May 7 2021 @ 19:07PM

చిరంజీవి, మోహన్‌బాబులతో ‘మెరుపుదాడి’.. అలా ఆగిపోయింది: గిరిబాబు (పార్ట్ 7)

ఓ విభిన్నమైన ఇతివృత్తంతో ‘మెరుపుదాడి’ సినిమా తీయాలని నా ప్రయత్నం. అందుకే రకరకాల ఆంగ్ల చిత్రాల కేసెట్స్‌ ముందేసుకుని కూర్చుని అదేపనిగా వాటిని చూడటం ప్రారంభించాను. కొన్ని సినిమాలు చూశాక స్టోరీ లైన్‌ మైండ్‌లో ఫ్రేమ్‌ అయింది. ‘ఫైవ్‌ మెన్‌ ఆర్మీ, ‘గ్రేట్‌ ఎస్కేప్‌’ తదితర చిత్రాల స్పూర్తితో నలుగురైదుగురు వ్యక్తుల్ని ముఖ్య పాత్రలుగా పెట్టుకుని కథ నడిపించాలని నిర్ణయించాను. ఒక్కో ఆంగ్ల చిత్రంలో స్పెషల్‌గా అనిపించిన పాత్రల్ని ఒక్కొక్కటీ తీసుకుని వాళ్లందరినీ ఒకచోట చేర్చాను. వీళ్లందరూ ఏదో ఒక యుద్ధ విద్యలో నిపుణులై ఉంటారు. ఆపాత్రల చుట్టూ కథ అల్లుకొన్నాను. వీళ్లందరూ కలిసి ఒక నిధి కోసం బయలుదేరతారు, మధ్యలో ఎన్ని కష్టాలు పడ్డారు, చివరకు అనుకున్నది ఎలా సాధించారనే అంశాలతో కథ తయారైంది.


రామచంద్రరావుకి మళ్లీ అవకాశం

‘సంధ్యారాగం’ సినిమాతో రామచంద్రరావుని దర్శకునిగా పరిచయం చేశాను. ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభించేముందు ప్రెస్‌మీట్‌ పెట్టి ‘యాంటీ సెంటిమెంట్‌తో తయారవుతున్న సినిమా ఇది. చాలా రిస్క్‌ చేసి తీస్తున్నాం. అయితే హిట్‌ అవుతుంది, లేకపోతే ప్లాప్‌ అవుతుంది. ఈ రెండే తప్ప యావరేజ్‌, బిలో ఎవరేజ్‌, ఎబౌవ్‌ యావరేజ్‌ అనే టాక్‌ ఈ సినిమాకి రాదు’ అని చెప్పగానే ఒక పాత్రికేయ మిత్రుడు ఒక ప్రశ్న వేశాడు.

 

‘గిరిబాబుగారూ.. మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ ఈ సినిమాతో ఒక కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ఆడితేనే అతనికి భవిష్యత్‌ ఉంటుంది. అనవసరంగా అతని కెరీర్‌తో రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?’ అని. నేను వెంటనే తడుముకోకుండా ‘ఈ సినిమా హిట్‌ అయితే ఇక నేను చెప్పనక్కర్లేదు అతనికి అవకాశాలు వస్తాయి. నా బాధ్యత తీరుతుంది. ఒకవేళ ప్లాప్‌ అయితే నేనే మళ్లీ ఇతనికి అవకాశం ఇస్తా. రామచంద్రరావు దర్శకత్వంలోనే కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ తీస్తా’ అని చెప్పాను. పాత్రికేయులంతా అభినందించారు. ముందు ఊహించినట్లుగానే ‘సంధ్యారాగం’ ప్లాప్‌ అయింది. ఈ తరహా చిత్రాలను మలయాళ చిత్రపరిశ్రమలో ఆదరిస్తారు కానీ తెలుగులో తీస్తే ఇబ్బందే. అయితే మేధావులు, క్రిటిక్స్‌, రచయితలు మంచి ప్రయత్నమని అభినందించారు. డబ్బులుపోయాయి. అభినందనలు మాత్రం మిగిలాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ‘సంధ్యారాగం’ సినిమా ప్లాప్‌ కావడంతో రామచంద్రరావుని దర్శకునిగా నిలబెట్టాల్సిన బాధ్యత నా మీద ఉందికనుక ‘మెరుపుదాడి’ సినిమాకి అతన్నే డైరెక్టర్‌గా పెట్టాలని నిర్ణయించుకున్నాను.

కథ రెడీ, దర్శకుడు కూడా రెడీ. అయితే సినిమా తీయడానికి మాత్రం నా దగ్గర డబ్బు లేదు. ‘సంధ్యారాగం’ సినిమాకి పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది. దాంతో సినిమా తీసే సాహసం చేయలేక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. సరిగ్గా ఆ సమయంలోనే కె. కేశవరావుగారి నుంచి ఓ మంచి ప్రపోజల్‌ వచ్చింది. హీరో కృష్ణ, దాసరి నారాయణరావుగారు కలసి ప్రారంభించిన ‘సాయికృష్ణ ఫిల్మ్స్‌’ పంపిణీ సంస్థ ఆ సమయంలోనే ఆయన స్వాధీనంలోకి వచ్చింది. పంపిణీరంగంతో పాటు సినిమాలు కూడా తీయాలనే కోరికతో నిర్మాణరంగంలోకి కూడా అడుగుపెట్టారు. బాలకృష్ణ హీరోగా కె.విశ్వనాథ్‌గారి దర్శకత్వంలో ‘జననీ జన్మభూమి’ చిత్రం మొదలుపెట్టారు. నిర్మాతగా మారిన రూపశిల్పి జయకృష్ణ తీసే చిత్రానికి కూడా కమిట్‌ అయ్యాడు. 

 

కేశవరావుగారితో నాకు బాగా పరిచయం. వాళ్ల ఆఫీసుకు వెళుతుండేవాణ్ణి. అక్కడ నేను, జయకృష్ణ, వడ్డే రమేశ్‌, పోతరాజు, కేశవరావు సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం అలవాటు. ఒక రోజు అలా కబుర్లు చెప్పుకుంటుంటే ‘ఏమయ్యా గిరిబాబూ.. మన బేనరు మీద నువ్వు కూడా ఒక సినిమా చేయవచ్చు కదా’ అని అడిగారు కేశవరావు. నా మనసులో అదే ఆలోచన ఉన్నా అడగటానికి మొహమాట పడ్డాను. ఆ విషయం ఆయనే కదిపేసరికి ధైర్యం వచ్చి ‘కథ రెడీగా ఉంది.. తీయడానికి నా దగ్గర డబ్బులే లేవు’ అన్నాను.


‘మరయితే ఇంకేం.. బాగుంటే మన బేనరు మీద చేద్దాం’ అన్నాడాయన.

‘నిధి వేటకు సంబంధించిన సినిమా ఇది. ఈ జానర్‌లో ఇంతవరకూ వచ్చిన సినిమాలకు భిన్నంగా తీయాలన్నది నా తపన. ‘యాక్షన్‌ ఓరియంటెడ్‌. నా మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి పెట్టుబడి పెట్టండి’ అని అడిగేశాను.

కేశవరావు ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా ‘అలాగే చేద్దాం. డబ్బు మొత్తం నేనే పెడతా. నువ్వు సినిమా తీసి ఇవ్వాలి. వచ్చిన లాభాల్లో ఇద్దరికీ చెరి సగం. నష్టం వస్తే మాత్రం నేనే భరిస్తా. నీకు ఏ మాత్రం సంబంధం లేదు. ఐదేళ్ల తర్వాత నెగిటివ్‌ రైట్స్‌ నావే. డీల్‌ నీకు ఓకే కదా..’ అని ‘హీరోలుగా ఎవరిని అనుకుంటున్నావు?’ అని అడిగారు.

 

చాలా గొప్ప డీల్‌ అది. కేశవరావుగారి నుంచి అటువంటి ప్రపోజల్‌ వస్తుందని నేను ఊహించలేదు. నా మీద నమ్మకంతో అంత రిస్క్‌ చేయడానికి ఆయన సిద్ధమయ్యాడు. అందుకే ఉత్సాహం. ‘‘ఈ మధ్య ‘బిల్లా-రంగా’ చిత్రంలో చిరంజీవి, మోహన్‌బాబు నటించారు కదా. వాళ్లిద్దరు నాకు మిత్రులే. అందులో మోహన్‌బాబు మరీ సన్నిహితుడు. వాళ్లతో ఈ సినిమా చేద్దామనుకుంటున్నాను’’ అన్నాను.

 

‘అలాగే వాళ్లిద్దరూ నాకూ కావాల్సినవాళ్లే. వాళ్లతోనే చేద్దాం. నువ్వు వెళ్లి కథ వినిపించు’ అని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు కేశవరావు. మొదట చిరంజీవి దగ్గరకి వెళ్లి కథ చెప్పాను. ‘ఓకే అన్నా.. బ్రహ్మాండంగా ఉంది కథ, తప్పకుండా చేద్దాం’ అన్నాడు చిరంజీవి. ఆ తర్వాత నా స్నేహితుడు మోహన్‌బాబు దగ్గరకి వెళ్లాను. కథంతా విన్నాడు. ‘చాలా బాగుందిరా. కాకపోతే నువ్వేమీ అనుకోనంటే ఒక చిన్న సూచన చెబుతాను’ అన్నాడు. ‘ఏమీ అనుకోను చెప్పరా’ అన్నాను.

 

‘చిరంజీవిది, నాది ఈక్వెల్‌ కేరెక్టర్స్‌. కథ నాకు బాగా నచ్చింది. కాకపోతే అతనికి హీరోయిన్‌ పెట్టి, డ్యూయెట్‌ పెట్టావు. నాకు కూడా ఒక హీరోయిన్‌ని పెట్టి, పాట తీస్తే బ్యాలెన్స్‌ అవుతుంది’ అన్నాడు.

 

‘ఒరేయ్‌.. నీ సలహా బాగానే ఉంది కానీ చిరంజీవికి ఫలానా పాత్ర నువ్వు చేస్తున్నావు అని చెప్పేశాను. అలా చెప్పకపోయి ఉంటే ఆ పాత్ర నీకు ఇచ్చి, నీతో అనుకుంటున్న కేరెక్టర్‌ అతనితో వేయించేవాడిని. రెండూ ఈక్వెల్‌ కేరెక్టర్సే. అయితే రెండో పాత్రకి హీరోయిన్‌ని పెట్టడానికి కానీ, పాటకి కానీ స్కోప్‌లేదు. టైట్‌ స్ర్కీన్‌ప్లే తయారు చేశాను. ఓ ఐదొందలు అడుగులు లెంగ్త్‌ పెరిగితే, సినిమాకి అది స్పీడ్‌ బ్రేకర్‌గా తయారవుతుంది’ అని వివరించాను. కానీ మోహన్‌బాబు ఒప్పుకోలేదు. ‘లేదురా.. ఒక పాట పెట్టినంత మాత్రాన ఏమీకాదు. ఆలోచించు’ అన్నాడు. ‘లేదురా.. కుదరదు. నేను పెట్టలేను’ అని చెప్పేశాను. మేమిద్దరం మంచి స్నేహితులం. అయినా కానీ కాంప్రమైజ్‌ కాలేకపోయాను. నా సమాధానం విని మోహన్‌బాబు హర్ట్‌ అయ్యాడు. ‘నువ్వు పాట పెట్టకపోతే నేను ఈ సినిమా చేయను.. పోరా’ అన్నాడు.

ఇవి కూడా చదవండిImage Caption

కోపంతో గొడ్డలిని నేలపైకి విసిరేశా: గిరిబాబు (పార్ట్ 1)లాల్‌గారు అలా చెప్పగానే కళ్లలో నీళ్లు తిరిగాయి: గిరిబాబు (పార్ట్ 2)సహనం నశించి స్ర్కిప్ట్‌ ఫైలు నేల మీదికి విసిరి కొట్టారు: గిరిబాబు (పార్ట్ 3)ఆ డైరెక్టర్ ఎన్టీఆర్‌ని కూడా కొట్టమన్నారు: గిరిబాబు (పార్ట్ 4)ఆ గిరిబాబు పెళ్లి చేసుకుంటే.. నేననుకుని ఏడుపులు, పెడబొబ్బలు: గిరిబాబు (పార్ట్‌ 5)సూర్యకాంతమ్మని ఆటపట్టించా.. ఆమె ఏం చేసిందంటే: గిరిబాబు (పార్ట్‌ 6)

పాట కోసం పేచీ

ఆ తర్వాత నేను కేశవరావుని కలిసి జరిగినదంతా ఆయనకు వివరించాను. ‘మోహన్‌బాబు అలా కోరడంలో తప్పేమీ లేదు. హీరోయిన్‌నీ, ఓ పాటనీ పెట్టవచ్చు. కానీ సినిమా రన్నింగ్‌కు అడ్డు తగులుతుంటుంది. అది నాకు ఇష్టం లేదు’ అన్నాను. ఆ సమయంలో అక్కడే ఉన్న మరో నిర్మాత వడ్డే రమేశ్‌ కల్పించుకుని ‘ఏమయ్యా ఒక పాట పెట్టినంత మాత్రాన కొంపలు అంటుకు పోవు కదా. పాట పెట్టు’ అన్నాడు.

.

‘నిజమే కానీ కథకి ఆ పాట అడ్డు తగులుతుంటుంది. మరో హీరోయిన్‌ని పెడితే వాళ్లిద్దరు ఎప్పుడు కలిశారు, ఎక్కడ కలిశారు, పాట ఎలా పాడుకున్నారు ఇవన్నీ చూపించాలి. లెంగ్త్‌ సమస్య ఇది. అందుకే కుదరదన్నానయ్యా’ అన్నాను.

 

జయకృష్ణ కూడా అక్కడే ఉన్నారు. ‘గిరిబాబుగారూ మరోసారి ఆలోచించండి. ఇద్దరూ ఉంటే బిజినెస్‌పరంగా కూడా బాగుంటుంది. మన పని సులువవుతుంది’ అని నాకు నచ్చజెప్పడానికి ఆయన ప్రయత్నించారు. ఎవరు ఎంత చెప్పినా మరో హీరోయిన్‌ని పెట్టడానికి నాకు మనసు ఒప్పలేదు.


నేనన్న మాటలో నిజం ఉండటంతో కేశవరావు ఏమీ మాట్లాడలేకపోయారు. అయితే చిరంజీవి, మోహన్‌బాబుని పెడితే బాగుంటుందని ఆయన మనసులో ఉంది. అందుకే ఎటూ చెప్పలేక ‘ఒకవేళ వాళ్లు కాకపోతే ఏం చేద్దాం’ అని అడిగాడాయన. ఆ సమయంలో నాకు ఎవరి పేర్లూ గుర్తుకు రాలేదు. నేను మౌనం వహించడంతో ‘సరే.. ఈ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం’ అన్నారు కేశవరావు.

 

నెల రోజులు గడిచాయి. మళ్లీ ఒక రోజు కేశవరావుగారి ఆఫీసులో అందరూ కూర్చున్నప్పుడు ‘ఏం గిరిబాబూ.. ఆ సినిమా సంగతి ఏమైంది?’ అని ఆయన అడిగాడు. నేనేం మాట్లాడలేదు. ‘ఏమయ్యా.. ఇంకా ఎంత కాలం ఆలోచిస్తావు.. చిరంజీవి, మోహన్‌బాబుతో సినిమా తియ్యవయ్యా బాబూ’ అన్నాడు వడ్డే రమేశ్‌. మా ఇద్దరి మధ్య చనువు ఉండటంతో ‘నీకేం తెలీదు.. నువ్వు ఊరుకో’ అని కసిరేశాను. ‘రమేశ్‌ చెప్పింది నిజమే. ఏదో ఒకటి తేల్చకుండా ఇలా ఎంతకాలం ఆగుదాం.. పోనీ ఏం చేద్దామో నువ్వే చెప్పు’ అని అడిగారు కేశవరావు.


‘‘సార్‌ నా మీద నమ్మకం ఉంది కదా. అందుకే హీరోల విషయం నాకు వదిలేయండి. ఈ మధ్య తమ్మారెడ్డి భరద్వాజ ‘ఇద్దరు కిలాడీలు’ అనే సినిమా తీశాడు. అందులో సుమన్‌, భానుచందర్‌ అనే ఇద్దరు కొత్త కుర్రాళ్లు హీరోలుగా నటించారు. సినిమా ఆడలేదు కానీ వాళ్లిద్దరూ బాగా చేశారు. మీరు ఒప్పుకుంటే వాళ్లిద్దరినీ పెట్టి మెరుపు దాడి సినిమా తీస్తానండి’’ అన్నాను. కేశవరావు తెల్లబోయి ‘అదెలాగయ్యా.. ముక్కు మొహం తెలియని వాళ్లతో ఇంత పెద్ద సినిమా తీస్తామా.. అదీగాక ఆ సినిమా ప్లాప్‌ అయింది. వాళ్లతో సినిమా తీస్తే మనకు బిజినెస్‌ కావాలి కదా’ అనడిగారు.


‘ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే వేరే గత్యంతరం లేదు సార్‌. మనం పెద్ద హీరోల జోలికి వెళ్లలేం. కొత్తవాళ్లతో అయితేనే బాగుంటుందని నా నమ్మకం’ అన్నాను.

నా పక్కనే కూర్చున్న వడ్డే రమేశ్‌ కల్పించుకుని ‘కొత్త వాళ్లతో సినిమా తీయడానికి తయారవుతున్నావు కానీ పాపులర్‌ హీరో మోహన్‌బాబుని పెట్టుకుని పాట తీయడానికి మాత్రం వెనుకాడుతున్నావు’ అని వ్యంగ్యంగా అన్నాడు.

‘ఒరేయ్‌ నాయనా.. నీకు దణ్ణంపెడతాను. ఆ విషయం వదిలిపెట్టరా బాబూ’ అని చేతులు జోడించాను.

కాసేపు మా మధ్య మౌనం రాజ్యమేలింది. ఎవరూ మాట్లాడటం లేదు. కేశవరావు ఆలోచనలో పడ్డారు. నేను ఆయన వంకే ఆత్రుతగా చూస్తున్నాను.

చివరికి ఆయన ఒక నిర్ణయానికి వచ్చి ‘సరే గిరిబాబు నీ ఇష్టప్రకారమే కానివ్వు. సుమన్‌, భానుచందర్‌తోనే సినిమా తీద్దాం. ఇంతకీ దర్శకుడెవరు?’ అని అడిగారు కేశవరావు. ఆయన మనసులో కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ ఉన్నాడు. ఇటువంటి చిత్రానికి ఆయనైతేనే న్యాయం జరుగుతుందని ఆయన నమ్మకం. ఆ విషయమే నాతో చెప్పారు.

‘సార్‌.. ఈ సినిమాకి హీరోలుగా చిరంజీవి, మోహన్‌బాబు కాకుండా కొత్త వాళ్లని తీసుకుందా మంటే మీరు సరేనన్నారు. ఎందుకూ.. నా మీద నమ్మకంతోనే కదా. ఆ నమ్మకం అలాగే ఉంచండి. దర్శకుడి విషయం కూడా నాకు వదిలేయండి. మన సినిమాకి రామచంద్రరావు దర్శకత్వం వహిస్తాడు’ అని చెప్పాను.


ఆ పేరు చెప్పగానే కేశవరావు ఒక్కసారిగా ఉలిక్కిపడి ‘రామచంద్రరావా.. అతను తీసిన ‘సంధ్యారాగం’ చిత్రం పెద్ద ప్లాప్‌ అయింది కదా. అతన్నిపెట్టి ఈ సినిమా తీస్తావా? అసలే కొత్తవాళ్లతో తీస్తున్నాం. పెద్ద డైరెక్టర్‌ని పెట్టుకోకుండా ప్లాప్‌ సినిమా డైరెక్టర్‌ని పెడతానంటావేమిటయ్యా బాబూ.. దాసుగారిని పెడితే సేలబులిటీ ఉంటుంది. నా పని ఈజీ అవుతుంది’ అన్నారు. ‘మెరుపుదాడి’ సినిమాకి దాస్‌ని పెడదామని కేశవరావు, కాదు రామచంద్రరావుని పెడదామని నేను. ఎవరి కాన్ఫిడెన్స్‌ వారిది. ఇద్దరం పట్టు మీద ఉండటంతో ఏ నిర్ణయం తీసుకోకుండానే మా సమావేశం ముగిసింది.


ఈ విషయం రామచంద్రరావుకి తెలిసి నా దగ్గరకి పరిగెత్తుకుని వచ్చాడు. ‘సార్‌. సంధ్యారాగం ప్లాప్‌ అయింది. మళ్లీ మనం ఓ హిట్‌ సినిమా తీసిన తర్వాత నా దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్‌ చేయవచ్చు. వాళ్లు చెప్పినట్లు ఈ సినిమాని దాసుగారి దర్శకత్వంలో తీయడానికి ఒప్పుకోండి. మంచి అవకాశం మిస్‌ చేయకండి’ అని బతిమాలాడు. కానీ నేను అంగీకరించలేదు. ‘దేవతలారా.. దీవించండి’ మొదలు పెట్టేముందు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నానో ఇప్పుడూ అదే పరిస్థితి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అప్పుడూ, ఇప్పుడూ దర్శకుడిగా కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ పేరే సీన్‌లోకి రావడం. పెద్ద డైరెక్టర్‌ని పెడితే నేను రాసుకున్న స్ర్కిప్ట్‌కి న్యాయం జరగకపోవచ్చని నా బాధ. అందుకే రామచంద్రరావుకి గట్టిగా చెప్పాను.. ‘ఈ సినిమాకి నువ్వే దర్శకుడివి. ఏది ఎలా జరిగినా నా నిర్ణయంలో మార్పు ఉండదు’ అని.


మరో నెల రోజులు గడిచిపోయాయి. మళ్లీ కేశవరావు నుంచి పిలుపు వచ్చింది.

నేను వాళ్ల ఆఫీసుకు వెళ్లగానే ‘ఏం నిర్ణయించు కున్నావయ్యా’ అని ఆయన అడిగాడు. ‘సార్‌.. నా మీద నమ్మకం ఉంచండి. రామచంద్రరావుని దర్శకునిగా పెడదాం. సినిమాని బాగా తీసే బాధ్యత నాది. దగ్గరుండి అన్నీ నేనే చూసుకుంటా’ అన్నాను. ఇక చేసేదేమీ లేక ‘సరేనయ్యా.. నీ ఇష్టం. సినిమా మాత్రం హిట్‌ కావాలి’ అంటూ అయిష్టంగానే అంగీకరించారు కేశవరావు. అప్పుడు సుమన్‌, భానుచందర్‌ని ఆఫీసుకు పిలిపించాను. కథ చెప్పాను. ఇద్దరూ ఓకే అన్నారు. తొలిసినిమా ఆడకపోయినా వెంటనే ఇటువంటి మంచి అవకాశం వస్తుందని వాళ్లు ఊహించి ఉండరు.

 

ఆ తర్వాత చిరంజీవి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాలేమీ చెప్పకుండా కొన్నికారణాల వల్ల ఈ కాంబినేషన్‌ కుదరడం లేదని చెప్పాను. ‘పరవాలేదు అన్నయ్యా.. ఇంకో సినిమాకి కలసి పనిచేద్దాం’ అని అన్నాడు చిరంజీవి. తర్వాత మోహన్‌బాబు దగ్గరకు వెళ్లి చెప్పాను. ‘ఒరేయ్‌ నువ్వునాతో సినిమా తీయకపోయినా నేను బాధపడను. ఎందుకంటే నువ్వు నా మిత్రుడివి. శ్రేయోభిలాషివి. అందుకే నువ్వు తీసే సినిమా హిట్‌ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నాడు.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...