బైక్‌పై ఒక్కరు.. ఆటోలో ముగ్గురు.. కరోనా కట్టడికి సత్వర చర్యలు

ABN , First Publish Date - 2020-08-12T18:49:09+05:30 IST

కరోనాను కట్టడి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సత్వర చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి మంగళవారం అత్యవసర సమావేశాన్ని

బైక్‌పై ఒక్కరు.. ఆటోలో ముగ్గురు.. కరోనా కట్టడికి సత్వర చర్యలు

మంత్రి ఆదేశాలతో రంగంలోకి 

మాస్కు లేకుంటే రూ.వెయ్యి జరిమానా

గురుకులాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు 

ప్రతీ గ్రామానికి 5 ఆక్సిమీటర్లు

ప్రైవేట్‌ ఆస్పత్రులకు దిశానిర్ధేశం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట : కరోనాను కట్టడి చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం సత్వర చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి మంగళవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌డేవి్‌సతో కలిసి జిల్లా అధికారులు, ప్రైవేట్‌ ఆస్పత్రుల యజమానులు, వైద్యారోగ్య సిబ్బంది సమక్షంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణంగా ద్విచక్రవాహనాలపై ఇద్దరు, ఒక్కోసారి ముగ్గురు కనిపిస్తుంటారు. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం జిల్లా అంతటా ఒక బైక్‌పై ఒక్కరే వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితి ఉంటేనే ఇద్దరికి మినహాయింపు అని పేర్కొన్నారు. ఇక ఆటోలో డ్రైవర్‌తో పాటు వెనుక సీట్లో ఇద్దరు మాత్రమే కూర్చోవాలని నిర్ణయించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామన్నారు. అంతేగాకుండా బైక్‌పై వెళ్లేవారు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలనే నిబంధనను విధించారు. 


మాస్కు లేకుంటే తిరిగితే జరిమానా

బహిరంగ ప్రదేశాల్లో మాస్కు లేకుండా తిరిగేవారిపై పోలీసులు కొరడా ఝులిపించనున్నారు. మాస్కు లేకుంటే రూ.వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయించారు. గతంలోనూ మాస్కు ధరించాలని పలు హెచ్చరికలు చేసినప్పటికీ  ప్రయోజనం లేకుండా  పోయింది. అందుకే ఈసారి జరిమానాతో సరిదిద్దాలని భావించారు. ఇక భౌతికదూరం పాటించే విధంగా కూడా పోలీసులు చర్యలు చేపట్టనున్నారు. 


ప్రైవేట్‌ ఆస్పత్రులకు బాధ్యతలు

జిల్లాలో ఉన్న పలు ప్రైవేట్‌ ఆస్పత్రులకు కొవిడ్‌ చికిత్స బాధ్యతలు అప్పగించడానికి నిర్ణయించారు. ఆస్పత్రుల్లో కాకుండా పట్టణాలకు చేరువగా ఉన్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలను చికిత్సా కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని భావించారు. అయితే చికిత్స చేసే బాధ్యతతోపాటు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని కూడా ప్రైవేట్‌ ఆస్పత్రులే సమీక్షించాలని సూచించారు. ఇందుకోసం నిర్ధిష్టమైన ధరలను ఫిక్స్‌ చేయాలని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి తగిన సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. సామాజిక బాధ్యతను చాటాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. 


ఇంటింటికీ వైద్య బృందాలు

ప్రతీ ఇంటికీ వైద్య బృందాలు వెళ్లి ఆయా కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీయనున్నాయి. తొలుత సిద్దిపేట పట్టణంలోని 26వేల ఇళ్లలో ఉన్న 39వేల కుటుంబాల వద్దకు వెళ్లనున్నారు. ఇందుకోసం ప్రతీ వార్డుకు కొవిడ్‌ అవగాహన బృందాలను ఏర్పాటు చేయాలని భావించారు. ఇందులో మెప్మా రిసోర్స్‌ పర్సన్‌, శానిటేషన్‌ వర్కర్‌, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ టీచర్‌ ఉంటారు. ప్రతీ ఆరు వార్డులకు ఒక వైద్యాధికారి పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తారు. అంతేగాకుండా జిల్లాలోని ప్రతీ గ్రామానికీ ఐదు చొప్పున ఆక్సీమీటర్లను పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. 


మాస్కు లేని వారికి జరిమానా : సీపీ 

కరోనా వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందుతున్ననందున ప్రతిఒక్కరూ వ్యాధి బారిన పడకుండా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. స్వీయ నియంత్రణ పాటించి, పోలీసుల సూచనలు, సలహాలు పాటించాలని, కరోనా వ్యాధి నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. మాస్కులు లేకుండా ఎవరు కూడా ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని అలాంటి వారిపై జరిమానా విధిస్తామని తెలిపారు. ద్విచక్రవాహనంపై ఒకరు మాత్రమే ప్రయాణించాలని, ప్రయాణించే సమయంలో తప్పకుండా హెల్మెట్‌,  మాస్కు ధరించాలని సూచించారు. ఆటోలో ముగ్గురు మాత్రమే ప్రయాణించాలని పేర్కొన్నారు. కరోనా రోగులపై వివక్ష చూపించరాదని తెలిపారు. కరోనాకు సంబంధించిన ఏవైనా లక్షణాలు కనబడగానే ప్రాథమిక దశలోనే టెస్టులు చేయించుకోవాలన్నారు.


ముండ్రాయిలో నలుగురిపై కేసు

మాస్కులు లేకుండా బయట తిరిగితే  కేసు నమోదు చేస్తామని రాజగోపాలపేట ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు. జిల్లా పోలీసు కమిషనర్‌ జోయెల్‌ డేవిస్‌ ఆదేశాల మేరకు మంగళవారం పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా ముండ్రాయి గ్రామ ప్రధాన రోడ్డుపైన మాస్కులు లేకుండా కూర్చొని మాట్లాడుతున్న నలుగురు యువకులపైన కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కరోనా వ్యాధిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ సహకరించి భౌతిక దూరం పాటించడంతో పాటు తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ఎస్‌ఐ సూచించారు.

Updated Date - 2020-08-12T18:49:09+05:30 IST