May 22 2021 @ 21:34PM

అలాంటి వాళ్లంటే నాకు చాలా కోపం.. కృతజ్ఞతలు: గిరిబాబు (లాస్ట్ పార్ట్)

నా వృత్తి నటన కనుక నటన గురించి, సినీరంగం గురించి కొంత చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. సినిమాల్లో ప్రవేశించాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అద్దంలో ముఖాన్ని చూసుకున్నప్పుడు మనకి మనం అందంగానే కనిపిస్తాం. నాటకాల్లోనో, సినిమాల్లోనో అవకాశం ఇస్తే అద్భుతంగా నటిస్తామని కూడా అనుకుంటుంటాం. అయితే మన గురించి జనం చెప్పాలి కానీ సొంత డబ్బా కొట్టుకోకూడదు. ‘నువ్వు పనికి వస్తావు, పైకి వస్తావు’ అనే వాళ్ల జడ్జిమెంట్‌ తీసుకుని ప్రయత్నాలు ప్రారంభిస్తే మంచిది. అవేమీ లేకుండా మనల్ని మనం గొప్పగా ఊహించుకుని ముందడుగు వేస్తే ఇక్కడ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా చేసి జీవితాలు పాడు చేసుకున్న వాళ్లని కొన్ని వందలమందిని నేను చూశాను. ఇదంతా చెప్పి నేను ఎవరినీ నిరుత్సాహపరచడం లేదు. కరెక్ట్‌ జడ్జిమెంట్‌ తీసుకుని ప్రయత్నిస్తే అపజయం ఉండదు. అయితే దానికి కృషి, పట్టుదల, అదృష్టం తోడవ్వాలి.

 

వారికి చేయాల్సి ఉంది

నేను అభివృద్ధిలోకి రావడానికీ, సక్సెస్‌ కావడానికీ తోడ్పడిన స్నేహితులు, బంధువులు ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్లలో కొంతమందికి నేను చేయాల్సింది చేయలేకపోయాను. అది చేసి తీరాలి. చేస్తాను కూడా.

మనిషి ఇంకెన్ని దారుణాలు చేసేవాడో!

ఏడుపు, నవ్వు అనేవి మనిషికి మాత్రమే ఇచ్చాడు ఆ భగవంతుడు. మనిషి ఎప్పుడూ ఏడుస్తూనే పుడతాడు. మరి నవ్వుతూ పుట్టొచ్చు కదా. అలా నవ్వుతూ పుట్టిన మనిషి గురించి మనం ఎరుగం. మరి పుట్టినప్పటి నుంచీ ఇలా ఎందుకు ఏడుస్తున్నాడు అని ఆలోచిస్తే.. ఇక నుంచి ప్రతిక్షణం చావుకి దగ్గరవుతున్నాననే బాధతో అలా ఏడుస్తున్నాడేమోనని నాకు అనిపిస్తుంటుంది. మరో విషయమేమిటంటే జంతువులకు కానీ, పక్షులకు కానీ, క్రిమికీటకాదులకు కానీ చావు గురించి తెలీదు. ఏదో ఒక రోజున చస్తామని వాటికి తెలీదు. అందుకే అవి బతికినంతకాలం హ్యాపీగా బతికేస్తాయి. మనిషికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏదో ఒకరోజు తను చనిపోతాననే విషయం తెలుస్తుంది. మరణం తప్పదని తెలిసినా మనిషి దుర్మార్గాలు, అవినీతి పనులు, నేరాలు చేయడం మానడు. అలా కాకుండా బతికినంతకాలం మంచి వాడిలాగే బతకాలనీ, చేతనైతే ఇతరులకు ఉపకారం చేయాలనీ, చేతకాకపోతే ఊరికే కూర్చోవాలనీ అందరికీ నేను చెప్పే సలహా. మృత్యువు గురించి తెలిసి కూడా ఇన్ని పనులు చేస్తున్న మనిషి జంతువుల్లా చావు గురించి ముందే తెలియకపోతే ఇంకెన్ని ఘోరాలు చేసేవాడో అనిపిస్తుంటుంది.

 

నాకు నచ్చని విషయాలు

నీటిని వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. అలాగే పచ్చని చెట్లని నరికే వాళ్లంటే నాకు చాలా కోపం. ఎప్పుడైనా చెట్టుకొమ్మ విరవాల్సి వస్తే చాలా బాధ పడతాను. ఎండిపోయిన చెట్లు కొట్టడం వేరు. పచ్చగా ఉండే చెట్లను కళ్లెదుట నరుకుతుంటే నేను సహించలేను. అలాగే ఎటువంటి పనీపాటా లేకుండా గంటల తరబడి సెల్‌ఫోన్‌ మాట్లాడేవాళ్లంటే నాకు కోపం. అది కాస్త తగ్గించుకోమని చెబుతుంటాను. అలాగే మరో విషయం. బతకడానికి తినాలి. అంతేకానీ తినడం కోసం బతకకూడదు. చాలా మందిని చూస్తుంటాను. వాళ్లు తినడం కోసమే బతుకుతుంటారనిపిస్తుంటుంది. దొంగతనం చేయడం కంటే పెద్ద నేరం ఏమిటంటే నలుగురు తినాల్సిన అన్నాన్ని ఒక్కడే తినడం. పరుషంగా మాట్లాడటం, అయినదానికి కాని దానికి పక్కవాడిని నిందించడం మంచి లక్షణం కాదు. ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. నోటిని అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని చంపేసుకోవాలి. అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది.

 

చివరిగా.. 

సినిమాల్లో నటించాలన్నా, మరే ఇతర రంగంలో రాణించాలన్నా దీక్ష, పట్టుదల ముఖ్యం. ఒక లక్ష్యం కూడా ఉండాలి. దాన్ని సాధించడం కోసం నిరంతరం కృషి చేయాలి తప్ప ఆషామాషీగా తీసుకుని ప్రయత్నిస్తే అది సాధ్యం కాదు. ఈ విషయాన్ని నా ఆత్మకథ ద్వారా కొంతమంది మిత్రులు తెలుసుకున్నామని చెబుతుంటే ఆనందంగా ఉంది. కృతజ్ఞతలు.

(అయిపోయింది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...