ఈ ఫ్యాషన్‌ దుస్తులు ప్రత్యేకం!

ABN , First Publish Date - 2021-05-03T06:30:09+05:30 IST

యువతరం అంటేనే కొత్తగా ఆలోచించడం. నైజీరియాలో బృందంగా ఏర్పడిన కొంతమంది యువత ప్రపంచానికి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు...

ఈ ఫ్యాషన్‌ దుస్తులు ప్రత్యేకం!

యువతరం అంటేనే కొత్తగా ఆలోచించడం. నైజీరియాలో బృందంగా ఏర్పడిన కొంతమంది యువత ప్రపంచానికి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఈ మధ్య ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారుచేసిన దుస్తులతో ‘ధరిత్రీ దినోత్సవం’ సందర్భంగా వయ్యారాలు పోయిన వారి పర్యావరణహిత ప్రయాణమిది.


‘‘పర్యావరణ సంరక్షణ దిశగా మా చిరు ప్రయత్నాన్ని మేము ఇప్పుడే మొదలెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరువాత ఏదైనా చేద్దామంటే అప్పటికే చాలా ఆలస్యం అవుతుంది’’ అంటారు పదిహేనేళ్ల పర్యావరణ ఉద్యమకారిణి ఇసోహె ఒజిగ్బో. తనలాగే ఆలోచించే కొంత మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది ఒజిగ్బో. నైజీరియాలోని పెద్ద పట్టణమైన లాగో్‌సలో ప్లాస్టిక్‌ బాటిళ్లు, ఆహారం నిలువ చేసే డబ్బాలు, సంచులు నీటి ప్రవాహానికి అడ్డుగా మారడం వీరు గమనించారు. ఆ ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించడమే కాదు, ఒకసారి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్‌ సంచుల వల్ల వచ్చే సమస్యల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనుకున్నారు. 


మార్పు కోసం ప్రయత్నం

ఆ వ్యర్థాలను తొలగించే పనిలో దిగారు. చేతులకు తొడుగులు, ముఖానికి మాస్క్‌ వేసుకొని ఆ ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటకు తీసి డిస్‌పోజబుల్‌ సంచీలో వేసారు. అక్కడితో తమ బాధ్యత తీరిపోయిందని అనుకోలేదు. ఇలా సేకరించిన వ్యర్థాలతో రకరకాల ఫ్యాషన్‌ దుస్తులు రూపొందించారు. అంతేకాదు ఆ దుస్తులు ధరించి ప్రతి ఏడాది జరిగే ట్ర్యాషన్‌ షోలలో (చెత్త నుంచి తయారు చేసిన ఫ్యాషన్‌ వస్త్రాలను ప్రదర్శించే షో) మెరిశారు. తమ వినూత్నమైన ఆలోచనతో వ్యర్థాల నిర్వహణకు కొత్త అర్థం చెప్పడమే కాదు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటుతున్నారు. గ్రీన్‌ఫింగర్స్‌ వైల్డ్‌లైఫ్‌ ఇనిషియేటివ్‌ అనే స్వచ్ఛంద సంస్థ సహాకారంతో ఈ మధ్యే లాగో్‌సలోని ఒక పెద్ద షాపింగ్‌ మాల్‌లోనూ ఈ దుస్తులు ధరించి అందరిలో పర్యావరణహిత జీవనశైలిని పాటించాలనే ఆలోచనను రేకెత్తించారు. ‘‘మేము చిన్నవాళ్లమే కానీ ప్రపంచంలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం’’ అంటున్న ఒజిగ్బోకి స్ఫూర్తి ఎవరో తెలుసా స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌. మార్పు కోసం మొదలైన వీరి స్వచ్ఛత ప్రయాణానికి ఇప్పుడిప్పుడే నైజీరియాలో ఆదరణ పెరుగుతోంది.


Updated Date - 2021-05-03T06:30:09+05:30 IST