వరవరరావుకు బెయిల్‌

ABN , First Publish Date - 2021-02-23T07:43:54+05:30 IST

రెండున్నరేళ్ల తర్వాత విరసం నేత వరవరరావుకు బాంబే హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయన ఆరోగ్యం, వయసు దృష్ట్యా ఆరు నెలల పాటు బెయిలిచ్చింది...

వరవరరావుకు బెయిల్‌

  • ఆర్నెల్లపాటు షరతులతో మంజూరు
  • ఆరోగ్యం, వయసు ఓ కారణం: బెంచ్‌
  • ముంబై విడిచి వెళ్లరాదని ఆదేశం

ముంబై, ఫిబ్రవరి 22: రెండున్నరేళ్ల తర్వాత విరసం నేత వరవరరావుకు బాంబే హైకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయన ఆరోగ్యం, వయసు దృష్ట్యా ఆరు నెలల పాటు బెయిలిచ్చింది. అయితే.. గడ్చిరోలిలోని ఓ కోర్టు కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయన.. అక్కడ కూడా బెయిల్‌ లభిస్తేనే ముంబైలోని తలోజా జైలు నుంచి బయటపడగలుగుతారు. బీమా కోరెగాం- ఎల్గార్‌ పరిషత్‌ కేసులో వరవరరావు ఓ నిందితుడన్నది పోలీసుల ఆరోపణ. మావోయిస్టులతో సంబంధాలున్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్రపన్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు. జైల్లో ఉన్నపుడు కొవిడ్‌ బారిన పడడం, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన విడుదలకు గట్టి ప్రయత్నాలు జరిగాయి. ఆయన ప్రాథమిక హక్కుల్ని కూడా హరించారంటూ  ఆయన భార్య పెండ్యాల హేమలత వేసిన పిటిషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. బెయిల్‌పై విడుదలను 3 వారాల పాటు నిలిపేయాలన్న ఎన్‌ఐఏ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. బెయిల్‌ ఇస్తూ.. పలు షరతులు విధించింది. అందులో ప్రధానమైనవి.. వరవరరావు ముంబైలోనే ఉండాలి. హైదరాబాద్‌కు వెళ్లకూడదు. పిలిచినపుడు దర్యాప్తుకు హాజరుకావాలి. ప్రతీ 15 రోజులకోసారి వాట్సాప్‌ వీడియో కాల్‌ ద్వారా నవీ ముంబై ఠాణా పోలీసుల ఎదుట హాజరుకావాలి. ఆయన తన సహనిందితులెవరితోనూ మాట్లాడరాదు. ఈ కేసు విషయమై ఎలాంటి బహిరంగ ప్రకటన చేయకూడదు.



ప్రజాస్వామ్య విజయం: నారాయణ

విరసం నేత వరవరరావుకు బెయిల్‌ మంజూరు కావడం ప్రజాస్వామ్య విజయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. వరవరరావు లాంటి మేధావులను అకారణంగా అరెస్టు చేసి సుదీర్ఘకాలం జైలులో బంధించడం దారుణమని చెప్పారు. ఆలస్యమైనా వరవరరావుకు బెయిలు మంజూరు కావడం హర్షణీయమని, ప్రజలకు ఉన్న వాక్‌ స్వాతంత్ర్యాన్ని హరించే చర్యలను మానుకోవాలని ప్రభుత్వాలకు ఆయన సూచించారు. భవిష్యత్తులో మేధావుల పట్ల చర్యలను తీసుకోవడం మానుకోవాలన్నారు.



ముంబైలో అద్దెలు భరించలేం

వరవరరావు కుటుంబం

వరవరరావుకు బెయిల్‌ ఇవ్వడం సంతోషమే అయినా.. హైకోర్టు పెట్టిన షరతులపై ఆయన కుటుంబం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘తీర్పును స్వాగతిస్తున్నాం. అయితే షరతులను పాటించడం పెద్ద ఇబ్బందే. ఎందుకంటే ముంబైలోనే ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇక్కడ ఎక్కడుండాలి? మాకు బంధువులెవరూ ముంబైలో లేరు.  ఈ కేసు విషయం తెలిసిన వారు మాకు ఇల్లు అద్దెకు ఇస్తారా..? అద్దెలు ఎలా భరించగలం? ఆయన ఆరోగ్యం బాగులేకున్నా నిరంతరం ఆసుపత్రిలోనూ ఉంచడం కష్టం.. నిజానికి సాక్ష్యాలను బట్టి చూస్తే కేసు కొట్టేయాలి. కానీ బెయిల్‌ను షరతులతో ఇచ్చారు...’’ అని వరవరరావు సమీప బంధువు, రచయిత ఎన్‌ వేణుగోపాల్‌ మీడియాతో అన్నారు. రూ. 50వేల పూచీకత్తును కోర్టు ఆదేశించిందని, అది సమర్పించి బెయిల్‌పై బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని వరవరరావు భార్య హేమలత చెప్పారు. 

Updated Date - 2021-02-23T07:43:54+05:30 IST