YSRCP MLA గారూ.. పెదవి విప్పండి.. ఏంటిది..!

ABN , First Publish Date - 2021-12-06T06:22:39+05:30 IST

ఆ నియోజకవర్గానికి అధికార పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి ఆయన.

YSRCP MLA గారూ.. పెదవి విప్పండి.. ఏంటిది..!

  • వాళ్లు పీఏలా? వసూల్‌ రాజాలా?
  • అక్రమాలకు పాల్పడుతున్నా మందలించరా?
  • కీచకుల్లా వ్యవహరిస్తున్నా సమర్ధిస్తారా?
  • కబ్జాకోరులను వెంటబెట్టుకుని ఏమి సాధిస్తారు?
  • ఓ ఎమ్మెల్యేకు సాధారణ కార్యకర్త లేఖాస్త్రం
  • వారి అక్రమాలను ప్రశ్నిస్తూ సుదీర్ఘ లేఖ
  • నియోజకవర్గంలో కలకలం 


జిల్లాలో ఓ నియోజకవర్గానికి అధికార పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి ఆయన. తన నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు మండలానికి ఒకరు చొప్పున తన సొంత మనుషులను పీఏ కమ్‌ మండల ఇన్‌చార్జ్‌గా నియమించారు. వాళ్లు ఎన్ని అక్రమాలు చేసినా.. అవినీతికి పాల్పడినా ఏనాడూ మందలించలేదు. అది ఆయన బలహీనత. ఈ తీరును సహించలేక పార్టీని నమ్ముకున్న నాయకులంతా దూరమవుతున్నా పెదవి విప్పలేదు.. ఇది ఆయన చేస్తున్న పెద్ద తప్పు. నియోజకవర్గంలోని ఏకైక మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లోనూ ఆయన అనుచరగణం ఆగడాలు తీవ్ర ప్రభావమే చూపాయి. ధనం.. దౌర్జన్యం ఆపార్టీని ఒడ్డున పడేయలేకపోయాయి. అది ఆయన గుర్తించేందుకు సిద్ధపడని వైఫల్యం. ఆ వైఫల్యమే ఇప్పుడు కొంపముంచుతోంది. నియోజకవర్గంలో పార్టీని బీటలువార్చుతోంది. ఈ అన్ని లోపాలపై వేదనతో తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ సాధారణ కార్యకర్త ఆ ప్రజాప్రతినిధికి రాసిన లేఖ ఇప్పుడు నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆరు పేజీల ఈ సుదీర్ఘ లేఖ నియోజకవర్గ అధికార పార్టీ నాయకుల్లో చర్చనీయాంశంగా మారింది.                                      - ఆంధ్రజ్యోతి, విజయవాడ


ఆ లేఖలో ఏముందంటే..!

- నియోజకవర్గ కేంద్రంగా పనిచేసే పీఏ కమ్‌ మండల ఇన్‌చార్జ్‌ పార్టీలో ఉన్న కొందరు నాయకుల మధ్య గొడవలు సృష్టించి, వారు గొడవల్లో ఉండగా, తాను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, లక్షల రూపాయలు జేబులో వేసుకుంటున్నారు. ప్రతి పనికీ ఒక రేటు మాట్లాడుకొని, అందుకు పోలీస్‌ అధికారుల సహకారం తీసుకుని పనులు చక్కబెట్టేస్తున్నారు. 


- వ్యభిచార గృహాల నిర్వహణకు ఓ రేటు.. అక్రమ మద్యం తరలింపునకు ఒక రేటు.. పేదల బియ్యం అక్రమ రవాణాకు ఒక రేటు.. ఇలా ఏ అక్రమ వ్యాపారాన్ని నిర్వహించాలన్నా ఈ పీఏకి కొంత ముట్టజెప్పాల్సిందే.


- ఖాళీగా కనిపించే స్థలాలను కబ్జా చేయడం, సెటిల్‌మెంట్స్‌కు పిలవడం, స్థలాల ఓనర్లకు కబ్జాదారుల మధ్య గొడవలు సృష్టించి, వాటిని పరిష్కరించడం పేరుతో ఇద్దరీని ఎంతోకొంత దండుకోవడం.. ఈ పీఏకు వెన్నతో పెట్టిన విద్య. ఇలా ప్రతి పనికీఒక ధరను నిర్ణయించి, నెలకు రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు దండుకుంటున్నారని ఆ లేఖలో ఆరోపించారు. 


- ‘పార్టీ కోసంకష్టపడిన మైలవరం మండలం చంద్రాల గ్రామానికి చెందిన ఓబీసీ నాయకురాలి కుమార్తెను పీఏగా చెప్పుకుంటున్న వ్యక్తి మోసం చేశాడంటూ స్వయాన ఆమె తల్లి మీ దృష్టిలో పెట్టినా మీరు పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటి?’ అని ఆ లేఖలో ప్రజాప్రతినిధిని ప్రశ్నించారు. 


- ‘తెలంగాణ మద్యం లారీని బోర్డర్‌ దాటించి రూ.2 లక్షలు లాగేసి, ఆ మొత్తాన్ని ఓ ఉన్నతాధికారి, మీ పీఏ పంచుకున్న మాట.. వీరికి మీ బామ్మర్ది వత్తాసు పలుకుతున్న మాట వాస్తవం కాదా?’ అని లేఖలో నిలదీశారు. 


నియోజకవర్గ కేంద్రంతోపాటు చుట్టుపక్కల మండలాల్లో రోజుకోచోట పేకాట నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధి, నియోజకవర్గ కేంద్రానికి చెందిన ప్రస్తుత ప్రజాప్రతినిధి కనుసన్నల్లో పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. శిబిరాల నిర్వహణ ద్వారా లక్షలు వసూళ్లు చేస్తున్నారు. ఈ విషయం మీకు తెలియదనుకోవాలా?’ అని లేఖలో పేర్కొన్నారు. 


 ‘నియోజకవర్గంలోని ఏకైక మున్సిపాలిటీలో ఉన్న ఇద్దరు పీఏల తీరు మరీ దారుణం. ఓ పీఏ తన కామకలాపాల కోసం పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతాడు. ప్రభుత్వ పథకాల కోసం వచ్చే అమాయక అతివల్ని లొంగదీసుకొని తన కోర్కేలు తీర్చుకుంటాడు. ఇటీవల ఒక మహిళతో అడ్డంగా ఆమె భర్తకు దొరికిపోయి, లక్షలు చెల్లించి గుట్టుచప్పుడు కాకుండా సెటిల్‌ చేసుకున్నారన్న విషయం మీకు తెలియదా?’ అని లేఖలో ప్రశ్నించారు. తాను మోజుపడిన మహిళతో పార్టీలోని ఓ వ్యక్తి మాట్లాడినందుకు అతనిపై కక్ష కట్టి, కౌన్సిలర్‌ టికెట్‌ రాకుండా చేశాడని సీటు రాని వ్యక్తి వాపోతున్నారు.


‘మరో పీఏ వలంటీర్లతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలను పలువురు మీ దృష్టికి తీసుకొచ్చినా మీరు చేసింది ఏమీ లేదు. తనతోపాటు మందు తాగే వ్యక్తికి కొండపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నంలో సుమారు నలుగురు కౌన్సిలర్లు ఓటమి పాలయ్యారనే ఆరోపణలున్నాయి.’  

Updated Date - 2021-12-06T06:22:39+05:30 IST