నటుడు వెంగళరావుకు అనారోగ్యం

ABN , First Publish Date - 2022-06-30T05:35:15+05:30 IST

సినిమాలో ఆయన కనిపిస్తే నవ్వుల వర్షం. ఆయన చేసే ఫైట్‌లోనూ నవ్వులు పూయిస్తారు.

నటుడు వెంగళరావుకు అనారోగ్యం

కంకిపాడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిక 

 పట్టించుకోని సినీ పరిశ్రమ, ప్రభుత్వం

  ఆసుపత్రి ఖర్చులకు సైతం డబ్బులు లేక ఇబ్బందులు 

కంకిపాడు, జూన్‌ 29 : సినిమాలో ఆయన కనిపిస్తే నవ్వుల వర్షం. ఆయన చేసే ఫైట్‌లోనూ నవ్వులు పూయిస్తారు. ఆయనే ప్రముఖ కమేడియన్‌ వేముల వెంగళరావు (అసలు పేరు వెంకటప్పయ్య). ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతూ రంగుల లోకాన్ని ఆహ్లాదిస్తున్నారనుకుంటాం. సినీ ప్రముఖుల్లో తినడానికి కూడా అన్నం లేక నానా ఇబ్బందులు పడుతున్న వారు ఇంకా ఉన్నారు. వినటానికి విడ్డూరంగా ఉన్నా అది నిజం. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామానికి  చెందిన వేముల వెంకటప్పయ్య (వెంగలరావు) 40 ఏళ్ల క్రితం సినిమా మీద ఉన్న మక్కువతో చెన్నై వెళ్లి పోయాడు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆయన చిన్నచిన్న సినిమాలు చేసుకుంటూ కమేడియన్‌గా, ఫైటర్‌గా సినీ రంగంలో వెలుగు వెలిగాడు. తమిళ కమేడియన్‌ వడివేలు ఉంటే వెంగళరావు ఉన్నట్లే అన్న తరహాలో పేరు సంపాదించుకున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన దొంగమొగుడు, ముగ్గురు మొనగాళ్లు వంటి సినిమాల్లో నటించి తన సత్తాను చాటుకున్నాడు. 

  అనారోగ్యంతో ఆస్పత్రిపాలు

వెంగళరావు ప్రస్తుతం వృద్ధాప్యంతో పాటు పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. కంకిపాడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రికి చెల్లించాల్సిన బిల్లులు కూడా డబ్బులు లేక ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆయన సతీమణి వేముల చిన్న కొండమ్మ తీవ్ర ఇబ్బందులు పడుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉదయం నుంచి 20 మంది ఫోన్లు చేసి వెంగళరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారే తప్ప పట్టించుకునే వారే కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

  అనారోగ్యంలోనూ అభిమానాన్ని పక్కన పెట్ట లేదు

అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వెంగళరావు మిడియా ముందుకు వచ్చేందుకు నిరాకరించారు. తన అనారోగ్య పరిస్థితి పేపర్లలో రాస్తే అది చూసి ప్రముఖులు తన పరిస్థితిపై ఆరా తీస్తారనీ, తనకు ఇటువంటివి ఇష్టం ఉండవని అన్నారు. 


Updated Date - 2022-06-30T05:35:15+05:30 IST