హైలేవల్‌ కాలువలపై మరోసారి కదలిక

ABN , First Publish Date - 2020-05-31T11:07:12+05:30 IST

నిర్మల్‌ జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం

హైలేవల్‌ కాలువలపై మరోసారి కదలిక

సదర్‌మాట్‌పైనా నజర్‌ 

పనులు , నిధుల మంజూరు దిశగా చర్యలు 

ఉన్నతస్థాయి సమీక్షపై మరోసారి ఆశలు 

గుత్తేదారులను ఒప్పించేందుకు మంత్రి ఐకెరెడ్డి సమాలోచనలు 

సిఎం ఓఎస్‌డి శ్రీధర్‌ దేశ్‌పాండే నేతృత్వంలో కొత్త నివేదికలు 


నిర్మల్‌, మే 30 (ఆంధ్రజ్యోతి) : నిర్మల్‌ జిల్లాలో దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ప్యాకేజీనంబర్‌ 27, 28 హైవల్‌ కాలువల నిర్మాణం పనులు తిరిగి మొదలు పెట్టే దిశగా మళ్లీచర్యలు మొదలయ్యాయి. అలాగే అర్థాంతరంగా నిలిచిపోయిన ఈ రెండు కాలువలతో పాటు 15 వేలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన సదర్‌మాట్‌ బ్యారేజీ నిర్మాణ పనులపైనా కూడా అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను వెంటనే మొదలు పెట్టాలని అవ సరమైన యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించాలంటూ యంత్రాంగాన్ని ఆదేశించారు.


సీఎం ఆదేశాల మేరకు ఓఎస్‌డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డిలు హైలెవల్‌ కాలువలు, సదర్‌మాట్‌ బ్యారేజీ పనులను తిరిగి ప్రారంభింపజేసేందుకు రంగంలోకి దిగారు. ఈ మేరకు శనివారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఓఎస్‌డీ శ్రీధర్‌ దేశ్‌పాండేలు నిర్మల్‌ నియోజకవర్గంలో నిలిచిపోయిన 27వ నంబర్‌ హైలెవల్‌ కాలువ పనులను సందర్శించారు. ఇక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకొని అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల పరిహారం, అలాగే పరిహారంకు సంబందించిన నిధులు తిరిగి కాలువల నిర్మాణ పనులకు చేపట్టేందుకు అవసరం అయ్యే నిధులపై స్పష్టమైన హామీఇచ్చారు. నిధుల విషయంలో సీఎంతో చర్చించి ఆ నిధులను మంజూరు చేయిస్తామని గుత్తేదారులకు భరోసానిచ్చారు.


ఈ ఉన్నతస్థాయి సమీక్షతో ఇటు హైలెవల్‌ కాలువలతో పాటు సదర్‌మాట్‌ బ్యారేజీ నిర్మాణంపైనా మళ్లీ ఆశలు రేకేత్తుతున్నాయి. గత కొంతకాలం నుంచి బిల్లులు సక్రమంగా మంజూరుకాకపోవడంతో గుత్తేదారులు ఈ రెండు హైలేవల్‌ కాలువల నిర్మాణ పనులను అర్థాంతరంగా నిలిపివేశారు. అలాగే సదర్‌మాట్‌ గుత్తేదారు కూడా బిల్లులు సక్రమంగా విడుదలకాకపోవడంతో ఆ పనులను కూడా ఆయన ఆపివేశారు. దీనికి తోడు సదర్‌మాట్‌ బ్యారేజీ కోసం సేకరించిన భూములకు అలాగే హైలెవల్‌ కాలువల కోసం సేకరించిన భూములకు ఇప్పటి వరకు కూడా పరిహారం డబ్బులు పూర్తిస్థాయిలో చెల్లించలేదు. పరిహారం డబ్బుల కోసం భాధిత రైతులు ఇప్పటికే చాలాసార్లు ఆందోళనలు సైతం చేపట్టారు. దాదాపు 1లక్ష15వేల ఎకరాలకు సాగునీరు అందించే రెండు కాలువలు, బ్యారేజీలపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే నిధులు ఎప్పటికప్పుడు సక్రమంగా విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ పనుల కోసం కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన సదరు గుత్తేదారు తమకు సకాలంలో బిల్లులు రాని కారణంగా వారు పనులు చేయలేమంటూ చేతులేత్తేశారు. దీంతో దాదాపు రెండు, మూడేళ్ల నుంచి పనులు ఆగిపోయాయి.


రైతులు దీని కారణంగా సాగునీటి ఆశలను సైతం కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఇటీవలే సీఎం కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్ట్‌లపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను యుద్ద ప్రతిపాదికన చేపట్టాలంటూ ఆదేశించడంతో మళ్లీ ఈ దిశగా కద లిక మొదలైంది. 


కలగానే లక్ష ఎకరాలకు సాగునీరు

నిర్మల్‌ నియోజకవర్గంలోని 50 వేల ఎకరాలకు  సాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన 27వ నంబర్‌ ప్యాకేజీ హైలెవల్‌ కాలువ, అలాగే ముథోల్‌ నియోజకవర్గంలోని మరో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని చేపట్టిన 28వ నంబర్‌ ప్యాకేజీ హైలెవల్‌ కాలువలపై ఆయా నియోజకవర్గాల రైతాంగం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ కాలువల నిర్మాణాలు పూర్తయితే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ల నుంచి పుష్కలంగా తమ పంట చేనులకు గోదావరి జలాలు అందు తాయని రైతులు ఆశపడ్డారు. మొదట ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్‌ పరిధిలో ఈ రెండు హైలెవల్‌ కాలువల నిర్మాణ పనులకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అంకురార్పణ చేశారు. జలయజ్ఙంలో భాగంగా ఈ హైలెవల్‌ కాలువల రూపకల్పన జరిగింది. దాదాపు 700 కోట్ల ప్రతిపాదనలతో 27వ నంబర్‌ కాలువ, అలాగే మరో రూ. 650 కోట్లతో 28వ నంబర్‌ కాలువ పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు రూపొందించారు.


అయితే మొదటి నుంచి ఈ కాలువలకు సంబంధించిన భూ సేకరణ వ్యవహారం వివాదాలకు ఆస్కారమిచ్చింది. భూములు కోల్పోయిన రైతులకు పరిహారాన్ని సక్రమంగా చెల్లించకపోవడంతో రైతులు ఆందో ళన కూడా చేపట్టారు. అయితే కొంతమేరకు పరిహారం చెల్లించి కాలువ పనులను చేపట్టారు. అలాగే గుండంపల్లి వద్ద భారీ వెల్‌ను కూడా నిర్మించారు. మిగతా పనులకు సంబందించిన బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో సంబంధిత గుత్తేదారులు పనులను నిలిపివేశారు.  ప్రస్తుతం 27వ, 28వ నంబర్‌ ప్యాకేజీ పనులు నిలిచిపోగా చేపట్టిన పనులు శిథిలావస్థకు చేరుకుంటున్నాయన్న అభిప్రాయాలు న్నాయి. గుత్తేదారులతో పలుసార్లు అధికారులు, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చర్చలు జరిపినప్పటికీ వారు పనులు చేసేందుకు ముందుకు రాలేదు. పెరిగిన అంచనా వ్యయానికి అనుగుణంగా కొత్తరేట్ల ప్రకారం తమకు బిల్లులు చెల్లించాలని గుత్తేదారులు పట్టుబడుతున్నారు. ఇప్పటి వరకు 27వ ప్యాకేజీ కోసం రూ. 256.58 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. భూ సేకరణ కోసం 97.09 కోట్ల రూపాయలను చెల్లించారు. అయితే చాలా రోజుల తరువాత హైలెవల్‌ కాలువల దిశగా మళ్లీ కదలిక మొదలవ్వడంతో రైతులు మరోసారి ఆశలు పెట్టుకుంటున్నారు. 


సదర్‌మాట్‌ది అదే పరిస్థితి

మామడ మండలం పొన్కల్‌వద్ద నిర్మిస్తున్న సదర్‌మాట్‌ బ్యారేజీ పనులు కూడా అర్థాంతరంగా నిలిచిపోయాయి. దాదాపు 15 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ బ్యారేజీ నిర్మాణం కోసం ఇప్పటి వరకు 195.33 కోట్లు వ్యయం చేశారు. మరో 212.78 కోట్ల పనులు బ్యాలెన్స్‌గా ఉన్నాయి. అలాగే దీని అంచనాలు కూడా పెరిగిపోయాయి. చేసిన పనులకు బిల్లులు సక్రమంగా రాకపోవడంతో సదరు గుత్తేదారు పనులు నిలిపి వేయడమే కాకుండా సామాగ్రిని సైతం తరలించుకొని పో యాడు. అయితే శనివారం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌ దేశ్‌ పాండేలు సదర్‌మాట్‌ బ్యారేజీపై సమీక్ష సమావేశం నిర్వహించి నిర్మాణ పనులకు సంబందించిన నిధులు పరిహారం డబ్బుల మంజూరుకు చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించడంతో ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. 


మంత్రి అల్లోల చొరవతో..

నిర్మల్‌ జిల్లాలో 27, 28వ ప్యాకేజీ హైలేవల్‌ కాలువల నిర్మాణం సదర్‌మాట్‌ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి చొరవతోనే తెరపైకి వచ్చాయి. దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిని ఒప్పించిన ఇంద్రకరణ్‌రెడ్డి వాటి మంజూరును సైతం సాధించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు కాలువలు కాలేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోకి చేర్చారు. దీనికి తోడుగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ పునరుజ్జీవ పథకంతో కూడా ఈ రెండు హైలేవల్‌ కాలువలకు సాగునీటి ప్రయోజనం దక్కుతుందని మంత్రి అదికారులకు దిశా నిర్దేశం చేశారు. పనులు అనూహ్యంగా నిధుల కొరత రూపంలో నిలిచిపోయాయి. గుత్తేదారు పనులు చేయనంటూ చేతులు ఎత్తేశారు. ఈ క్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పలుసార్లు జోక్యం చేసుకొని కాంట్రాక్టర్‌లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఒక దశలో హైదరాబాద్‌లో కూడా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహింపజేసి పనులు తిరిగి మొదలయ్యేందు కోసం ప్రయత్నించారు.


అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో పనులన్ని ఆగిపోయాయి. పట్టు వదలిన విక్రమార్కుడిలా మంత్రి నిలిచిపోయిన నీటి ప్రాజెక్ట్‌ల పనుల వెనకపడ్డారు. సమస్య తీవ్రతను సీఎం దృష్టికి తీసుకుపోయారు. ఇందులో భాగంగానే శనివారం ఓఎస్‌డీ శ్రీధర్‌ దేశ్‌పాండేను కూడా నిర్మల్‌కు రప్పించి ఆయనను కాలువ వద్దకు తీసుకువెళ్ళారు. అనంతరం సమీక్ష సమావేశం సైతం ఏర్పాటు చేశారు. మంత్రి చొరవతో నిధులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. నిధులు విడుదలైతే పనులు కూడా తిరిగి మొదలయ్యే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. 

Updated Date - 2020-05-31T11:07:12+05:30 IST