May 3 2021 @ 18:15PM

సూర్యకాంతమ్మని ఆటపట్టించా.. ఆమె ఏం చేసిందంటే: గిరిబాబు (పార్ట్‌ 6)

‘‘చందన నిర్మాణ సమయంలోనే గిరిబాబు, జయంతి మనసులు కలిసి, పెళ్లి చేసుకున్నారు. ఆ సినిమాతోనే హీరోగా రంగనాథ్‌ పరిచయమయ్యారు. ఆ గిరిబాబు, జయంతి పెళ్లి చేసుకోవడం బాగానే ఉంది. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది’ అన్నట్లు వారి పెళ్లితో నాకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఆ గిరిబాబు ఎవరో చాలా మందికి తెలియక పోవడం వల్ల నేనే జయంతిని రెండో వివాహం చేసుకున్నాననే ప్రచారం మొదలైంది..’’ అని తెలుపుతూ.. ఈ సమస్యకు ఎలా శుభం కార్డ్ పలికారో పార్ట్‌ 5లో ప్రముఖ నటుడు గిరిబాబు తెలిపారు. ఆ తర్వాత కూడా జయంతి పెళ్లి విషయంతో తను ఇబ్బందులు పడ్డాననీ, ముఖ్యంగా సూర్యకాంతమ్మ కూడా తనని అలా అడిగేసరికి.. ఆమెను ఆటపట్టించానని గిరిబాబు తెలిపారు. ఆ వివరాలేంటో తెలుసుకుందామా..


టూరిస్టుల సందేహం

మద్రాసులోని మహాలింగపురంలో మేం ఉండేవాళ్లం. ఆంధ్రా నుంచి టూరిస్టులు వచ్చి మొదట రామారావుగారిని, కృష్ణగారిని చూసి చివరకు మహాలింగపురం వచ్చేవాళ్లు. శారదగారు, మేం పక్కపక్కనే ఉండేవాళ్లం. ఆవిడని చూశాక మా ఇంటికి వచ్చేవారు. అలాగే ఒక రోజు కొంతమంది టూరిస్టులు మా ఇంటికి వచ్చారు. వాళ్లు కాసేపు నాతో మాట్లాడిన తర్వాత ‘అమ్మగారిని పిలవండయ్యా.. ఆవిడను కూడా చూసి వెళ్లిపోతాం’ అన్నారు. మా ఆవిడ గురించి అడుగుతున్నారనుకుని ‘అమ్మగారు.. లోపల పనిలో ఉందయ్యా. రోజూ ఇంటి పనులు బోలెడు ఉంటాయి కదా. తను ఒక్కర్తే చేసుకుంటుంది. ఇప్పుడు బయటికి రావడం కష్టం’ అన్నాను యథాలాపంగా. ‘ఆవిడ ఇంటి పనులు కూడా చేస్తారా.. మీకు నౌకర్లు లేరా.. అయినా ఆవిడ ఆర్టిస్ట్‌ కదా ఆమెతో కూడా పనులు చేయిస్తారా’ అని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు ఓ వ్యక్తి. వాళ్లు జయంతి గురించి అడుగుతున్నారని నాకు అప్పుడు అర్థమై ‘అయ్యా.. ఆ గిరిబాబు వేరు, నేను వేరు. ఆయన భార్య జయంతి. నా భార్య పేరు శ్రీదేవి. ఆవిడే లోపల ఉంది’ అని వివరించి చెప్పాను. అయినా ఎవరూ నమ్మరే.

 

‘మాతో అబద్ధాలు ఎందుకు చెబుతారు సార్‌. మీరు జయంతిగారిని పెళ్ళి చేసుకున్న సంగతి మాకు తెలుసు. ఆవిడను చూసి మాట్లాడికానీ మేం ఇక్కడి నుంచి కదలం’ అని మొండిగా అక్కడే కూర్చున్నారు. ఏం చెయ్యాలో నాకు తోచలేదు. పోనీ లోపలి నుంచి మా ఆవిడను పిలిచి వాళ్లకు పరిచయం చేద్దామా అంటే ఆవిడకు సిగ్గు, బిడియం. నోరు విప్పి మాట్లాడలేదు. అయినా తప్పదనుకుని ఆవిడను పిలిచి ‘ఈవిడే మా ఆవిడ’ అని పరిచయం చేశాను. అయినా జనం నమ్మలేదు. జయంతి రెండో భార్య కనుక ఆమెని లోపల దాచి, మొదటి భార్యను తీసుకువచ్చి తమకు చూపిస్తున్నానని వాళ్ల అనుమానం. ఆ అనుమానం తీర్చి, వాళ్లకి నచ్చజెప్పి పంపించేసరికి తల ప్రాణం తోకకి వచ్చేది. సరే, తర్వాత కొంతకాలానికి అందరికీ ఈ విషయం తెలిసిందనుకోండి. కానీ అప్పటివరకూ నాకు ఆ పాట్లు తప్పలేదు.

సూర్యకాంతమ్మ సలహా

ఇదిలా ఉంటే విజయనిర్మలగారు దర్శకత్వం వహిస్తున్న ‘శంఖుతీర్థం’ చిత్రంలో నేను ఒక వేషం వేశాను. ఒక రోజు ఆ చిత్రం షూటింగ్‌కు వెళ్లాను. సూర్యకాంతమ్మ ఆ రోజు షూటింగ్‌లో ఉన్నారు. షాట్‌ గ్యాప్‌లో నేను, ఆవిడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ‘ఒరేయ్‌ గిరిబాబూ.. నువ్వు చాలా మంచివాడివిరా.. ఆ పేకేటి శివరామ్‌ను పెట్టుకుని జయంతి ఇంతకాలం శిక్ష అనుభవించిందిరా నాయనా.. దాని జీవితాన్ని వాడు నాశనం చేశాడు. అది మంచిదే కానీ అమాయకురాలురా నాయనా. ఇన్నాళ్లకి అసలు విషయం గ్రహించి, అతని దగ్గర నుంచి బయటపడింది. ఇప్పుడు నీ చేతుల్లోకి వచ్చింది. జాగ్రత్తగా చూసుకో నాయనా.’ అని జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టింది సూర్యకాంతమ్మ. ఈవిడ కూడా ఆ గిరిబాబు అంటే నేనే అనుకుని మాట్లాడుతోందని మనసులోనే నవ్వుకున్నాను. అసలు విషయం చెప్పకుండా ‘దాందేముందమ్మా. జరిగిపోయిన దాని గురించి ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు? ఆవిడ నాకూ నచ్చింది. సినిమాల్లో రాకముందు నుంచి ఆమెని లైక్‌ చేస్తున్నాను. ఇన్నాళ్లకి మా ఇద్దరికీ కలిసింది. కలసి బతకాలని నిర్ణయించుకున్నాం. ఆమెని జాగ్రత్తగా చూసుకుంటాలేవే’ అన్నాను అతి వినయంగా. 

 

నేను అబద్దమాడుతున్నాననే విషయాన్ని గ్రహించకుండా ‘దాన్ని జాగ్రత్తగా చూసుకో నాయనా. అమాయకురాలురా’ అని మళ్లీ చెప్పింది సూర్యకాంతమ్మ. నేను నా నటనని కంటిన్యూ చేస్తూ ‘అలాగేలేవే.. ఆమెని జాగ్రత్తగా చూసుకుంటాను కదా. ఆ విషయం ఇక వదిలెయ్‌’ అన్నాను. ఇంతలో షాట్‌ పూర్తి కావడంతో విజయనిర్మల, జయప్రద అక్కడకి వచ్చి మాతో జాయిన్‌ అయ్యారు. ‘ఏమిటీ మీరిద్దరూ అంత ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు విజయ నిర్మల. ‘అదేనమ్మా.. మన పిచ్చిది కమలకుమారి.. అదేనే జయంతి.. లేదూ ఇన్నాళ్లకి ఆ పేకేటిగాడిని వదిలిపెట్టి మన గిరిబాబు దగ్గరకి వచ్చింది. మంచిదిరా అది.. జాగ్రత్తగా చూసుకోమని చెబుతున్నాను’ అని వివరించింది సూర్యకాంతమ్మ. నా వంక ఒకసారి చూసి ‘మరి ఈ పెద్దమనిషి ఏమన్నాడు?’ అనడిగారు విజయనిర్మల. ‘అలాగే, బాగా చూసుకుంటాననీ, పువ్వుల్లో పెట్టి పూజిస్తాననీ చెబుతున్నాడమ్మా’ అంది సూర్యకాంతమ్మ. వెంటనే విజయనిర్మల, జయప్రద పకాలుమని నవ్వేశారు. వాళ్లు ఎందుకు నవ్వుతున్నారో అర్థంగాక ‘ఎందుకే అలా నవ్వుతున్నారు?’ అని ప్రశ్నించింది సూర్యకాంతమ్మ. ‘మరి నీ అమాయకత్వానికి నవ్వకుండా ఏం చెయ్యమంటావే.. జయంతి పెళ్లి చేసుకున్నది ఈ గిరిబాబుని కాదే.. అతను వేరే గిరిబాబు. రాజమండ్రి ఆయన. నిర్మాత, దర్శకుడు’ అని చెప్పారు విజయనిర్మల. ‘మరి వీడేమిటీ.. జయంతిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని నాతో చెప్పాడు?’ నమ్మశక్యంగాక ఆడిగింది సూర్యకాంతమ్మ. ‘నిన్ను ఏడిపించడానికి అలా చెప్పి ఉంటాడు లేవే’ అంది జయప్రద. అంతే. సూర్యకాంతమ్మ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి ‘ఓరి బడుద్ధాయ్‌.. నాకే అబద్ధాలు చెబుతావా’ అంటూ ఓ బెత్తం పుచ్చుకుని కొట్టడానికి నా వెంటపడింది. ఆమెకి అందకుండా నేను పరుగుతీశాను. సెట్టంతా పరిగెడుతున్న మా ఇద్దరిని చూసి మిగిలిన అందరూ ఒకటే నవ్వులు.

(ఇంకా ఉంది) 

-వినాయకరావు


FilmSerialమరిన్ని...