామకృష్ణ కావడంతో కథ గురించి వివరాలు అడగకుండా అంగీకరించాను. వైజాగ్‌లో షూటింగ్‌. మేకప్‌ వేసుకోవడానికి రెడీ అయ్యాను. ‘పాత్రపరంగా మీకు మీసాలు ఉండవు సార్‌.. తీసెయ్యమంటారా’ అని అడిగాడు మేకప్‌మ్యాన్‌. మీసాలు తీయడమెందుకో నాకు అర్థం కాలేదు. అయినా మీసాలు తీయడానికి నేను ఒప్పుకోలేదు. వెంటనే మేకప్‌మ్యాన్‌ లోపలకి వెళ్లి ‘మీసాలు తీయడానికి ఆయన ఒప్పుకోవడం లేదు సార్‌’ అని కోడి రామకృష్ణకు చెప్పినట్లున్నాడు. ‘మీసాలు ఉన్నా పరవాలేదు.. అలాగే మేకప్‌ చేయండి’ అని రామకృష్ణ చెప్పాడో ఏమో మళ్లీ నా దగ్గరకు వచ్చి మీసాల ప్రసక్తి తేలేదు. కానీ ‘కళ్లకు షుర్మా పెట్టమన్నారు సార్‌’ అన్నాడు. ‘షుర్మా ఎందుకయ్యా’ అనడిగాను. ‘ఏమో నాకు తెలీదు సార్‌.. పెట్టమన్నారు’ అని వినయంగా చెప్పాడు మేకప్‌మన్‌.

నాకు ఏదో అనుమానం కలిగి, లేచి కోడి రామకృష్ణ దగ్గరకు వెళ్లాను. ‘మీసాలు తీయాలంటాడు, కళ్లకి షుర్మా పెట్టాలని అంటాడు.. నాకేమీ అర్థం కావడం లేదు. అసలు నా పాత్ర ఏమిటి?’ అని ప్రశ్నించాను. ‘గురువుగారూ.. మీరేమీ అనుకోవద్దు.. ముందే చెప్పలేదని తిట్టొద్దు. ఇది హిజ్రా వేషం. చాలా కీలకమైన పాత్ర. మీరు వేస్తే బాగుంటుందనుకున్నాం’ అని అసలు విషయం మెల్లిగా చెప్పాడు కోడి రామకృష్ణ.

 

అలాంటి వేషం అని చెప్పగానే నాకు నీరసం వచ్చింది. కోడి రామకృష్ణ మీద కోపం కూడా వచ్చింది. అయినా తమాయించుకుని ‘వెరీ సారీ రామకృష్ణా.. హిజ్రా వేషాలు వేసే నటులంటేనే నాకు చిరాకు. అటువంటి పాత్ర నేను వేయాలని తలుచుకుంటేనే కంపరంగా ఉంది. ఆ పాత్ర నేను వేయలేను. నన్ను ఇబ్బంది పెట్టకుండా వేరే ఎవరితోనైనా వేయించుకో’ అని చెప్పేశాను.

 

‘కాదు గిరిబాబుగారూ.. నా మాట వినండి’ అంటూ కోడి రామకృష్ణ, ‘అంకుల్‌.. మీరు ఈ పాత్ర చేస్తే బాగుంటుంది’ అని ఎమ్మెస్‌ రాజు బతిమాలడం మొదలుపెట్టారు. ‘ఈ పాత్ర నేను కాకుండా ఓ కమెడియన్‌ చేస్తే బాగుంటుంది. అలా చేయకుండా నన్ను చేయమని హింస పెడతారేమిటీ’ అని విసుక్కున్నాను. అయినా వాళ్లు వదల్లేదు. మధ్యాహ్నం లంచ్‌ బ్రేక్‌ వరకూ నన్ను బతిమాలుతూనే ఉన్నారు. ఇక నాకు విసుగు వచ్చేసి ‘సరే. అయితే ఒక పని చేద్దాం. ఒక నిగూఢమైన రహస్యాన్ని బట్టబయలు చేసే పాత్ర ఇదని చెబుతున్నారు కదా. అందుకే ఒక పోలీస్‌ ఆఫీసర్‌ ఇలా మారువేషం వేసుకుని ఇదంతా చేశాడని చివర్లో రివిల్‌ చేయండి. బాగుంటుంది. అలా చేస్తానంటేనే ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుంటా’ అన్నా. నా సూచన వాళ్లకు కూడా బాగా నచ్చినట్లుంది. ‘బాగుంది.. అలాగే చేద్దాం’ అన్నారిద్దరూ.

 

అప్పుడు మేకప్‌కి కూర్చున్నాను. మీసాలు తీయలేదు కానీ కళ్లకు షుర్మా పెట్టారు. వింతవింత డ్రస్సులన్నీ వేశారు. పైగా వల్లెవాటు ఒకటి. అలాగే చేతులకు గాజులు తొడిగారు. చేట చెరగడం, చేతులు అలాఇలా ఊపడం.. ఇవన్నీ నాకు ఇష్టంలేని పనులు. అయినా చివర్లో సిఐడీ ఆఫీసర్‌గా రివిల్‌ చేస్తారు కదా అని భరించి అవన్నీ చేశాను. ‘వీడు నిజంగా హిజ్రానే’ అని హీరోకి, హీరోయిన్‌కి, పక్కనున్న వాళ్లకీ అనిపించేలా చేయాలి కనుక ఆ పాత్రలో లీనమై నటించాను. సెట్లో నేను అలా నటిస్తుంటే అంతా ఒకటే నవ్వులు.

 

సినిమా షూటింగ్‌ పూర్తి కావస్తోంది కానీ ఈ హిజ్రా సిఐడీ ఆఫీసర్‌ అని రివిల్‌ చేసే షాట్‌ మాత్రం తీయలేదు. ఎప్పుడు అడిగినా ‘ఇదిగో తీస్తున్నాం.. అదుగో తీస్తున్నాం’ అనేవాడు కోడి రామకృష్ణ. చివరకు ఆ సీన్‌ తీయకుండానే షూటింగ్‌ పూర్తయింది. ‘నన్ను మోసం చేశారు’ అనే బాధ మనసులో ఉన్నా దాన్ని దిగమింగుకుని డబ్బింగ్‌ చెప్పాను. ఫస్ట్‌ కాపీ తయారైంది. రామానాయుడు స్టూడియోలోని ప్రివ్యూ థియేటర్‌లో ప్రివ్యూ వేశారు. సినిమా చూడటానికి మనసు అంగీకరించకపోయినా, ఎంత ఛండాలంగా ఉందో చూడటానికి వెళ్లాను.

 

సినిమా పూర్తయిన తర్వాత బయటకు వస్తుంటే రామానాయుడుగారి మేనల్లుడు కలిశాడు. వెళ్లబోతున్నవాడినల్లా ఆపేసి ‘గిరిబాబుగారూ.. మీకు తినడానికి అన్నం లేదా? ఎందుకండీ ఇంత కక్కుర్తి? ఏమిటంటీ ఈ వేషం? నేను మీ అభిమానిని. సినిమా చూడగానే ‘మిమ్మల్ని పొడిచేసి నన్ను నేను పొడుచుకుందామన్నంత కోపం వచ్చింది. థూ...థూ..థూ’ అన్నాడు. సమాధానం ఏమని చెప్పాలో నాకు అర్థం కాక తల దించుకుని అలాగే ఉండిపోయాను. ఇలా విడుదలకు ముందు చాలా విమర్శలు ఎదుర్కొన్నాను.

 

‘పోలీస్‌ లాకప్‌’ విడుదలైంది. సినిమా పెద్ద హిట్‌. అలాగే నా పాత్రకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. తమిళంలోకి డబ్‌ చేస్తే అక్కడ కూడా సక్సెస్‌ అయింది. అయినా సరే టీవీల్లో ఆ సినిమా ఎప్పుడు వచ్చినా నేను చూడను. మా ఇంట్లో వాళ్లకి కూడా ఇంతవరకూ ఆ సినిమా చూపించలేదు. ఆ పాత్ర వేసిన తర్వాత నన్ను నేను ఎలా సమర్థించుకున్నానంటే.. అన్ని రకాల పాత్రలూ పోషించాను. నవరసాలు పోషించగల సత్తా ఉందని నిరూపించడానికి ఇష్టం లేకపోయినా హిజ్రా వేషం వేసి, దానికి కూడా పేరు తెచ్చుకున్నా. ‘మీరు చేసిన అన్ని పాత్రలూ బాగున్నాయి. కానీ ‘పోలీస్‌ లాకప్‌’ సినిమాలో పాత్ర మాత్రం మాకు నచ్చలేదు సార్‌’ అని ఇప్పటికీ ఎంతో మంది అంటుంటారు.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...