May 12 2021 @ 21:46PM

తన సినిమా హిట్ క్రెడిట్ నాకిచ్చిన గొప్ప మనసు కృష్ణగారిది: గిరిబాబు (పార్ట్ 11)

విలన్‌ వేషాలు వేస్తున్న తరుణంలో ‘దొంగోడొచ్చాడు’ చిత్రంలో నాతో కామెడీ చేయించారు దర్శకుడు కోడి రామకృష్ణ. కృష్ణగారు ఆ చిత్రంలో హీరోగా నటించారు. కామెడీ వేషం అనగానే మొదట తెల్లబోయి ‘ఏమిటిది రామకృష్ణా.. నేను కామెడీ చేస్తే జనం చూస్తారంటావా?’ అని అడిగాను.  ‘ఎందుకు చూడరండీ.. ఇంతకుముందు మీరు ‘జ్యోతి’ సినిమాలో చేశారు కదా. అలాగే ఈ సినిమాలో కామెడీ కేరెక్టర్‌ మీరు చేస్తేనే బాగుంటుంది’ అన్నారు కోడి రామకృష్ణ. సందేహిస్తూనే ఆ చిత్రంలో నటించాను. సినిమా పెద్ద హిట్‌. ఆ చిత్రం విడుదల కాగానే కృష్ణగారు నాకు ఫోన్‌ చేశారు.. ‘గిరిబాబూ.. సినిమా బాగా పోతోంది. 14 వారాలు ఆడుతుంది. అందులో పది వారాల క్రెడిట్‌ నీదే. అంత బ్రహ్మండంగా పేలిందయ్యా నీ పాత్ర’ అన్నారు. ఆయన భోళామనిషి కదా. సినిమా హిట్‌ అయితే ఆ క్రెడిట్‌ తనదేనని భావించే హీరోలున్న రోజులవి. అటువంటి పరిస్థితుల్లో కృష్ణగారు అలా అనడం ఆయన మంచి మనసుకి, గొప్పతనానికి నిదర్శనం.


ఆమెకి పెద్ద కొడుకుగా చేయనన్నాను

జయభేరి పతాకంపై మురళీమోహన్‌ నిర్మించిన ‘పెళ్లాం చెబితే వినాలి’ చిత్రంలో కూడా నా చేత కామెడీ వేషం వేయించాడు కోడి రామకృష్ణ. మురళీమోహన్‌ ఏ సినిమా తీయాలనుకున్నా నన్ను సంప్రదించడం, కథాచర్చల్లో నేను పాల్గొనడం సర్వసాధారణంగా జరిగే విషయమే. నా ప్రమేయం లేకుండా ఏ సినిమా తీయలేదు మురళీమోహన్‌.

‘పెళ్లాం చెబితే వినాలి’ సినిమా ఒక తమిళ రీమేక్‌. ఆ సినిమా బాగా ఆడుతోందని విని హక్కులు కొందామనుకున్నాడు మురళీమోహన్‌. మద్రాసులో కోడంబాకంలో రామ్‌ థియేటర్‌లో తమిళ సినిమా ఆడుతుంటే చూడటానికి వెళ్లాం నేను, మురళీమోహన్‌, అతని తమ్ముడు కిశోర్‌, కోడి రామకృష్ణ. ఇంటర్వెల్‌లో ‘గురువుగారూ.. సినిమా ఎలా ఉంది?’ అనడిగాడు కోడి రామకృష్ణ. ‘ఇంటర్వెల్‌ తర్వాత సినిమా చూడకపోయినా పరవాలేదయ్యా.. సినిమాలో సరుకు ఏమిటో అర్థమైపోయింది. ఏమాత్రం ఆలోచించకుండా రైట్స్‌ కొనండి. తెలుగులో కూడా బాగా ఆడుతుంది’ అని చెప్పాను.

 

సినిమా కథ పూర్తయ్యాక అందరం మా ఇంట్లో సమావేశమయ్యాం. ఏ పాత్రకి ఏ నటుణ్ణి తీసుకోవాలనే విషయం మీద చర్చ మొదలైంది. ఇంటి పెద్ద పాత్రకు కాస్ట్యూమ్స్‌ కృష్ణనీ, అతని భార్య పాత్రకి వై.విజయని తీసుకోవాలని నిర్ణయించాం. పెద్ద కొడుకుగా నేను, రెండో కొడుకుగా శ్రీకాంత్‌, మూడో కొడుకుగా శివాజీరాజా, నాలుగో కొడుకుగా హరీశ్‌ను తీసుకుందామని కోడి రామకృష్ణ ప్రతిపాదించాడు. అయితే నేను వెంటనే అభ్యంతరం చెప్పాను. ‘బయటి చిత్రాల్లో వై.విజయ పక్కన భర్తగా నటిస్తున్నాను. ఇందులో ఆమెకి నేను పెద్ద కొడుకుగా నటించడం ఏమిటీ... బాగుండదు. నా మాట విని ఆ పాత్రకి సుధాకర్‌ని పెట్టండి’ అన్నాను. కామెడీ పాత్ర కనుక సుధాకర్‌ని తీసుకుంటే అద్భుతంగా కామెడీ చేస్తాడు. ఇదీ నా ఫీలింగ్‌. సుధాకర్‌ ఏజ్‌ కూడా కరెక్ట్‌గా ఉంటుంది. సుధాకర్‌, శ్రీకాంత్‌, శివాజీరాజా, హరీశ్‌.. కొడుకులుగా నటిస్తే చూడటానికి బాగుంటుందన్నది నా ఉద్దేశం. అయితే కోడి రామకృష్ణ ఒప్పుకోలేదు.

 

‘గురువుగారూ.. ‘దొంగోడొచ్చాడు’ సినిమాకి కూడా మీరు ఇలాగే అన్నారు. అందులో మీ పాత్ర ఎంత పాపులర్‌ అయిందో మీకు తెలుసు. ఇందులో పెద్ద కొడుకు పాత్రని బాగా డెవలప్‌ చేస్తున్నాను. నా దృష్టిలో మీరే ఆ కేరెక్టర్‌కి కరెక్ట్‌. నా మాట కాదనకండీ’ అని బతిమాలాడు. నేను అంగీకరించకుండా ‘వద్దు రామకృష్ణా.. అవతల సినిమాల్లో మేమిద్దరం జంటగా నటిస్తూ, ఇందులో తల్లీకొడుకులుగా నటిస్తే చూడటానికి బాగుండదు. అయినా మంచి ఆర్టిస్టులు ఉండగా కాంప్రమైజ్‌ కావాల్సిన అవసరం మనకేం వచ్చింది’ అని గట్టిగా వాదించాను. ఎంత చెప్పినా కోడి రామకృష్ణ వినిపించుకోలేదు. అంతవరకూ పక్కనే కూర్చుని మౌనంగా మా సంభాషణ ఆలకిస్తున్న మురళీమోహన్‌ కల్పించుకుంటూ ‘డైరెక్టర్‌గా ఆయన చెబుతున్నాడు.. ఆ పాత్రకు నువ్వు బాగుంటావని. నువ్వు కాదంటావేమిటి? ఎట్టిపరిస్థితుల్లో నువ్వు ఆ పాత్ర చేయాల్సిందే’ అన్నాడు. చివరకు ఓకే అనక తప్పింది కాదు నాకు.

 

‘పెళ్లాం చెబితే వినాలి’ షూటింగ్‌ పూర్తయింది. విడుదలయింది. నా పాత్రకు బాగా పేరు వచ్చింది. నా పక్కన కోవై సరళ నటించింది. ఆ పాత్రని కోడి రామకృష్ణ బాగా తీర్చిదిద్దాడు. నేను కొన్ని మెరుగులు అద్దాను. దాంతో ఆ పాత్ర హిట్‌. నేను చేసిన కామెడీ పాత్రల్లో ‘దొంగోడొచ్చాడు’, ‘చిత్రం భళారే విచిత్రం’ (ఈ చిత్రానికి దర్శకుడు పి.ఎన్‌.రామచంద్రరావు) ‘పెళ్లాం చెబితే వినాలి’ తమకు బాగా నచ్చాయని ప్రేక్షకులు ఇప్పటికీ చెబుతుంటారు. అయితే ఓకే అనుకున్నాను.

(ఇంకా ఉంది)

- వినాయకరావు

FilmSerialమరిన్ని...